గల్లీ నుంచి ఢిల్లీ దాకా హోదా పోరు

విజయవాడ :  ప్రత్యేక హోదా సాధన కోసం పదవులను త్యజించి, ఆమరణదీక్ష చేస్తున్న ఎంపిలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. మూడు రోజులుగా దీక్షలో ఉన్న వారి లక్ష్యం నెరవేరాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పలు రకాలుగా నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ప్రతి వాడలోనూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం మారు మోగుతోంది. హోదా సాధించేంత వరకు పోరాటం ఆపేది లేదంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పలు జిల్లా కలెక్టరేట్ల వద్ద వంటావార్పు నిర్వహించి తమ నిరసనను వ్యక్తపరిచారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు, వైయస్ ఆర్ సిపి అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ హోదా కావాలంటూ ఎలుగెత్తి డిమాండ్ చేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా హోదా పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది.

కృష్ణా జిల్లా నందిగామలో జలదీక్షతోపాటు, గాంధీ సెంటర్ లో రిలే నిరాహార దీక్షలు చేశారు. కంచికచర్ల 65 వ నంబరు జాతీయ రహదారిపై వంటావార్పు తమ నిరసనను తెలియపరిచారు.  నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు నేతృత్వంలోనూ , గన్నవరంలోనూ  రిలే నిరాహార దీక్ష లు వరుసగా రెండో రోజూ కొనసాగాయి.
విశాఖపట్నం జిల్లాలోని పాడేరు, అరకు నియోజకవర్గాల్లోనూ , కాకినాడలోనూరిలేనిరాహార దీక్షలు వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వంటావార్పుతో ఎంపిలకు సంఘీభావం ప్రకటించారు. 
ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం ముందు రిలేనిరాహార దీక్షలు జరిగాయి. కోవూరులో సీనియర్ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి లారీ డ్రైవర్లకు, ఇతర సిబ్బందికి భోజనం పెట్టి వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బైక్ రాలీని నిర్వహించారు. కావలి, సూళ్లూరుపేట, నెల్లూరు ఆర్టీస బస్టాండ్ లోనూ పలు కార్యక్రమాలు జరిగాయి. 
పశ్చిమగోదావరి పెదవేగి, ఉంగుటూరు, గోపాలపురంలలో పలుకార్యక్రమాలు జరిగాయి. అలాగే గుంటూరులో విద్యార్ధులు బస్తాలను మోస్తూ నిరసనను వ్యక్తం చేశారు. పొన్నూరులో నియోజకవర్గ సమన్వయ కర్త రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. విజయనగరంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి తదితరులు వంటావార్పులో పాల్గొన్నారు. కర్నూలుజిల్లా నందికొట్కూరు లో ఎమ్మెల్యే ఐజయ్య నాయకత్వంలో హోదా పోరు విస్తృతంగా జరుగుతోంది. 

Back to Top