ఢిల్లీ కోటను బద్దలు కొడదాం!

హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 30 లోక్‌సభా స్థానాలను మనందరం కలిసి గెలిపించుకుందామని, ఈ రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో అడుగుదాం అని, ఎలా విభజిస్తారో చూద్దాం.. ఆంధ్రప్రదేశ్‌ను ఎవరు సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధాన మంత్రి స్థానంలో కూర్చోబెట్టుకుందామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి‌ రాష్ట్ర ప్రజలకు ‌పిలుపునిచ్చారు. 'ఢిల్లీ కోటను బద్దలు కొడదాం... ఢిల్లీ రాజకీయాన్ని మనమే శాసిద్దాం' అని సమర శంఖం పూరించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని కాంగ్రెస్‌ తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభలో శ్రీ జగన్‌ మాట్లాడారు. కళ్లుండి కూడా కబోదుల్లా వ్యవహరించిన చంద్రబాబు, కిరణ్, సోనియాలకు విభజిస్తే రాష్ట్ర దుస్థితి అర్థం కావడంలేదా అని నిలదీశారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య ఇప్పుడు మన రాష్ట్రంలో పోరాటం జరుగుతోందని శ్రీ జగన్‌ అన్నారు.

వర్షాలు, వరద మృతులకు నివాళి:
ఎడ తెగని వర్షాలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక నిమిషం మౌనం పాటించి శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముందుగా నివాళులు అర్పించారు. సమైక్య శంఖారావం పూరించి.. కలిసి ఉందామని ఆప్యాయతను చూపిస్తూ, నినదిస్తూ.. వర్షాలు, వరదల నష్టాలు జరిగినా, రావడానికి కష్టాలు ఎదురైనా లక్షలాదిగా సమైక్య శంఖారావం సభకు తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని శ్రీ జగన్‌ అన్నారు. ఈ సభకు తమ వారిని వెన్ను తట్టి, ప్రోత్సహించి సభకు పంపించిన కోట్లాది తల్లులు, అక్కచెల్లెళ్ళు, అవ్వా, తాతలకు, చిన్నారులు, సోదరులకు, స్నేహితులకు చేతులు జోడించిన, శిరసు వంచి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అనేక కష్టాలకు ఓర్చి సమైక్య శంఖారావం సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ సలాం అన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని చూడడానికి ఆరాపడుతున్న ప్రతి హృదయానికీ శ్రీ జగన్ సలాం చేశారు.

రాజకీయాలంటే.. ఓట్ల కోసమో.. సీట్ల కోసమో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం కాదని శ్రీ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలని, వారికి మంచి చేయడమే రాజకీయం అన్నారు. పేదల ఆశీర్వాదం పొందేలా చేస్తేనే రాజకీయం అవుతుందన్నారు. అలా చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి హృదయానికీ సలాం చేస్తున్నాను అన్నారు. మనం మనుషులం.. ఆటవస్తువులం కాదన్నారు. 'మీ రాజకీయ చదరంగంలో పావులం అంతకన్నా కామన్నారు. అన్యాయం చేస్తే.. ఊరికే కూర్చోం.. వందేమాతరం గేయాన్ని అందుకుంటాం.. విప్లవ జెండాలను పట్టుకుంటాం.. బంగాళాఖాతంలో మిమ్మల్ని కలపడానికి వెనకడుగు వేయం' అని చెప్పడానికి ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికీ సలాం చేస్తున్నానన్నారు.

కష్టాలు, నష్టాలు ఎదురైనా లక్షలాదిగా సమైక్య శంఖారావానికి వచ్చి ఒక్కటయ్యామని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. 'చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం తాను ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తూ.. ఉద్యమబాట పట్టాడు ప్రతి విద్యార్థి. గత 80 రోజులుగా తమకు రావలసిన జీతాలను పనివారు వదులుకున్నారు. జీతాలు వదిలేసుకుని, తినడానికి తిండి లేకపోయినా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ. గత 80 రోజులుగా రైతన్న నాగలి పక్కన పెట్టి, రాష్ట్రాన్ని విభజిస్తే.. తనకు నీళ్ళెక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్టూ.. ఉద్యమ బాట పట్టాడు రైతన్న. అక్కచెల్లమ్మలు తమ చంటి బిడ్డలను చంకన వేసుకుని నడిరోడ్డు మీదకు వచ్చి ఆ పిల్లాడిని చూపిస్తూ..  వారి భవిష్యత్తేమిట'ని ఉద్యమంలోకి వచ్చారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ.. తాము రాజీనామాలు, నిరాహార దీక్షలు చేశామని శ్రీ జగన్‌ తెలిపారు. లేఖల మీద లేఖలు రాస్తూ.. విభజించవద్దని జ్ఞానోదయం కలిగించడానికి ప్రయత్నం చేశామన్నారు. ఇన్ని కోట్ల మంది నడి రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేస్తుంటే.. ఎందుకు ఉద్యమిస్తున్నారని ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని, తన కొడుకును ప్రధాన మంత్రిని చేసుకోవాలని చూస్తున్న సోనియా గాంధీకి తట్టలేదన్నారు. ప్యాకేజ్‌లు అడుగుతున్న చంద్రబాబుకూ తట్టలేదన్నారు. మోసం చేస్తున్న కిరణ్‌కూ తట్టలేదని ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ మనుషులేనా అని బాధ కలుగుతోందన్నారు. ఇంతగా దిగజారిపోయిన ఈ వ్యవస్థను చూస్తుంటే బాధగా ఉందని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు.

సమైక్యంగా ఉంటేనే మనకు నీరు రాని దుస్థితి :
పైన మహారాష్ట్ర అవసరాలు తీరితేనే గానీ కృష్ణా నీరు కింద ఉన్న కర్నాటకకు రావన్నారు. కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాంలు నిండితేనే గాని మన రాష్ట్రానికి నీళ్ళు వదలని పరిస్థితి ఉందన్నారు. మన రాష్ట్రంలో ట్రిబ్యునళ్ళు లేవా? బోర్డులు లేవా? అని రాష్ట్రాన్ని విభజించడానికి ఉర్రూతలూగుతున్న సోనియాను, ప్యాకేజ్‌లు తీసుకుని మోసం చేయదలచుకున్నచంద్రబాబును, సోనియా గీసిన గీతను దాటని కిరణ్‌కుమార్‌రెడ్డిని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. ట్రిబ్యునళ్ళు, బోర్డులు ఉండగానే ఆల్మట్టి, నారాయణపూర్‌ నిండితేనే గాని కిందికి ఎందుకు నీళ్ళు రావడంలేదని అటు వైపు చూడడంలేదని ఆ ముగ్గురినీ నిలదీశారు. కళ్ళుండీ చూడని కబోదులుగా మారారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కావేరి చూసినా అదే పరిస్థితి అన్నారు. కర్నాటక, తమిళనాడు ప్రతి ఏడాదీ కొట్టుకునే పరిస్థితి ఉందన్నారు. మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. శ్రీశైలం డ్యామ్‌కు, దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ జలాశయానికి నీళ్ళెక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు తప్ప మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయన్నారు. ప్యాకేజ్‌ల పేరు చెప్పి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.

మన జీవితాలతో పై రాష్ట్రాలు చెలగాటం :
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు మన జీవితాలతో చెలగాటం ఆడడానికి వెనకడుగు వేయడం లేదని శ్రీ జగన్‌ ఆందోళన వ్యక్తంచేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఒక మాట చెబుతుందని, బ్రిజేష్‌  కుమార్‌ ట్రిబ్యునల్‌ మరో మాట చెబుతుందన్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే, విభజిస్తామని సంకేతాలు అందడంతో మహారాష్ట్ర, కర్నాటకలు నికర జలాలలో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని, మిగులు జలాల మీద హక్కులు అడుగుతున్నాయన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో బీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌, నెట్టెంపాడు ప్రాజెక్టులకు, నల్గొండలోని ఎస్ఎల్‌బిసి, రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెలుగొండ, గాలేరు- నగరి, సుజల స్రవంతి, హంద్రీ నీవా ప్రాజెక్టులకు నీళ్ళెక్కడి నుంచి ఇస్తారని సోనియా, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలను శ్రీ జగన్‌ సూటిగా ప్రశ్నించారు. కృష్ణా ఆయకట్టులో ప్రతి రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? అని ప్రశ్నించారు. పోలవరానికి జాతీయ హోదా అంటున్న వారు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే.. దానికి నీళ్ళెక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

రాజకీయాలలో నిజాయితీ లేకుండా ఓట్లు సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని ఒక ఒక పక్కన.. మాట్లాడితే ఓట్లు, సీట్లు పోతాయని, ప్యాకేజ్‌లు అడుగుతున్న వారు మరో పక్కన మనకు అన్యాయం చేస్తున్నారని శ్రీ జగన్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ నగరం నుంచి పదేళ్ళలో వెళ్ళిపొమ్మని అంటున్నారని, చదువులు పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం తాము ఎక్కడికి పోవాలని చంద్రబాబు, సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డిని యువత కాలర్ పట్టుకుని నిలదీస్తే.. ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రమైనా బాగుపడాలంటే.. మహానగరమూ, సముద్రతీరం, ఓడరేవులు, విమానాశ్రయాలు అన్నీ ఒక్కటిగా ఉండాలన్నారు. అప్పుడే పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయన్నారు.

వెనకబట్టిన హైదరాబాద్ నగర అభివృద్ధి :

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే నగరాల్లో మూడో స్థానంలో ఉండే హైదరాబాద్‌ గత మూడేళ్ళుగా ఈ పాలకులు, ప్రతిపక్షం చేసిన పాపానికి 12వ స్థానంలోకి వెళ్ళిపోయిందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. మూడేళ్ళ క్రితం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపెనీలే కాలేజీలకు వచ్చి సంవత్సరానికి 57 వేల ఉద్యోగాలు ఇచ్చేవని గుర్తుచేశారు. ఇప్పుడది 25 వేలకు కూడా మించడం లేదన్నారు. హైదరాబాద్‌ను వీళ్ళు ఎంత నాశనం చేస్తున్నారో చెప్పడానికి మాటలు రావడంలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయని విచారం వ్యక్తంచేశారు.

రాష్ట్ర బడ్జెట్‌లో సగం ఆదాయం హైదరాబాద్‌ నుంచే వస్తోందని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. ఈ డబ్బులు రాకపోతే సీమాంధ్రలో జీతాలెలా ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు డబ్బులుండవన్నారు. రాష్ట్రం విడిపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న ఫ్లాట్లలో ఉండే వారి ఆస్తుల విలువలు సగానికి సగం పడిపోతే ఆ నష్టాన్ని సోనియా పూడుస్తారా? చంద్రబాబు నింపుతారా? అని సూటిగా శ్రీ జగన్‌ ప్రశ్నించారు. దేశంలో హిందీ తరువాత అతి పెద్ద జాతిగా ఉన్నది తెలుగువారే అన్నారు. 28 రాష్ట్రాలున్న మన దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మూడవ స్థానంలో ఉందన్నారు. 17 ఒక వైపున, 25 ఎంపీ స్థానాలు ఒకవైపున అని విభజిస్తే.. 17 స్థానాలక కన్నా ఎక్కువ స్థానాలున్న రాష్ట్రాలు 12 ఉన్నాయన్న సంగతి అర్థమవుతోందా? లేదా అని ప్యాకేజీలడుగుతున్న చంద్రబాబును, మోసం చేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల కోసం వీళ్ళు రాజకీయం చేస్తున్నారు కనుక రాష్ట్రం సర్వనాశనం అయిపోతోందని విచారం వ్యక్తంచేశారు.

చంద్రబాబు నిర్దయ :
విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని ఎన్జీవోలు అడిగితే.. అందుకు చంద్రబాబు నిర్దయగా ససేమిరా అన్నారని శ్రీ జగన్‌ గుర్తుచేశారు. బెంగళూరు, చెన్నైలో ఉన్న తెలుగువారి మాదిరిగానే ద్వితీయ శ్రేణి పౌరులుగా హైదరాబాద్‌లో కూడా బతుకుతారన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ చంద్రబాబు నాయుడు ఏకంగా ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష చేశారని శ్రీ జగన్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్ష ముగిస్తున్న సమయంలోనే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉద్యమం చేస్తున్న ఉద్యోగులను భయపెట్టి సమ్మెను విరమింపజేయడం ఏమిటని ప్రశ్నించారు. వీళ్ళు మనుషులేనా? అని ప్రశ్నించారు.

విభజన చేస్తున్నామని సిడబ్ల్యుసి చెప్పినప్పుడే కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని శ్రీ జగన్‌ నిలదీశారు. సోనియా ఎప్పుడు రాజీనామా చేయమంటే అప్పుడు.. విభజన పూర్తయిన తరువాత మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చి మొసలికన్నీరు కారుస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.‌ విభజనకు సంబంధించి కేబినెట్‌ నోట్ రాక ముందే అసెంబ్లీ సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయమని సిఎం కిరణ్‌ను అడిగినా పట్టించుకోలేదన్నారు. చివరికి తానూ, అంతకు ముందు శ్రీ వైయస్‌ విజయమ్మ నిరాహార దీక్షలు చేశామన్నారు. గవర్నర్‌ను కూడా కలిసి అసెంబ్లీని పెట్టి సమైక్య తీర్మాం పెట్టించాలని విజ్ఙప్తి చేశామన్నారు. ధర్నాలు చేసినా అరణ్య రోదనే అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మన రాష్ట్రంలో ఉండి మనల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిని చూసినప్పుడు బాధ కలుగుతోందన్నారు.

దేశం విడిచి వెళ్లండంటే మీకు నచ్చుతుందా సోనియా?:
సోనియాను చూస్తే మరింతగా బాధ కలుగుతోందన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ బ్రతికి ఉన్నప్పుడు రెండు సార్లు ఆమెను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చారన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం, తన కుమారుడిని ప్రధానిని చేసుకోవడం కోసం సోనియా గాంధీ మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకూ సమంజసం అని శ్రీ జగన్‌ ప్రశ్నించారు. 1968లో సోనియాకు రాజీవ్‌గాంధీతో వివిహమైందని, అనంతరం 15 ఏళ్ళ తరువాత 1983లో సోనియా గాంధీ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారని గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే 30 సంవత్సరాలు భారతదేశ పౌరసత్వం తీసుకుని మాలో ఒకరయ్యారన్నారు. భారత పౌరసత్వం తీసుకున్న వాళ్లంతా వెనక్కి వెళ్ళిపోవాలని పార్లమెంటులో బిల్లు తీసుకువస్తే మీకు నచ్చుతుందా? సోనియాగాంధీ అని ప్రశ్నించారు. ఇలా చేస్తే సోనియాకు నచ్చదని, కాంగ్రెస్‌ నాయకులంతా కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని వ్యాఖ్యానించారు. ముప్పై ఏళ్ళకే మీకు ఇంత వ్యామోహం ఉంటే.. అరవై ఏళ్ళుగా ఇక్కడ కలిసికట్టుగా ఉన్న మాకు ఎంత బాఢ ఉండాలని అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర చరిత్ర సోనియాకు తెలుసా? :
ఆంధ్ర రాష్ట్ర చరిత్ర సోనియాకు తెలుసా? అని ప్రశ్నించారు. విశాలాంధ్ర కావాలని 1955లో తెలంగాణ ముద్దుబిడ్డ బూర్గుల రామకృష్ణారావు తెలుగువాళ్ళంతా ఒక్కటిగా ఉండాలని, తన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన వైనం సోనియాకు తెలుసా? అన్నారు. ఆ రోజున అసెంబ్లీలో 147 మంది సభ్యులు హాజరు కాగా 103 మంది విశాలాంధ్ర కావాలని ఓటేసి తెచ్చుకున్న సమైక్యాంధ్ర మాది అన్న విషయం సోనియాకు తెలుసా అన్నారు. విశాలాంధ్ర కోసం పోరాటం చేసిన రావి నారాయణరెడ్డి, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, డాక్టర్‌ జయసూర్య గురించి సోనియాకు తెలుసా? అన్నారు. 'వీర తెలంగాణ నాది... వేరు తెలంగాణ కాద'న్న రావి నారాయణరెడ్డి మాటలు తెలుసా అన్నారు. చీలిక వాదం తెలంగాణకు హాని అన్న ఆయన మాటలు గుర్తుకు తెచ్చుకోమన్నారు. తెలుగు జాతిని విభజించాలని, బలమైన రాష్ట్రాన్ని బలహీనం చేయాలని చూడడం న్యాయమేనా అని సోనియాను ప్రశ్నించారు. 1972 డిసెంబర్‌ 21న మీ అత్తగారు, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటులో ఇచ్చిన ప్రసంగాన్ని ఒక్కసారి చదవమని సోనియాకు శ్రీ జగన్‌ సూచించారు. తాను దక్షిణ భారతదేశంలో పర్యటిస్తున్నప్పుడు విశాలాంధ్ర కావాలంటూ ఆంధ్రులు పెట్టిన ఘోష ఇప్పటికింకా తన చెవుల్లో మారుమోగుతున్నాయని అన్న మాటలు తెలుసా అన్నారు.

జగన్‌ చెప్పిన మార్టిన్‌ నిమోనర్ కథ :
'ఈ మధ్య ఓ పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఓ సన్నివేశం ఇలా ఉంటుంది.. హిట్లర్ నరమేధం సృష్టిస్తున్నప్పుడు మార్టి‌న్ నిమోన‌ర్ అనే జర్మన్‌ మేధావి రాసిన విధానం ఇది..‌ 'ఆ నాజీలు.. హిట్ల‌ర్ సేనలు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను కమ్యూనిస్టును కాదు‌ కదా, నా కోసం రాలేదని ఊరుకున్నాను. తర్వాత వాళ్లు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడూ మౌనంగా ఉన్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియనిస్టుల కోసం వచ్చారు. నాకు సంబంధించిన విషయం కాదుకదా‌ అని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు యూదుల కోసం వచ్చారు. అది కూడా నేను కాదు కదా అని ఊరుకున్నాను. తర్వాత నాజీ సేనలు నా ఇంటి దాకా వచ్చారు.. నా కోసం వచ్చారు. వెనక్కి తిరిగి చూస్తే నా కోసం ఎవ్వరూ కనపడలేదు'. అని అలా తనకు సంబంధం లేదని ఊరుకుంటే.. రేపు అందరికీ అదే గతి పడుతుందని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ, రాష్ట్రాల నామకులు మమతా బెనర్జీ, కరుణానిధి, జయలలిత, నవీన్‌పట్నాయక్‌లను శ్రీ జగన్‌ హెచ్చరించారు. ఇప్పుడు ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న విభజన రేపు మరో చోట జరుగుతుందన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎంతకైనా తెగబడుతుందన్నారు. అందుకే అందరం కలవాలన్నారు. విభజించు పాలించు విధానం తెరమరుగు కావాలన్నారు. వెంటనే మేల్కొనకపోతే దేశం మొత్తం అంధకారంలోకి పోతుందని శ్రీ జగన్‌ హెచ్చరించారు.

విభజనకు ఒప్పుకుంటారా? :
మన రాష్ట్రాన్ని విభజించడానికి ఒప్పుకుంటారా? అని ప్రశ్నించిన శ్రీ జగన్‌కు సభకు హాజరైన అశేష జనవాహిని 'నో' అంటూ సమాధానం చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తున్న సోనియాను, సీఎం కిరణ్‌ను, అందుకు తోడ్పడుతున్న చంద్రబాబు నాయుడిని క్షమించాలా? అని 'నో' అని సమాధానం రాబట్టారు. సోనియా గాంధీ గుండెలదిరేలా అందరూ రెండు చేతులూ ఎత్తి, దిక్కులు పిక్కటిల్లేలా సమాధానాలు చెప్పాలన్నారు. మీ సమాధానాలతో చంద్రబాబు, కిరణ్‌ల గూబలదరాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆయన ప్రజలకు నేరుగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆయా ప్రశ్నలకు అశేష సంఖ్యలో హాజరైన ప్రజలు ఒప్పుకొనేది లేదని సమాధానాలు ఇచ్చారు.

- రాష్ట్రాన్ని విడగొట్టడానికి ఒప్పుకొంటారా.. నో, ఒప్పుకోం.
- తెలుగు జాతి ముక్కలు కావాలా.. నో.
- మన నీటి కోసం మనమే కొట్టుకుని చావాలా.. నో.
- మన హైదరాబాద్ కోసం మనమే తన్నుకుని చావాలా.. నో‌.
- అన్నదమ్ముల మధ్య రోజూ గొడవలు జరగాలా.. నో.
- తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, కిరణ్, చంద్రబాబును క్షమించాలా.. నో.
- నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలను, అభివృద్ధిని అన్నింటినీ అటకెక్కిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా.. నో...
అంటూ సమైక్య శంఖారావం సభకు హాజరైన వారంతా బదులిచ్చారు.
జై తెలుగు తల్లి, జై సమైక్యాంధ్ర, జై వైయస్‌ఆర్ అంటూ‌ శ్రీ జగన్ ప్రసంగాన్ని ముగించారు.

Back to Top