జగన్ నాయకత్వం ప్రజలకు అవసరం: ఏబీకే

హైదరాబాద్, 31 ఆగస్టు 2013:

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలన్న కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయు‌డు ఏబీకే ప్రసాద్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన శనివారంనాడు హైదరాబాద్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయాల్సిన ‌శ్రీ జగన్ త్యాగాలకు పూనుకోవద్దని ఆయన ఈ సందర్భంగా హితవు పలికారు.

పదవులను అధిష్టించే తొందరలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంలో ఒక భాగం విభజించి పాలించే బ్రిటిష్‌ సామ్రాజ్య నీతినే అనుసరిస్తోందని ఏబీకే వ్యాఖ్యానించారు. ఈ సూత్రమే కాంగ్రెస్‌ పార్టీని దేశంలోని కొన్ని రాష్ట్రాల విభజనకు ఆలోచించేలా చేసిందన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్వార్ధ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ పార్టీ విభజన తంత్రాన్ని చేపట్టేలా చేసిందని దుయ్యబట్టారు.

ఈ సత్యాన్ని గమనించి రాష్ట్రానికి యువ నాయకులు దిశా నిర్దేశం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజలకు బాసటగా శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిలవాల్సిన సమయం ఆసన్నమైందని తన లేఖలో ఏబీకే పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీ జగన్‌ నాయకత్వం ప్రజలకు చాలా అవసరమని ఈ సందర్భంగా ఆయనకు ఏబీకే ప్రసాద్‌ గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో త్యాగాల మీద దృష్టి మరల్చకూడదని శ్రీ జగన్‌కు ఏబీకే సూచించారు. సమాజ గతిని మార్చగల పోరాట పటిమను శ్రీ జగన్ లాంటి యువకులు పెంచుకుంటూ అనుక్షణం మానసికంగా బల సంపన్నులు కావాల్సిన సమయం ఇది అన్నారు. శ్రీ జగన్‌ తన అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోవాలని, దీక్ష విరమించాలని ఏబీకే ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.

తాజా ఫోటోలు

Back to Top