షాదీ ఖానా కమిటీ ప్రోటోకాల్ ఉల్లంఘన

–వైయస్సార్‌సీపీ మైనారిటీ సెల్‌నిరసన
తిరువూరులో ఈ నెల 24న నిర్వహించనున్న షాదీఖానా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్‌ను విస్మరించారని వైయస్సార్‌సీపీ మైనారిటీ విభాగ నాయకులు ఆరోపించారు. గురువారం స్థానిక వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనారిటీ విభాగ జిల్లా కమిటీ సభ్యుడు షేక్‌జాకీర్‌ మాట్లాడుతూ... ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలో నియోజకవర్గ ప్రథమ పౌరుడైన ఎమ్మెల్యే రక్షణనిధి పేరును ప్రోటోకాల్‌ ప్రకారం ముద్రించలేదన్నారు. 3 సార్లు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు ఫొటో, పేరు ప్రముఖంగా ముద్రించడంతో పాటు పార్టీ కరపత్రాన్ని పోలినట్లు చంద్రబాబునాయుడు, కేశినేని నానీ, దివంగత ఎన్టీరామారావు ఫొటోలను ముద్రించడం ఏమిటని ప్రశ్నించారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా షాదీఖానా ప్రారంభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. తహశీల్దారు బాలకృష్ణారెడ్డి చైర్మన్‌గా ఉండాల్సిన షాదీఖానా కమిటీని జామియా మసీదు కమిటీ చైర్మన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేయడానికి ఎవరు అనుమతిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయాల కతీతంగా షాదీఖానా ప్రారంభ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్‌చేశారు. మైనారిటీ నాయకులు రాజ్‌మహ్మద్, ముజీబ్, గఫార్‌పాల్గొన్నారు.
Back to Top