ధర్నా సక్సెస్ తో టీడీపీలో వణుకు

– అక్రమ కేసులు బనాయించి సభను అడ్డుకోవాలని చూశారు
– దామచర్ల, శిద్ధాలకు వైయస్‌ జగన్‌ను విమర్శించే స్థాయి లేదు 
– అసత్యాలు ఆపి నిజాలు తెలుసుకోండి
– విలేకరుల సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల

హైదరాబాద్ః ఆరోగ్యశ్రీ అమలు తీరును నిరసిస్తూ ఒంగోలులో జరిగిన ధర్నా విజయవంతం కావడాన్ని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. పార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అపర సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి టీడీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. ఆరోగ్యశ్రీకి సరిపడా కేటాయింపులు చేయాలని టీడీపీ నాయకుడు, ముఖ్యమంత్రిని ప్రశ్నించాల్సిన దామచర్ల జనార్దన్, శిద్ధా రాఘవరావులు వారి స్థాయిని మరిచి ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు గుప్పించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సభ నిర్వహించుకునేందుకు అనుమతి అడిగితే నిరాకరించడం కూడా వారి కుట్రను తెలియజేస్తుందన్నారు. 

ఉచితంగా ఒక్క ఇంజక్షన్‌ ఇచ్చారా
దివంగత మహానాయకుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంవత్సరానికి ఆరోగ్యశ్రీ పథకం కోసం 1100 కోట్లు కేటాయించారని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అందులో సగం కేటాయించడానికి కూడా అల్లాడిపోతున్నారని తెలిపారు. మహానేత హయాంలో ఎంతోమంది ఉచిత వైద్యం చేయించుకుని జీవితాలను బాగు చేసుకుంటే చంద్రబాబు ఒక్క ఇంజక్షన్‌ అయినా ఉచితంగా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంతోమంది పేదలకు సంజీవనిలా మారిన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకోవాల్సింది పోయి పేదల పక్షాన పోరాడుతున్న వైయస్‌ జగన్‌పై విమర్శలు గుప్పించడం వారి అజ్ఞానాన్ని సూచిస్తుందన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించేవారైతే ఇలాంటి వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేయరన్నారు. ప్రకాశం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గొంతు తడుపుకోవడానికి కూడా గుక్కెడు మంచినీరు దొరకని పరిస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా ఆదుకోవాలో ఆలోచించకుండా ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న మా నాయకుడిని విమర్శిస్తే మాత్రం సహించబోమని హెచ్చరించారు. అధికార మదంతో పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి కళ్లు లె రిపించడానికే ఈ ధర్నా నిర్వహించామని స్పష్టం చేశారు. కోటీ 30 లక్షల కుటుంబాలకు 560 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. అందులోనూ బకాయిలే దాదాపు 390 కోట్లు ఉందన్నారు. మరి చాలీచాలని నిధులతో అందరికీ వైద్యం ఎలా చేస్తారా చెప్పాలన్నారు. 

రిమ్స్‌ కట్టించింది వైయస్‌ఆర్‌ కాదా..
ప్రజలకు ఏదో చేశామని గొప్పలు పోతున్న టీడీపీ ప్రభుత్వం ఏం మేళ్లు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఒంగోలు పట్టణంలో ఉన్న రిమ్స్‌ కూడా మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చలవ, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిల వలనే ఏర్పాటైందన్నారు. దామచర్ల జనార్దన్, శిద్ధా రాఘవరావులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడిని విమర్శించే స్థాయి మీకుందో లేదో ఆత్మావలోకనం చేసుకోవాలని హితవు పలికారు. ఆరోగ్యశ్రీ పథకం అమలు కావాలంటే సంబంధిత అధికారులు 910 కోట్లు కావాలని చెబితే కేవలం 560 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. జనానికి మంచి వైద్యం అందించాలంటే కావాల్సిన నిధులు రాబట్టే సత్తా లేదుకానీ.. నోటికొచ్చినట్లు అసత్య ప్రచారం చేయడం వచ్చుననీ.. అది మానుకోవాలని టీడీపీ నాయకులకు సూచించారు. సాక్షాత్తు వైద్యారోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్‌ కూడా నిధులివ్వలేనని చేతులెత్తేసిన సంగతి మరిచిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. ఒంగోలులో ప్రతిపక్ష నాయకుడి సభకు అనుమతి కోరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ద నిధులు విడుదలయ్యేలా చూడటంపై పెట్టాలని హితవు పలికారు. జిల్లాలోని చాలా పీహెచ్‌సీల్లో డాక్టర్లు కూడా లేరని మండిపడ్డారు. 
Back to Top