పెద్దేరు రిజర్వాయరును పరిశీలించిన షర్మిల

చోడవరం 28 జూన్ 2013:

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని పెద్దేరు రిజర్వాయరును శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం సందర్శించారు. వేలాదిమంది రైతులను ఆదుకోవడానికి శంకుస్థాపన చేసిన రిజర్వాయరిది. నేడిది పూర్తిగా ఎండిపోయింది. సంధాన కాల్వలు లేకపోవడమే దీనికి కారణమని అక్కడి రైతులు చెబుతున్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం చోడవరం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె పలువురు రైతులతో మాట్లాడారు. రిజర్వాయరు పరిస్థితిని కళ్ళారా చూశారు. పార్టీ నేతలు బలిరెడ్డి సత్యారావు, తదితరులు ఆమె వెంట ఉన్నారు. పెద్దేరు రిజర్వాయరు నీటితో ఇరవై వేల ఎకరాలు సాగయ్యే అవకాశముందని రైతులు చెప్పారు. కిరణ్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇది నిరుపయోగంగా పడి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ప్రాజెక్టుకు 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. దీని పనులను మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిచేశారని తెలిపారు. మూడు మండలాలకు చెందిన రైతులకు ఇది ఉపయోగపడుతుందని బలిరెడ్డి సత్యారావు చెప్పారు. 50 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది పూర్తయ్యిందన్నారు. ఈ ప్రభుత్వం మరికొంత చొరవ చూపితే ఎంతోమందికి అన్నం పెట్టినవారవుతారన్నారు. ఒక్కరోజు గేట్లు ఎత్తకుండా ఉంటే కింద ఉన్న చెరువులు నిండి వ్యవసాయం చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. లింకు కాల్వలు పూర్తయితే ఈ ప్రాంతంలో వలసలు ఆగిపోతాయని స్థానికులు చెబుతున్నారు. పనులు పూర్తికాకపోవడంతో నిరాశతో ఉన్నామని ఓ రైతు చెప్పారు. కాల్వలకు లైనింగు లేదు.. ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. నీరు కొట్టుకుపోవడమే తప్ప సాగు ఉపయోగపడినదాఖలా లేదన్నారు. కాల్వ వెంట నీరు పారడం తామింతవరకూ చూడలేదన్నారు. రాజశేఖరరెడ్డిగారుండగా ఈప్రాంతంలో నీరు చక్కగా పారిందనీ, రైతులు చక్కగా వ్యవసాయం చేసుకుని పచ్చగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన మరణానంతరం ఈ ప్రాంతమంతా బీడుపోయింది. రాజన్న బిడ్డ షర్మిలకు తమ గోడు వినిపించుకోడానికి  రోడ్డుమీద పడిగాపులు పడి ఉన్నామని చెప్పారు. జగనన్న వచ్చినతర్వాతైనా ఈ ప్రాంతాన్ని ఆదుకుంటారని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతానికి నీరందేలా చూస్తామని శ్రీమతి షర్మిల వారికి హామీ ఇచ్చారు.

Back to Top