'సత్తా ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి'

కాకినాడ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర‌ పాలక మండలి సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి సవాల్ విసిరారు. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతలతో సమీక్ష‌ నిర్వహించిన తరువాత ఆయన కాకినాడలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాబలం, విశ్వసనీయత తమకు ఉందనుకుని గొప్పలు పోతున్న సి.ఎం. ఎన్నికల బరిలో దిగితే ప్రజల్లో ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఉందో స్పష్టం అవుతుందన్నారు.

అనైతికంగా, అడ్డదారిలో, అధికారబలంతో సహకార సంఘాలను సొంతం చేసుకుని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్‌.. పార్టీ రహితంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొందరపడుతోందని మైసూరారెడ్డి ఆక్షేపించారు. అసెంబ్లీ ఎన్నికలకు ధైర్యం లేకపోతే కనీసం పార్టీ గుర్తుపై జరిగే జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకైనా సిద్ధపడాలన్నారు. భవిష్యత్‌లో తమకు పుట్టగతులుండవని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్నారని, వైయస్‌ఆర్‌సిపి నాయకుకులు ఆ పరిస్థితిలో లేరని విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో ఏనాడూ ఎదురుకాని పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు కారణంగా ఎదురైందన్నారు.

వీగిపోతుందని తెలిసినా ప్రభుత్వం కళ్లు తెరిపించాలనే సంకల్పంతో ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాసానికి సిద్ధపడితే.. దాన్ని నిలబెట్టేందుకు చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంతోనే అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య మ్యా‌చ్‌ఫిక్సింగ్ సామాన్యులకు కూడా తెలిసిపోయిందన్నారు. అధికార పక్షంపై విమర్శలు చేసే అర్హతను చంద్రబాబు కోల్పోయారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైనా కూడా అవిశ్వాసానికి ఓటు వేయవద్దని విప్ జారీ చేయడంతోనే బాబు కుమ్మక్కు రాజకీయం బయటపడిందన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‌ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ‌ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, జక్కంపూడి విజయలక్ష్మి ‌ సమావేశంలో పాల్గొన్నారు.
Back to Top