రుణమాఫీని తక్షణమే అమలు చేయండి

హైదరాబాద్, జూన్ 28: వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తానంటూ ఎన్నికలలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నాట్లు వేసే కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలకు నడుం బిగించకపోవడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

'ఒకవైపు సకాలంలో వర్షాలు కురవక రైతులు కనీవినీ ఎరుగనంతటి అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కంటున్నారు. మరోవైపు తాజాగా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ససేమిరా అంటున్నాయి. ఖరీఫ్ కోసం నాట్లు వేసుకునే కార్యక్రమాలు ఆరంభించాల్సిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రుణ మాఫీపై ఎలాంటి స్పష్టమైన హామీ లభించక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది' అని శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రైతాంగం అనుభవిస్తున్న ఆవేదనను వివరించారు.

సకాలంలో వర్షాలు కురవక మరోవాపు రుణ మాఫీ అమలును రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కుంటిసాకుతో వాయిదా వేస్తుండటంతో రైతాంగం పరిస్థితి కడు దయనీయంగా మారింది. అందువలన ముందుగా వ్యవసాయ రుణాల మాఫీని అమలు చేయడంతోపాటు వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు అంబటి.

రుణా మాఫీ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్న రైతులను తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు చేస్తున్న ప్రకటనలు వారిని మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. రుణాల మాఫీ కోసం కమిటీ వేయడం నుంచి మొదలుకుని, రుణ మాఫీ లబ్దిదారులపై రకరకాల పద్దతుల ద్వారా ఆంక్షలు విధించడం వంటి ఆలోచనల ద్వారా ప్రభుత్వం రుణ మాఫీ హామీని అమలు చేయకుండా తప్పించుకునే మార్గాల కోసం అన్వేషిస్తోందని ఆయన అన్నారు. సీమాంధ్రలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడినప్పటికీ ప్రభుత్వం వారి ప్రజయోజనాలను నిర్లక్ష్యం చేయడాన్ని ఎంతమాత్రం సహించబోమని అంబటి హెచ్చరించారు.

గతంలో వ్యవసాయం దండగ అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మాటమార్చి వ్యవసాయ రుణాలన్నింటినీ మాఫీ చేయడంతోపాటు వ్యవసాయాన్ని లాభసాటిగా కూడా మారుస్తానని అన్నారు. 'తెలుగుదేశం పార్టీ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. వరికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు 50 రూపాయల మాత్రమే పెంచింది. దీనిని బట్టి చంద్రబాబు నాయుడుకు రైతుల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం అవుతుంది.

చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ పాలనలో వరికి పెరిగిన మొత్తం మద్దతు ధర కేవలం 170 రూపాయలు మాత్రమే. అదే అయిదేళ్ళ మూడు నెలల వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో 500 రూపాయల నుంచి ఏకంగా 1000 రూపాయలకు పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల హయాంలో కేవలం 300 రూపాయలు మాత్రమే పెరిగింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రైతుల పట్ల ఎవరికి ప్రేమ ఉందో' అని అంబటి రాంబాబు అన్నారు.

అందువలన వ్యవసాయ రుణాలన్నింటినీ తక్షణమే అమలు చేయాలి. లేని పక్షంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి వ్యవహారంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించినందు వల్లనే గతంలో రైతులు పంట విరామం ప్రకటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతులెవరూ రుణ బకాయిలు చెల్లించవద్దు అంటూ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే పలుమార్లు ప్రకటించారు. అయినప్పటికీ బ్యాంకులు రైతుల నుంచి బలవంతపు వసూళ్ళకు పాల్పడతున్న సంఘటనలు జరుగుతున్నాయని అంబటి అన్నారు.

' రైతులను మోసం చేసే ఏ ప్రభుత్వం అయినా సరే దానికి భారీగా మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభమైనందున తెలుగుదేశం పార్టీ తన హామీని నిలబెట్టుకోవాలి' అని ఆయన కోరారు.

తాజా వీడియోలు

Back to Top