'సంతకం'తో ఆ పార్టీల కళ్ళు తెరిపించాలి

నెల్లూరు: కోటి సంతకాల కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్‌, టిడిపి నాయకుల కళ్ళు తెరిపించాలని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు, వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఆ రెండు పార్టీలు పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాలని ఆయన అన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శనివారం సాయంత్రం పెళ్లకూరు వచ్చారు.‌ వైయస్‌ఆర్‌సిపి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పేరం మధునాయుడు, ఓడూరు గిరిధ‌ర్‌రెడ్డి, బైనా చంద్రశేఖరరెడ్డితో కలిసి‌ మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల సేకరణ‌ు ప్రారంభించారు.  మహిళలు, వృద్ధులు, యువకులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది మేకపాటి సమక్షంలో వైయస్‌ఆర్‌సిపిలో చేరారు.

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోయాయని, జనం మధ్యన ఉన్న యువనాయకుడు, జననేత శ్రీ జగన్‌ను వారి నుంచి దూరంగా ఉంచేందుకు అధికార, ప్రతిపక్షాలు కలిసి కుట్ర చేస్తున్నాయని మేకపాటి ఆరోపించారు. మహానేత వైయస్‌ఆర్ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో గడిపారని, ఆ స్వర్ణయుగాన్ని‌శ్రీ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే అందించబోతున్నారన్నారు. కడప పార్లమెంటరీ స్థానం ఎన్నికలతో కంగుతిన్న కాంగ్రెస్, టిడిపిలు శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఇబ్బందులు పెట్టేందుకు నీతిమాలిన రాజకీయాలకు నాంది పలికాయన్నారు.

మానవత్వానికి మారుపేరు‌ మహానేత వైయస్‌ఆర్:
వింజమూరు: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ మానవత్వానికి మారుపేరుగా, చిరస్మరణీయుడిగా నిలిచారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అన్నారు. వింజమూరు బంగ్లా సెంటర్‌లో శనివారం వైయస్‌ఆర్‌సిపి నాయకుడు కాకి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జగన్ కోసం‌.. జనం సంతకం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని జైలులో బంధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు సేకరిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి తెలిపారు. టిడిపి, కాంగ్రెస్‌ పార్టీలు కుట్రతో శ్రీ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించాయన్నారు. సిబిఐతో పలు చార్జిషిట్‌లు వేయిస్తూ శ్రీ జగన్‌కు బెయిలు రాకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక ఇలాంటి కుట్రలకు పూనుకున్నారన్నారు. ఈ కుట్రలను రాష్ర్టపతికి తెలియజేసేందుకే సంతకాలు సేకరిస్తున్నామన్నారు.‌ మహానేత వైయస్‌ఆర్ కుటుంబాన్ని కష్టసమయంలో ఆదుకునేందుకు కుల మతాలకు అతీతంగా ప్రజలంతా సంతకం చేయడానికి ముందుకు రావాలన్నారు.
Back to Top