పచ్చచొక్కాల జేబులు నింపేందుకే పథకాలు

మండపేట : గోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాలను ఎడారులుగా మార్చేందుకే అధికార టిడిపి నాయకులు ఎత్తి పోతల పథకాల పేరిట కుట్ర పన్నుతున్నారని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ఆరోపించారు.  కేశవరంలో ఆ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దూలం వెంకన్నబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజక వర్గ కో ఆర్డినేటర్ వేగుళ్ళ లీలా కృష్ణ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ , యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాలతో కలసి ఈ సమావేశంలొ ఆయన మాట్లాడుతూ... మొదటి పంటకు సాగు నీరు అందే పరిస్థితి ఉండడం లేదన్నారు. ఇక రెండో పంట విషయానికొస్తే నీరందక వేలాది ఎకరాలు ఎండిపోతున్నాయని వాపోయారు.

దివంగత మహానేత వైయస్సార్ ఎంతో వ్యూహాత్మకంగా ఆలోచన చేసి పోలవరం పనులు చేపట్టారన్నారు. పోలవరం కాలువలు ఆయన హయాంలోనే పూర్తి అయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేయకుండా పట్టిసీమ ,పురుషొత్తం పట్నం వంటి  ఎత్తిపోతల పథకాలను ఆరంభించడం వెనుక అంతులేని అవినీతి దాగి వుందన్నారు. పచ్చచొక్కాల జేబులు నింపుకునేందుకే ఈ పథకాలని విమర్శించారు. తక్షణం జిల్లాలోని ఎత్తిపోతల పథకాలన్నింటికీ మరమ్మత్తులు చేపట్టి వాటిని పునరుద్ధరించాలని డిమాండు చేసారు. తద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Back to Top