సిగ్గులేని మంత్రులు.. సిగ్గులేని ప్రభుత్వం

ఉరవకొండ: అనంత రైతాంగం దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. కష్టాల కడలిలో ఉన్న రైతులను ఆదుకోకుండా బాబు చోద్యం చూస్తుంటే.... నేనున్నానంటూ వారికి భ‌రోసా ఇచ్చేందుకు  ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ వ‌చ్చార‌ని తెలిపారు. దేశంలో అత్యంత కరువు జిల్లాలు అయిన రాయ‌ల‌సీమ‌లో తాగ‌డానికి మంచినీరు కూడా దొర‌క‌డం లేద‌న్నారు. అలాంటి జిల్లాల్లో తాగు, సాగునీరు అందించాలంటే కృష్ణా జిల్లాలే శ‌ర‌ణ్యం అన్నారు. చంద్రబాబు ఉన్న తొమ్మిది సంవత్సరాల్లో హంద్రీనీవా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదన్నారు. ఆరు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి 2004లో వైయస్ఆర్ హంద్రీనీవా చేపట్టారని...రూ. 4 లక్షల కోట్లు ఖర్చు చేసి 90 శాతం ప్రాజెక్టు పూర్తి చేశార‌ని పేర్కొన్నారు.  చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయినా అనంత భూమిని ఒక్క అంగుళమైనా తడపలేదన్నారు.  ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నార‌న్నారు. హంద్రీనీవా ద్వారా పక్క జిల్లాలకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నార‌న్నారు. చంద్రబాబు మెడలు వంచి అనంతపురం జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వడానికి వైయస్‌ జగన్‌ మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టార‌న్నారు. వైయస్‌ జగన్‌ దీక్షను భగ్నం చేయడానికి టీడీపీ ప్రభుత్వం కుటిలప్రయత్నాలు చేస్తోంద‌న్నారు.  వైయస్‌ఆర్‌ మొదటి దశగా లక్షా 20 వేల ఎకరాలకు నీరు ఇస్తే చంద్రబాబు ప్రభుత్వం ఒక జీవో ద్వారా మరణశాసనం రాసిందని మండిపడ్డారు. 15 ఎకరాల రైతు పొట్ట చేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లి యాచకుడిగా మారుతున్నాడంటే ప‌రిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

Back to Top