సీమాంధ్ర సహారా ఎడారే!

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా),

4 ఆగస్టు 2013: రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం ఒక మహా సహారా ఎడారిగా మారిపోతుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు శ్రీమతి షర్మిల ఆందోళన వ్యక్తంచేశారు. సీమాంధ్రను విడగొడితే ఈ ప్రాంత ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందన్న ఇంగితజ్ఞానం కాంగ్రెస్‌ నాయకులకు ఉందా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 60 సంవత్సరాలుగా కలిసి నిర్మించుకున్న హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎందుకు హక్కు ఉండదని నిలదీశారు. రాయకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 320 రోజుల పాటు 3,112 కిలోమీటర్ల దూరం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేసిన శ్రీమతి షర్మిల ఆదివారం నిర్వహించిన ముగింపు సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్ర విభజన, చంద్రబాబు, సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుల తీరుపైన శ్రీమతి షర్మిల విమర్శలు ఆమె మాటల్లోనే..
కాంగ్రెస్‌ పార్టీ కేవలం తన రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మన రాష్ట్రాన్ని తలకాయ ఒకరికి, మొండెం ఒకరికి అని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇలా పై భాగం ఒకరికి, కింది భాగం ఒకరికి అని ఇస్తే.. కింది భాగం వారికి సాగు నీరు కాదు కదా కనీసం తాగు నీరు కూడా దిక్కుండదని తెలిసి కూడా ఈ పాపానికి పూనుకుంది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్రలో అవసరాలు తీరాక, కర్నాటకలో ఆల్మట్టి డ్యామ్‌, నారాయణపూర్‌ డ్యామ్‌ నిండితే తప్ప కింద ఉన్న మన రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వని తీరును చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండానే మధ్యలో ఇంకొక రాష్ట్రాన్ని సృష్టిస్తే.. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు‌లకు నీళ్ళెక్కడి నుంచి వస్తాయి? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తామంటున్నారు. కానీ పోలవరానికి నీళ్ళెక్కడి నుంచి వస్తాయో మాత్రం చెప్పడం లేదు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రం నీళ్ళు తప్ప మంచినీరు ఎక్కడుంది?

అసలు ఈ ప్రాంతం ఒక మహా సహారా ఎడారి అయిపోతుందనే ఇంగితం ఈ కాంగ్రెస్‌ నాయకులకు లేదనుకోవాలా? లేకపోతే సీమాంధ్ర ఎడారి అయిపోయినా పరవాలేదు మాకు తెలంగాణలో 15 ఎంపి సీట్లు వస్తే చాలు అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవాలా? గతంలో మద్రాసును తీసేసుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను 60 ఏళ్ళ తరువాత దీన్ని కూడా తీసేసుకుంటారా? సీమాంధ్రులకు హైదరాబాద్‌లో భాగం ఎందుకు ఉండకూడదు? హైదరాబాద్‌ ఇంతగా అభివృద్ధి అయిందంటే.. దాంట్లో సీమాంధ్రుల కృషి లేదా? మరి సీమాంధ్రులకు హైదరాబాద్‌లో భాగం ఎందుకుండకూడదు? విభజన జరగక ముందే కేసీఆర్ సీమాంధ్రులను వెళ్ళిపొమ్మని అంటున్నారంటే.. విభజన జరిగి తరువాత హైదరాబాద్‌లో సీమాంధ్రుల బ్రతకడం అంటే.. పాకిస్తాన్‌లో బ్రతికినంత కష్టం అయిపోదా? విశాల భారత దేశంలో ఏ పౌరుడికైనా ఎక్కడైనా బ్రతికే హక్కు లేదా? ఇలా నీళ్ళివ్వక, హైదరాబాద్‌నూ ఇవ్వక ప్రతి విషయంలోనూ సీమాంధ్రులకు అన్యాయం చేస్తే.. కింది ప్రాంతం వారు ఎలా బ్రతుకుతారనుకున్నారు?

ఈ కాంగ్రెస్‌ పార్టీకి సూటిగా ఒకటే మాట చెబుతున్నాం. మీరు న్యాయం చేయలేకపోతే.. ఆ బాధ్యతను గాని, ఆ అధికారాన్ని గాని మీరు ఎందుకు తీసుకున్నారు అని అడుగుతున్నాం. మీ పాటికి మీరు నిర్ణయం తీసేసుకుని ఇక మీ ప్రాంతం ఇంతే.. మీ ఖర్మ ఇంతే.. అని మీ నిర్ణయాన్ని కోట్ల మంది ప్రజల మీద రుద్దాలని చూస్తే.. అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని అడుగుతున్నాం. ఈ నిర్ణయం మీద చర్చలు జరగాలి.. ప్రశ్నలకు సమాధానాలు రావాలి.. కోట్ల మందికి మీ నిర్ణయం మీద భరోసా కలగాలి.. అప్పుడే విభజనంటూ జరిగితే జరగాలి. అంత వరకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటుంది.

గాజులు వేసుక్కూర్చున్నారా? గాడిదలను కాస్తున్నారా?

ఆఖరికి మన ముఖ్యమంత్రిగారు, బొత్స గారు, మంత్రులు, కేంద్ర మంత్రులు ఇంత మంది సీమాంధ్రులుగా ఉండి కూడా సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయం పట్ల ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే.. వీళ్ళ పదవుల కోసం నిస్సిగ్గుగా ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని ఎలా తాకట్టు పెట్టారో స్పష్టంగా అర్థమైపోతోంది. ఈ విషయంలో ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే.. అది కేవలం జగనన్న నాయకత్వంలో ఉన్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ నిరసన తెలియజేయడానికి తమ రాజీనామాలను ఎప్పుడో ఇచ్చేశారు. కానీ, ఎంతమంది కాంగ్రెస్, టిడిపి ఎ.పి.లు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు? ఎంతమంది సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ఎం.పి.లు, ఎమ్మెల్యేలు గొంతెత్తారు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? గాజులేసుకుని కూర్చున్నారా? లేక గాడిదలను కాస్తున్నారా? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజల కంటే వీరికి పదవులే ముఖ్యమని సిగ్గులేకుండా మళ్ళీ నిరూపించుకున్నారు ఈ టిడిపి, కాంగ్రెస్‌ నాయకులు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఇలాంటి వారిని నాయకులనాలా? లేక రాక్షసులనాలా? ఈ తరం కాదు కద భావి తరాలు, తరతరాలు ఎప్పటికైనా క్షమిస్తాయా అంటే ఎప్పటికీ క్షమించవనే చెప్పాలి.

రాజశేఖరరెడ్డిగారు ఆంధ్ర రాష్ట్రాన్నంతా సమానంగా ప్రేమించారు. ప్రతి తెలుగు కుటుంబమూ సంతోషంగా ఉండాలని తపించారు. రాజశేఖరరెడ్డిగారి పేరు మీద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన జగన్మోహన్‌రెడ్డిగారు కూడా తెలుగు ప్రజలంతా తన కుటుంబమే అని ఎన్నోసార్లు చెప్పారు. తెలుగు ప్రజలలో ఏ ఒక్కరికి అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు జగన్మోహన్‌రెడ్డిగారు. ప్రతి తెలుగువాడు సంతోషంగా ఉండాలి.. తెలుగువారందరికీ సమాన న్యాయం ఉండాలి.. తెలుగు వారందరికీ సమాన హక్కులు ఉండాలి. విభజనంటూ జరిగితే ఒక తండ్రి తన పిల్లలకు సమానంగా పంచి ఇచ్చినట్లు ఉండాలి తప్ప ఒకరి గొంతు కోసి ఆ రక్తంతో ఇంకొకరిని అభిషేకించినట్టు ఉండకూడదు. న్యాయం చేసే బాధ్యత మీకు లేకపోతే, అధికారాన్ని కానీ బాధ్యతను కానీ తీసుకునే హక్కు కూడా మీకు ముమ్మాటికీ లేదు.

కొంగ జపం లాంటి చంద్రబాబు తీరు :
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచి ఆయన్నే వెలేసిన ఘనుడాయన. మోసం, వెన్నుపోటు నుంచి పుట్టిన ఈ చంద్రబాబు.. రైతుల్ని పురుగుల్లా చూసి హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకుని ఆనందించారు. పన్నుల మీద పన్నులు పెంచి ప్రజల్ని కాల్చుకు‌ తిన్నారు. శాకాహారిగా మారానని చెరువులో ఒంటి కాలి మీద జపం చేస్తున్నట్లు నటించి చేపల్ని తినేసిన కొంగలాంటి వాడు చంద్రబాబునాయుడు గారు. వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుని, గ్రామాలు స్మశానాలుగా మారిపోతుంటే ఏ  ఒక్కరోజూ  ఆయన దానికి కారణాలు వెతకలేదు. తలతిప్పి వారివైపు చూడలేదు. రైతులు, చేనేత కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటుంటే వారికి సహాయం చేయాలని ఏరోజూ ఆయనకు అనిపించలేదు. లక్షల కొద్దీ ప్రజలు పక్క రాష్ట్రాలకూ వలసపోతుంటే అటువైపు కూడా ఆయన చూడలేదు. ఉచిత విద్యుత్తు గురించి ఏరోజూ ఆలోచించలేదు. విద్యుత్తు బకాయిలు కట్టలేకపోతున్నామన్నా... అల్లాడిపోతున్నామన్నా వారి గోడు పట్టించుకోలేదు. రుణ మాఫీ కాదు కదా.. కనీసం వడ్డీ మాఫీ గురించి కూడా చంద్రబాబు ఆలోచించలేదు. ఇంకుడు గుంతలు తప్ప ప్రాజెక్టుల అవసరాలను ఆయన ఏనాడూ గుర్తించలేదు. పక్క రాష్ట్రాల వారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, డ్యాములు కట్టుకుంటుంటే కళ్ళు తెరుచుకు నిద్రపోయాడు తప్ప ఏనాడూ వాటిని నిరోధించేందుకు ప్రయత్నించలేదు. తొమ్మిదేళ్ళలో మీరేం గొప్ప పని చేశారని అడిగితే.. కుక్కిన పేనులా మాట్లాడకుండా ఉంటారు చంద్రబాబుగారు.

చంద్రబాబు అవినీతి గురించి 'చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా' అని కమ్యూనిస్టులు ఓ పుస్తకమే రాశారు. కేవలం లక్ష రూపాయలతో ఏర్పాటైన తన బినామీ ఐఎమ్‌జీ అనే కంపెనీకి హైదరాబాద్ నడిబొడ్డున 850 ఎకరాలను కేవలం నాలుగు కోట్ల రూపాయలకు కట్టబెట్టేశారు చంద్రబాబు. ఎమ్మా‌ర్ సంస్థకు 550 ఎకరాలు ఇచ్చేశారు. వేలాది ఎకరాలను వితరణ చేసినా.. కృష్ణపట్నం వంటి రేవుల్ని తన అనుయాయులకు కేటాయించినా.. తన సన్నిహితులకు పప్పు బెల్లాల్లా పంచేసినప్పటికీ ఆయన‌మీద ఎప్పుడూ ఏ విచారణా జరగదు. ఏ కేసులూ పెట్టరు. చీకట్లో చిదంబరాన్ని కలవడం.. అన్ని వ్యవస్థల్నీ మేనేజ్ చేసుకోగలగడం దీనికి కారణం.

ప్రస్తుత దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే... కాంగ్రె‌స్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీలు లేకుండా వి‌ప్ జారీ చేసి మరీ కాపాడారు చంద్రబాబు. ప్రతి విషయంలోనూ ఆయన కాంగ్రె‌స్ పార్టీతో కుమ్మక్కయ్యారు. రాష్ట్రం రెండు ముక్కలవుతున్నా...‌ సీమాంధ్రకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఇలాంటి వ్యక్తిని నాయకుడనాలా? ఖ‌ల్ నాయకుడనాలా?

నాలుగు లక్షల కోట్ల రూపాయలివ్వాలట! :

హైదరాబాద్ నగరాన్ని తీసుసుకోండని అమ్మకానికి పెట్టేశారు. ఒక పక్క సీమాంధ్ర ఎడారవుతుందన్నా చంద్రబాబు కాంగ్రె‌స్ పార్టీని విమర్శించడం లేదంటే ఆయన ఏ స్థాయిలో కుమ్మక్కయ్యారో అర్థమయిపోతోంది. పైగా నాలుగు లక్షల కోట్లతో సీమాంధ్రలో రాజధానిని నిర్మించవచ్చని చెబుతున్నారు. ఈ నాలుగేళ్ళలో జరిగిన ఉప ఎన్నికలలో (50 అసెంబ్లీ, రెండు ఎంపీ) ఒక్క స్థానాన్ని కూడా టిడిపి గెలుచుకోలేదు. 26 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఇదీ చంద్రబాబు గారి సత్తా.

వేరే పార్టీ అయితే అధ్యక్షుణ్ణి ఎప్పుడో ఇంటికి పంపించేసేవారు. కానీ యెల్లో మీడియాకూ, టిడిపికి చంద్రబాబు తప్ప వేరే దిక్కులేదు. ఆయన్ని ఇంకా భుజాన మోస్తూనే ఉన్నారు. హరిశ్చంద్రుడు అబద్ధం చెప్పడన్నది ఎంత నిజమో చంద్రబాబు నిజం చెప్పడన్నది అంతే నిజం. ఇలాంటి చంద్రబాబు తనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్నే కాకుండా.. దేశాన్నీ గాడిలో పెడతానంటున్నారు. ఆయనకు అధికారమివ్వడమంటే నరకాసురుడికో.. హిట్లరుకో అధికారమిచ్చినట్లే. మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే.

2009లో రాజన్న ఎలా మరణించారన్నది ఇంతవరకూ అంతుపట్టని విషయం.. అలాగే.. జగనన్న ఎందుకు అరెస్టయ్యారన్నదీ అంతే అంతుపట్టని విషయం. నిజానికి ఏ నేరమూ జరగలేదు.. నేరాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. అభియోగాల్ని మోపారు. అబద్ధపు కేసులు పెట్టారు. జైలులో పెట్టారు. రాజన్న వారసునిగా జగనన్న ప్రజల ఆదరణ పొందుతుంటే.. కాంగ్రెస్, టిడిపి నేతల వెన్నులో వణుకు పుట్టింది. తమకు మనుగడ ఉండదని తెలిసి, కుట్రలు పన్ని, సిబిఐని ఉసిగొల్పారు. 26 జీవోల కేసులో కోర్టుకు పిలిచినప్పుడు జగనన్న 52వ ప్రతివాది. మంత్రులు, అధికారులు ఒకటి నుంచి 15 వరకూ ప్రతివాదులు. 52వ ప్రతివాదిని అరెస్టు చేసి, ఒకటి నుంచి 15 వరకూ ప్రతివాదులును విడిచిపెట్టారు. విచారణ కానీ, దర్యాప్తు కానీ ప్రారంభం కాకుండానే జగన్మోహన్‌రెడ్డిగారు ఒకటి, సాయిరెడ్డిగారు రెండో ప్రతివాదులుగా ఉంటారని సిబిఐ అధికారి చెప్పారంటే కేసును ఎలా నడపదలచుకుందో ఆ రోజే అర్థమైంది. దీన్ని దర్యాప్తు అంటారా.. దిక్కుమాలిన కుట్ర రాజకీయమంటారా? వంగి సలాం చేస్తున్న సిబిఐని పంజరంలో చిలుకంటారా.. కాంగ్రెస్ పెరట్లో కుక్కంటారా..‌ లేకపోతే గుంటనక్కంటారా? కాంగ్రెస్ ఎలా చెబితే అలా పలకాల్సి ఉంటుందని ‌సిబిఐ అధికారి స్వయంగా చెప్పారు. మరి విచారణ జరగాల్సింది జగన్మోహన్‌రెడ్డిగారి మీదనా లేక కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మయిన ‌సిబిఐ మీదనా.. కాంగ్రెస్ మీదనా.. ‌టిడిపి మీదనా..

టిఆర్ఎస్ విలీనం క్విడ్ ప్రో‌ కో కాదా?
జగన్మోహన్‌రెడ్డి గారు క్విడ్ ప్రో‌ కోకు పాల్పడ్డారని సిబిఐ ఆరోపించింది. శంకర్రావు అనే వ్యక్తి‌ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతోనే జగన్మోహ‌న్‌రెడ్డి గారి మీద కేసు పెట్టానని చెప్పారు... ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. దీన్నేమంటారు.. క్విడ్ ప్రో‌ కో కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా చూసినందుకు చంద్రబాబు మీద కేసులు పెట్టకుండా ఉండడం క్వి‌డ్ ప్రో‌ కో కాదా?  ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని తెలిసి టిఆర్ఎస్ పార్టీని కాంగ్రె‌స్ పార్టీలో విలీనం చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తున్నామనడం క్వి‌డ్ ప్రో‌ కో కాదా అని ప్రశ్నిస్తున్నాం.

వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతోంది. మరి జగన్మోహన్‌రెడ్డి గారి విషయంలో ఏ జరుగుతోంది? నేర నిరూపణ కాకుండానే.. ఏడాది పైగా జైల్లో పెట్టారంటే... శిక్ష వేసినట్లు కాదా.. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. జననేత అనుకున్న నాయకుణ్ణి జనం నుంచి వేరు చేశారు. ఒక్కర్ని లక్ష్యంగా చేసుకుని వెయ్యి కుట్రలు పన్ని ఆయనను బలి చేయాలనుకుంటున్నారు.

అయినప్పటికీ జగన్మోహన్‌రెడ్డిగారిలో ఆత్మస్థైర్యం ఏమాత్రం చెక్కుచెదరలేదు. జైల్లో పెట్టినా ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అదీ జగన్మోహన్‌రెడ్డి గారి ప్రత్యేకత. చిమ్మ చీకటిలో ఆయనో కాంతి కిరణం. జైల్లో పెట్టినా ఆయన తిరుగులేని జననేతే. బోనులో ఉన్నా సింహం.. సింహమే. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో.. మంచివాడి పక్షాన ఆయన నిలబడతాడన్నది కూడా అంతే నిజం.  ఉదయించే సూర్యుణ్ణి ఎవ్వరూ ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరూ ఆపలేరు. అది ఈ కాంగ్రెస్, టిడిపిల తరం కాదు. జగనన్న విడుదలై మనందర్నీ రాజన్న రాజ్యం దిశగా తీసుకెడతారు. ఆ రోజు వరకూ మీరు జగనన్నను ఆశీర్వదించాలనీ, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీని బలపరచాలనీ కోరుతున్నాం. పాదయాత్రకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అని శ్రీమతి షర్మిల అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top