సందు కోసమా.. సంధి కోసమా

చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రజల్లో అనుమానాలు 
– మా ఎంపీల నిరాహార దీక్షకు మద్ధతు తెలపండి 
– ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేద్దాం రండి 
– టీడీపీ, బీజేపీలు ఉమ్మడిగా ఆంధ్రులను మోసగించారు
– టీడీపీ ఎంపీలకు తమ్మినేని పిలుపు
– సభ వాయిదా పడితే ఏపీ భవన్‌ వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల నిరాహార దీక్ష 
– మద్ధతుగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ దీక్షలు 

ఒకపక్క ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా డిమాండ్‌ చేస్తుంటే.. మరోపక్క ఢిల్లీలో ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతున్నారని.., ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ స్థితిగతులను ఆయన మార్చాల్సిన అవసరం లేదని.. ఏపీకి సంజీవని లాంటి ప్రత్యేక హోదాపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆయనకు కానీ, ఆ పార్టీ ఎంపీలకు కానీ ప్రత్యేక హోదా సాధన కోసం ఏంచేయాలో ఇప్పటికైనా స్పష్టత వచ్చిందా అని ప్రశ్నించారు. తొమ్మిది రోజులుగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడుతుంటే.. మద్ధతు ఇవ్వాల్సింది పోయి టీడీపీ ఎంపీలు కాలక్షేపం చేశారని ఆరోపించారు. రాష్ట్రప్రయోజనాల కోసం మద్ధతు కూడగట్టాల్సిందిపోయి ఢిల్లీ వెళ్లి థర్డ్‌ ఫ్రంట్‌లంటూ కొత్త డ్రామాలకు తెరదేశారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేకసార్లు యూటర్న్‌లు తీసుకున్న చంద్రబాబు ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టకపోవడం శోఛనీయమన్నారు. ఢిల్లీ వెళ్లేది సంధి చేసుకోవడానికా.. సందు చూసుకోవడానికా.. అని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీల ఎంపీలంతా కలిసి పోరాడితే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని సవాల్‌ విసిరారు. పార్లమెంట్‌ చివరి రోజున మీ ఎంపీల చేత రాజీనామా చేయించండి మీరు కూడా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరొస్తుందని పేర్కొన్నారు. ‘మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆనాడే చెప్పారు. రాజీనామా కోసం మీరైనా ముందుకు రండి. మేం మద్ధతుగా నిలుస్తాం’. అని స్పష్టం చేశారు. 

బీజేపీ టీడీపీ దొందూ దొందే..

రాష్ట్రానికి అన్యాయం జరగడంలో టి డీపీ పాత్ర ఎంతుందో.. బీజేపీకి అంతే పాత్ర ఉందని తమ్మినేని మండిపడ్డారు. ఏపీకిచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు. సభ ఆర్డర్‌లో లేదంటూ తప్పించుకోవడం తగదని. ఆర్డర్‌లో లేనప్పుడు ద్రవ్య వినిమయ బిల్లును ఎందుకు ఆమోదింపజేసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీలు సంయుక్తంగా ప్రజలను మోసం చేసి ఇప్పుడేమో ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారని తెలిపారు. సభలో చర్చ జరిగితే కదా.. అన్నీ తెలుస్తాయని నిజాలు నిరూపణ అవుతాయని. వాస్తవాలు ప్రజలకు తెలియాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తలుపులు వేసి, లైవ్‌లు కట్‌ చేసి చేసినప్పుడు బీజేపీ కూడా సభలోనే ఉంది. అప్పుడేమైనా సభ ఆర్డర్‌లో ఉందా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు మీద ప్రజలంతా నమ్మకం కోల్పోయారని తెలిపారు. ఆయన ఢిల్లీ వెళ్తున్నారంటే తన ఓటుకు నోటు కేసు చక్కదిద్దుకోవడానికో.. లోకేష్‌ మీదున్న మనీ లాండరింగ్‌ కేసులు మాఫీ చేయించుకోవడానికో వెళ్తున్నారని చర్చించుకుంటున్నారని తమ్మినేని పేర్కొన్నారు.

ప్రజలను అప్పులడగడం హాస్యాస్పదం: సామినేని ఉదయభాను.. 

రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రజల నుంచి అప్పులు కోరడం హాస్యాస్పదంగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సామినేని ఉదయభాను అన్నారు. కేంద్రం చేపట్టాల్సిన రాజధాని నిర్మాణాన్ని తాను తీసుకుని నిధులు నిరుపయోగం చేశారని తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు ప్రకారం ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం నేరమని ఇప్పటికే మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్టారావు వంటి వారు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రెండు బిల్డింగులు నిర్మించి చదరపు అడుగుకు పది వేలు ఖర్చు చేయడం ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరుస్తుంది. రాబోయే కాలంలో చంద్రబాబు అవినీతిపై దర్యాప్తు చేయడానికి కేంద్ర రంగ సంస్థలు రంగంలోకి దిగుత్నునాయని ఆయన పేర్కొన్నారు. 60 ఏళ్లలో 13 జిల్లాల అప్పు 96 వేల కోట్లుంటే చంద్రబాబు ముఖ్యమంత్రయ్యాక నాలుగేళ్లలో రెండు లక్షల కోట్లు దాటించారని ఆయన తెలిపారు.
ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు అవినీతిపై విద్యావంతులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరాన్ని గుర్తించాలని సూచించారు. పార్లమెంట్‌ నిరవధికంగా వాయిదా పడగానే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వద్ద మా ఎంపీలు నిరాహార దీక్ష ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వారికి మద్ధతుగా ఎక్కడికక్కడ దీక్షలు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, రైతులు, రైతు సంఘాలు, మహిళలు సహకరించాలని ఆయన కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 
Back to Top