స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించాలి

హైదరాబాద్ 21 జూన్ 2013:

రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు పరిస్థితులకు అనుగుణంగా మార్పు రాక అనేక సమస్యలతో సతమతమవుతున్నారనీ, వారిని ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రికి శుక్రవారం ఓ లేఖ రాశారు. వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను స్వర్ణకార సంఘ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారికి మెరుగైన జీవనోపాధి కల్పించడంతో పాటు, వృత్తిని ప్రోత్సహించడం, ఆధునిక ప్రపంచంతో పోటీపడేలా అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ కమిటీ ఓ నివేదిక కూడా అందజేసిందన్నారు. ఇది జరిగి దాదాపు నాలుగేళ్ళు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్దిష్టంగా ఎలాంటి చర్యా తీసుకున్నట్లు కనిపించడం లేదన్నారు. కమిటీ సిఫార్సులను తక్షణం అమలు చేసేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆలేఖలో ముఖ్యమంత్రిని కోరారు. అలాగే.. స్వర్ణకార వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేక బోర్డును నెలకొల్పాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించాలని ఆమె విజ్ఞప్తిచేశారు.

Back to Top