షర్మిల ఎడమకాలి మడమకు గాయం

బూడిదంపాడు (ఖమ్మం జిల్లా), 29 ఏప్రిల్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రికురాలు శ్రీమతి షర్మిల ఎడమకాలి మడమకు గాయం అయింది. ఖమ్మంజిల్లా బూడిదంపాడు రచ్చబండ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొని బయలు దేరి, కొద్దిదూరం నడవగానే జనం తోపులాట ఎక్కువైంది. కొందరు అదుపు తప్పి శ్రీమతి షర్మిల కాళ్లకు అడ్డంపడ్డారు. వారిని తప్పించే ప్రయత్నంలో ఆమె కాలు గుంతలో పడి మడమ బెణికింది.

గతంలో శ్రీమతి షర్మిల కుడి మోకాలు గాయానికి సర్జరీ చేసిన ‌ఎముకల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ‌సిఎస్ రెడ్డి ప్రతి ఆదివారం వచ్చి ‌ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. శ్రీమతి షర్మిల మడమ బెణికిన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు. శ్రీమతి షర్మిలకు డాక్టర్‌ సిఎస్‌రెడ్డి ప్రథమ చికిత్స చేశారు. ఆ నొప్పితోనే శ్రీమతి షర్మిల మరి కొంత దూరం నడిచి మధ్యాహ్నం భోజన విరామ కేంద్రానికి చేరుకున్నారు.

ఆ తరువాత ఆమెకు నొప్పి తీవ్రం కావడంతో డాక్టర్ సిఎస్ రెడ్డి, డాక్ట‌ర్ హరికృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మడమ భాగంలోని కండరానికి గాయమైందని, కనీసం ఒకరోజు విరామం తీసుకోవాలని వారు సూచించారు. దీంతో సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు ‌పార్టీ కార్యక్రమాల కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం ‌ప్రకటించారు. సోమవారం పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పాదయాత్ర తదుపరి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
Back to Top