సంక్షేమాన్ని మరిచి సంక్షోభ సృష్టి

హైదరాబాద్, 19 మార్చి 2013:

బడ్జెట్‌లో బడుగు బలహీనవర్గాలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.  మాటల గారడీ తప్ప బడ్జెట్లో పస లేదన్నారు. 80 శాతం బలహీనవర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బీసీ వ్యతిరేక బడ్జెట్ అన్నారు. బీసీలోని ఏ ఒక్క వృత్తికి సరైన కేటాయింపుల్లేవన్నారు. ఎన్నికలకు ముందు రైతులను మభ్యపెట్టేందుకే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి దీనిని ఎన్నికల బడ్జెట్ అని చెప్పారనీ, దీనిని బట్టి తమది మైనారిటీ ప్రభుత్వమని ఆయన అంగీకరించినట్లుందని గట్టు చెప్పారు. చివరి సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తమకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెడతారేమోనని ఎదురుచూసిన పేద వర్గాలకు నిరాశ ఎదురైందన్నారు. బడ్జెట్ మాటల గారడిగానే మిగిలిందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారి హయాంలో లక్షా మూడువేల కోట్ల రూపాయల బడ్జెట్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారనీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించారనీ చెప్పారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన 1,61,000 వేల కోట్ల బడ్జెట్లో సంక్షేమం జాడే కనిపించలేదని ఎద్దేవా చేశారు. ఏ రంగంలోనూ మార్పు చూపించలేకపోయారన్నారు. బడ్జెట్ మొత్తంలో అరవై శాతం పెరుగుదల ఉన్నప్పటికీ ఆ మేరకు సంక్షేమ రంగంలో చూపలేకపోయారని ఆయన విమర్శించారు. పైగా ఇరవై వేల కోట్ల రూపాయల లోటు చూపించారనీ, అంటే ప్రజల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయబోతున్నామని చెప్పకనే చెప్పారనీ ఆయన వివరించారు. ఇప్పటికే విద్యుత్తు సర్చార్జీల రూపంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి పన్నుల దాహం తీరలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను బడ్జెట్లో విస్మిరించారని ఆరోపించారు. బీసీలను మభ్య పెట్టారన్నారు. ఎవరైనా తమ జీవన విధానం మెరుగుపడాలని కోరుకుంటారన్నారు. సక్రమంగా కేటాయింపులు చేయక వారి ఆశను ప్రభుత్వం నీరు గార్చిందన్నారు. ఫీజు రీయింబర్సుమెంటుకు కేటాయించిన 4600 కోట్లలో వెయ్యి కోట్ల రూపాయలు కేంద్రం నుంచే వస్తాయన్నారు. మిగిలిన మొత్తాన్నైనా బడ్జెట్లో చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. 26లక్షల మంది విద్యార్థుల పరిస్థితి ఈ పథకంపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రంలో 52శాతం మంది బీసీలున్నారన్నారు. బీసీలలో ఒకరైన చేనేతలు ఉపాధి కరవై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, వారి స్థితిగతులను బాగుచేయడానికి కనీస చర్యలు చేపట్టలేదనీ, బడ్జెట్లో 192 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత బ్యాంకును ప్రారంభిస్తామని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి ఆ విషయమే ప్రస్తావించలేదన్నారు. వృత్తిదారులకు ఇచ్చే పింఛన్లను 18 కోట్ల రూపాయల నుంచి 12 కోట్ల రూపాయలకు తగ్గించారని చెప్పారు. దీనికి కారణమేమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏటేటా పెరుగుతున్న బడ్జెట్ మొత్తం ఎక్కడికి పోతోందో అర్థం కావడం లేదన్నారు.



కులాలా కార్పొరేషన్లకు నిధులేవీ

బలహీన వర్గాల సంక్షేమానికి రాజశేఖరరెడ్డిగారు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటుచేస్తే వాటికి కేటాయింపులే లేవన్నారు. ఈ పరిణామంతో ఆయా కులాలవారు హతాశులయ్యారని చెప్పారు. నిధులు కేటాయిస్తామని చెప్పి, బడ్జెట్లో ఆ ఊసే ఎత్తకపోవడం తగదన్నారు. ఇది వారిని మాయచేయడం తప్ప మరొకటి కాదన్నారు. బీసీల మీద ప్రభుత్వానికున్న ప్రేమ ఏమిటని ప్రశ్నించారు. వృత్తిదారులను పూర్తిగా పక్కన పెట్టిన విషయం స్పష్టమైందన్నారు.


సన్నచిన్నకారు రైతుకూ భరోసా కల్పించలేదు

సన్నచిన్నకారురైతులకు భరోసా ఇవ్వలేదన్నారు. వారిలో ఎక్కువమంది బీసీలే ఉంటారని చెప్పారు. కరెంటు కోతతో గ్రామీణ వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. దీనివల్ల వ్యవసాయ అనుబంధ వృత్తులన్నీ దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతాంగానికి బడ్జెట్లో ఏరకంగానూ భరోసా  ఇవ్వలేదన్నారు. ధరల స్థిరీకరణకు వ్యవసాయానికి కేటాయించిన వంద కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని గట్టు రామచంద్రారావు ప్రశ్నించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందుకు మూడువేల కోట్ల రూపాయలు ఉండాలని డిమాండు చేస్తోందన్నారు. బలహీన వర్గాలనుపక్కన పెట్టి ఏం చేయదలచుకున్నారనీ, ఇంతకంటే పెద్ద ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా అని ఆయన నిలదీశారు.


కిరణ్ మాటల గారడీ ఇది
జలయజ్ఞానికి కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చుచేస్తామని ప్రభుత్వం చెబుతోందన్నారు. అంతా కేంద్రం ఇస్తే లక్ష అరవై వేల కోట్ల బడ్జెట్ ఎవరికిస్తారని ప్రశ్నిస్తున్నానన్నారు. ఈ బడ్జెట్లో వెనుకబడిన వర్గాల సంక్షేమాన్ని మరిచి సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని గట్టు వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీని బడ్జెట్లో దెబ్బ కొట్టారన్నారు. ఆ పథకంలోని రోగాల సంఖ్యను తగ్గించారన్నారు. ఇళ్ళు కట్టించడం లేదన్నారు. ఇంటి ధరను యాబై శాతం పెంచారనీ, ఆ మేరకు బడ్జెట్లో పెంపు లేదనీ ఆయన చెప్పారు. పెంచిన మొత్తాన్ని ఎక్కడినుంచి తెచ్చిస్తారని ప్రశ్నించారు. మహానేత హయాంలో కట్టించిన ఇళ్ళ లెక్కనే ఇప్పటికీ చెబుతూ నెట్టుకొస్తున్నారు తప్ప కొత్తగా కట్టించినవి లేవన్నారు. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఇవ్వని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. బడ్జెట్ రూపంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటల గారడి చేశారన్నారు. ఆయనెంత మాటలగారడీతో డ్రామాలాడినప్పటికీ నమ్మేపరిస్థితి లేదన్నారు.


ప్రభుత్వ పనితీరుకు అద్దం

కౌలు రైతులలో దాదాపు 80శాతం మంది అంటే 40 లక్షల వరకూ బీసీలే ఉంటారని చెప్పారు. రాజశేఖరరెడ్డిగారున్నప్పుడు కైలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని జీఓ చేశారు. ఆయన మరణానంతరం ఆందోళన చేయగా చేయగా ఐదు లక్షల మందికి మాత్రమే కార్డులిచ్చారనీ, అందులో రెండు లక్షల మందికి మాత్రమే రుణాలిచ్చారన్నారు. దీనిని బట్టి ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందర్నీ ఈ ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. ఇది పనికొచ్చే బడ్జెట్ కాదని స్పష్టంచేశారు. బడుగు బలహీన వర్గాల వారిని ఆదుకోవడానికి వీలుగా చర్యలు చేపట్టాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందని గట్టు రామచంద్రరావు చెప్పారు.


జగనన్నకు భయపడే వ్యవసాయానికి ప్రత్యేక ప్రణాళిక

రైతులకు ప్రత్యేక బడ్జెట్ పెట్టిన అంశంపై ఓ ప్రశ్నకు బదులిస్తూ అది బడ్జెట్ కాదనీ ప్రణాళికని కొట్టేసి రాశారని తెలిపారు. ముందుచూపు లేకుండా చేసిన పని ఇదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగానికి కనీసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించలేదని తెలిపారు.  కనీసం ప్రత్యేక ప్రణాళికలో సాగు నీటి ప్రాజెక్టులకు నిధులు కూడా కేటాయించలేదన్నారు. జగన్మోహన్ రెడ్డిగారు ప్రత్యేకంగా వ్యవసాయానికి బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పారు కాబట్టి భయపడి ఇలా చేశారు తప్ప మరోటి కాదన్నారు. దీనితో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదనే విషయం వెల్లడైందన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయరంగంపై అవగాహనే లేదని స్పష్టంచేశారు.


మోత్కుపల్లికి ఇంగిత జ్ఞానం లేదు

అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన ప్రసంగాన్ని సీడీలు చేసి రాష్ట్రవ్యాప్తంగా పంచుతామన్న చంద్రబాబు వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, పంచాల్సింది చంద్రబాబును ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన ప్రసంగం క్యాసెట్లను పంచుకోవాలని చెప్పారు. సభలో అధికార పక్షాన్ని నిలదీయాల్సింది పోయి మహానేతనుద్దేశించి మోత్కుపల్లి మాట్లాడటం దారుణమన్నారు. దీన్ని బట్టే అధికార, ప్రధాన ప్రతిపక్షాల నడుమ ఒప్పందం కుదిరిందన్న విషయం మరోసారి బహిర్గతమైందన్నారు. మాట్లాడ్డానికి ఇంగిత జ్ఞానం ఉండాలని మోత్కుపల్లికి    గట్టు హితవు పలికారు.

Back to Top