తిరుపతి నుంచి షర్మిల బస్సు యాత్ర

హైదరాబాద్ 30 ఆగస్టు 2013:

చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి వచ్చే నెల రెండున శ్రీమతి వైయస్ షర్మిల బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సమాధి వద్ద తొలుత ఆమె నివాళులర్పిస్తారని చెప్పారు. అనంతరం తిరుపతి చేరుకుని అక్కడ సాయంత్రం 5గంటలకు ఏర్పాటయ్యే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు ఈ సభలో పాల్గొంటారు. మూడు నాలుగు వారాలలో సీమాంధ్ర ప్రాంతంలోని పదమూడు జిల్లాలను చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  రానున్న రెండు రోజుల్లో యాత్ర పూర్తి వివరాలను అందిస్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఈ విషయాలను మీడియాకు తెలియజేశారు. సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ముగింపు సమావేశంలో శ్రీమతి వైయస్ షర్మిల విజ్ఞప్తి చేసిన అంశాన్ని అంబటి గుర్తుచేశారు. కిందటి నెలరోజుల్లో సీమాంధ్రలో మహోద్యమం నడుస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీలుస్తామనీ, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మంకుపట్టుపట్టిందని చెప్పారు. మరో పక్క టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా అదే ధోరణిలో ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ చేపడుతున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని అంబటి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మహానేత వర్థంతిని ఘనంగా నిర్వహించాలి
డాక్టర్ రాజశేఖరరెడ్డి గారు మరణించి నాలుగేళ్ళవుతోంది.. అదో పీడకలలా ఉంది.. ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలో పరిస్థితులు చూస్తున్న మేధావులు... ప్రజలు.. అన్ని వర్గాల వారూ రాజశేఖరరెడ్డిగారు ఉండి ఉంటే ఇలా ఉండేది కాదనే మాట అంటున్నారు. ప్రతి ఇంటా ఇదే మాట వినిపిస్తోందని అంబటి పేర్కొన్నారు. ధరలు పెరిగినప్పుడు, రాష్ట్రం అతలాకుతలమవుతున్నప్పుడు, ఆర్థికంగా వెనుకబడుతున్నప్పుడు, అభివృద్ధి కుంటుపడుతున్నప్పుడు  ప్రతి క్షణం రాజశేఖరరెడ్డిగారుండి ఉంటే ఇలా జరిగుండేదా అనే బాధ ప్రతి ఒక్కరిలో కలుగుతోందన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ, ఇతర నాయకులు ఢిల్లీ వెళ్లి తనను కలిసిన వారితో 'రాజశేఖరరెడ్డి గారుండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు' అని ప్రధాన మంత్రి కూడా అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువరించిన వెంటనే అందరిలోనూ ఇదే ప్రశ్న తలెత్తింది.. రాజశేఖరరెడ్డిగారు జీవించిఉంటే సోనియా గాంధీ ఇంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసుండేదా అనే ఆలోచన అందరిలో కదలాడిందన్నారు. రాజశేఖరరెడ్డిగారున్న అయిదేళ్ళ మూడు నెలల్లో రాష్ట్రాన్ని విభజించాలన్న వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతూ వచ్చిందన్నారు. ఆయన లేకపోవడం వల్లే రాష్ట్రం అతలాకుతలమవుతోందనీ, బతుకు దుర్భరంగా మారిపోయిందనీ ప్రజలంతా అనుకోని రోజు లేదన్నారు. అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఇదే భావన ఉందంని చెప్పారు. రాజశేఖరరెడ్డిగారు హఠాత్తుగా కనుమరుగైన సందర్భాన్ని తలచుకుని బాధపడని వారు లేరు... బాధగా ఉన్నప్పటికీ ఆయన నాలుగో వర్థంతిని ఘనంగా నిర్వహించాలని అంబటి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ రోజున ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలతో సత్కరించాలని కోరారు. పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలనీ, తదనంతరం రక్తదానాలు చేయాలనీ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను చేయాని పార్టీ శ్రేణులను, వైయస్ఆర్ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

మా పార్టీ చిత్తశుద్ధికి తార్కాణం
ఆంధ్ర రాష్ట్రం నిట్టనిలువుగా చీలిపోకుండా నిష్కల్మషంగా ప్రయత్నిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంబటి చెప్పారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని పత్రికల ద్వారా ముందే పసిగట్టి జూలై 27వ తేదీనే తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం శ్రీమతి విజయమ్మగారు గుంటూరు నిరాహార దీక్ష చేపట్టారు.. ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆరు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు...రెండో తేదీనుంచి శ్రీమతి షర్మిల బస్సు యాత్ర చేయబోతున్నారు... ఇంతకంటే తమ పార్టీ చిత్తశుద్ధికి ఆధారాలేం కావాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీనుంచి చేపట్టే బస్సు యాత్ర ద్వారా మా ఈ ప్రయత్నాన్ని కలుషితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమంపై నీళ్ళు జల్లడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని  మండిపడ్డారు. గతంలో శ్రీకాకుళం నుంచి ఆత్మ గౌరవ యాత్ర ప్రారంభించాలనుకున్న చంద్రబాబు... అన్నదమ్ముల్లా విడిపోదాం.. ఆత్మీయుల్లా కలిసుందామని చెప్పారన్నారు. ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పకుండా మొదలుపెడితే సీమాంధ్రలోని ఉద్యమకారులు సహించరని అప్పట్లో ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకరరావు వ్యాఖ్యానించిన విషయాన్ని అంబటి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీన్ని చంద్రబాబునాయుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మగౌరవ యాత్ర అంటే ఏమిటో సీమాంధ్రలో ప్రవేశించేముందు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వాదాన్ని అక్కడ వినిపించడం కోసం జరుగుతున్న ప్రయత్నంగా భావిస్తున్నామని అంబటి తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top