నకిలీ విత్తన సంస్థలకు టీడీపీ మంత్రుల అండ


పట్టెడు అన్నం పెట్టే రైతు వైపు ప్రభుత్వం అండగా ఉండలేదా
ఆత్మహత్యకు పాల్పడ్డ రైతులను పరామర్శించిన సామినేని ఉదయభాను
విజయవాడ: చంద్రబాబు, మంత్రుల అండ చూసుకునే నకిలీ విత్తన సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు సామినేని ఉదయభాను మండిపడ్డారు. నకిలీ విత్తనాలతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా సామినేని మీడియాతో మాట్లాడుతూ... కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగోలను గ్రామానికి చెందిన వంద మంది రైతులు సంవత్సరం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు వేసి మోపోయామని అధికారులకు రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు పంటలను పరీక్షించి నకిలీ విత్తనాలని తేల్చి చెప్పారన్నారు. ఒక్కో రైతుకు నష్టపరిహారం రూ.92 వేలు ఇవ్వాలని అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నకిలీ విత్తన సంస్థల యాజమాన్యానికి కొమ్ముకాస్తుందన్నారు. అయినా నకిలీ విత్తనాల సంస్థ యాజమాన్యం మంత్రులు దేవినేని, పత్తిపాటి పుల్లారావుల అండగా చూసుకుని రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలుగా పత్తి, మిర్చి నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలోని ప్రజానికానికి పట్టెడు అన్నం పెట్టేది రైతు అలాంటి రైతులకు రాష్ట్రంలో అండ లేకుండా పోయిందన్నారు. మూడున్నర సంవత్సరాల నుంచి చంద్రబాబు హయాంలో రైతులకు అన్యాయం జరుగుతుందని విరుచుకుపడ్డారు. 
Back to Top