కేబినెట్‌ మీటింగ్‌లో సెటిల్‌మెంట్లు

  • సంక్షోభంలో ప్రజల ఇబ్బందులు పట్టించుకోని సర్కార్‌
  • భూ కేటాయింపుల కోసమే కేబినెట్‌ భేటీలు
  • ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై చర్చించే నాథుడే కరువు
  • ప్రతిపక్ష పార్టీ సూచనలు విస్మరించిన సీఎం
  • వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ఆంధ్ర ప్రదేశ్‌ కేబినెట్‌ మీటింగ్‌ సెటిల్‌మెంట్లకు వేదికగా మార్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా నిన్న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ‘‘మీకెంత..మాకెంత’’ అని వాటాలు పంచుకున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో ..ఏ ఒక్కరు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను వదిలి ప్రతి రోజు గంటల తరబడి సామాన్య ప్రజలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రజలు ఆకలితో అల్లాడుతుంటే దానిపై చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం కాలాయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇటువంటి సమయంలో కేబినెట్‌ మీటింగ్‌ జరగడంతో ఉపశమనం కలిగించే మంచి నిర ్ణయాలు తీసుకుంటారని ప్రజలు ఆశించారని చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించే నిర్ణయాలు తీసుకుంటారని అందరూ భావించారన్నారు. కానీ డిసెంబర్‌ 1న  జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ప్రజల తరఫున ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోగా..రౌడీలు, గుండాలు కూర్చోని సెటిల్‌మెంట్‌ చేసుకునే విధంగా కేబినెట్‌ మీటింగ్‌ జరిగిందని ధ్వజమెత్తారు. కేబినెట్‌ మీటింగ్‌ తాత్కాలిక రాజధానిలో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ తాత్కాలిక రాజధాని కూడా ఎందుకు కట్టారంటే..టీడీపీ ఎమ్మెల్యే రూ. 5కోట్ల లంచం ఇస్తూ దొరికిపోయినందున ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు అక్కడికి పారిపోయారని ఎద్దేవా చేశారు. రూ.500, రూ.1000 నోట్ల మార్పిడిలో టీడీపీ నేతలు ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. రాజధాని ప్రకటన చేసిన రోజు నుంచి అవినీతి మొదలైందన్నారు. ల్యాండ్‌ ఫూలింగ్, తాత్కాలిక భవన నిర్మాణాల టెండర్‌లో అవినీతిమయమే అన్నారు. అవినీతి వృక్షం అనే బిల్డింగ్‌ కట్టి దాని నీడన కేబినెట్‌ మీటింగ్‌ పెట్టారని విమర్శించారు.

ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేదు
నిన్న జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కేబినెట్‌ మీటింగ్‌లో 13 నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన సర్క్యూలర్‌లో 3 తరువాత 4వ అంశం లేదని, 5వ అంశాన్ని మాత్రమే కనబరిచారని తప్పుపట్టారు. అంటే 4వ నంబర్‌ అంశం ఏ అవినీతి జీవోనో ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. 12 అంశాలపై ఆమోదం తెలిపారని, వీటిలో ఏడు అంశాలు భూ కేటాయింపులే అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూ కేటాయింపులపై ఎన్నో ఆరోపణలు చేశారని, అధికారంలోకి వచ్చాక భూ ఆక్రమణలకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుపై కేబినెట్‌ మీటింగ్‌లో ఎలాంటి చర్చే జరగలేదని తెలిపారు.

వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదు
పరిశ్రమల ఏర్పాటుకు వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకం కాదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేబినెట్‌ మీటింగ్‌లో భూ కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు చేశారని, అయితే ఇంతవరకు ఏ మేరకు పెట్టుబడులు సాధించారని నిలదీశారు. టీడీపీ అవినీతిని ప్రశ్నిస్తే..వైయస్‌ఆర్‌సీపీ అభివృద్ధికి అడ్డుపడుతుందని మాపై బురద జల్లుతున్నారని ఫైర్‌ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ రెండున్నరేళ్లలో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌ల్లో 50 శాతం భూ కేటాయింపులపైనే నిర్ణయం తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతుల కష్టాలు ఈ సర్కార్‌కు పట్టడం లేదన్నారు. రబీ గురించి అసలు ఆలోచించడం లేదని తప్పుబట్టారు. బ్యాంకుల నుంచి రైతులకు రుణాలు మంజూరు కావడం లేదని, రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వ్యాపారుల వద్ద డబ్బు లేదని, బ్యాంకుల్లో ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పంటల సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మంది చిల్లర వర్తకులు రోడ్డున పడ్డారని, తోపుడు బండ్ల వ్యాపారులు, కూలీల పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు. తనను ఓ కమిటీకి అధ్యక్షుడు చేశారని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టడం లేదన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని టీడీపీ సర్కార్‌ విస్మరించిందన్నారు. కేబినెట్‌ మీటింగ్‌లో ఉద్యోగులతో పూలు చల్లించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.

సీఎం తీరు బాధాకరం
రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారం రోజుల క్రితం వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రిని కలిస్తే ఆయన పట్టించుకోలేదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. మమ్మల్ని చూస్తే సీఎంకు మాట్లాడాలనిపించలేదని, అవమానకరంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు, నీటి బిల్లులు, ఇంటి పన్నుల  వసూళ్లు వాయిదా వేయాలని, విద్యా సంస్థల్లో ఫీజుల వసూలు ఆపాలని కోరామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎంను కోరినట్లు చెప్పారు. పింఛన్ల చెల్లింపుల్లో వంద నోట్లు అందజేయాలని, రేషన్‌ పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు చెప్పారు. గ్యాస్‌ సరఫరా, ఆర్టీసీ బస్సుల్లో పాసుల విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మేం చెప్పామని ఒక్క రేషన్‌ షాపుల విషయంలో మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నగదు మార్పిడిలో వెసులుబాటు కల్పించాలని, చిల్లర అందుబాటులో ఉంచాలని, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇప్పించాలని మేం కోరితే ఈ విషయాలేవి కూడా కేబినెట్‌లో చర్చించకపోవడం దుర్మార్గమన్నారు. పజా స్వామ్యదేశంలో ప్రజల బాధలను అర్థం చేసుకొని, వాటిని పరిష్కరించాల్సింది పోయి, ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలని చూడటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఇవి చాలవన్నట్లు మహిళల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌ పెట్టారని, ఉన్న బంగారాన్ని లాగేసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. నల్లధనం, అడ్డంగా దాచుకున్న బంగారం వెలికి తీసే విషయంలో అందరం సహకరిస్తామని, కానీ ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. ముందస్తు ప్రణాళిక లేకుండా చేస్తున్న విధానాన్ని వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వ్యక్తిగత లాభాల కోసం కేబినెట్‌ మీటింగ్‌లను ఉపయోగించుకోవడం సమంజసం కాదని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు.
 
Back to Top