రాజధానిలో సమైక్య శంఖారావం సభ: జగన్

హైదరాబాద్ 30 సెప్టెంబర్ 2013:

కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈమేరకు తాను రాష్ట్ర గవర్నరు నరసింహన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదని ఆయన స్పష్టంచేశారు. అందుకే అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలనీ, విభజనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం పంపాలనీ విజ్ఞప్తి చేశారు. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
16 నెలలుగా జైలులో ఉన్న సమయంలో  తరగని ఆప్యాయతతో తనపై అభిమానాన్ని చూపిన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ,  ప్రతి తాతకు, ప్రతి అన్న తమ్ముడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని శ్రీ జగన్ చెప్పారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దేశంలోని అందరికీ, కేంద్రంలోని పెద్దలకూ తెలుస్తున్నప్పటికీ, పార్టీలకు మాత్రం కనిపించడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. మిగిలిన పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. ఒక సమస్య ఉంటే దానిని తీర్చడానికి ఒక కుటుంబంలో అయితే ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తారు.. అలాగే కేంద్రం కూడా ఒక తండ్రిగా ఆలోచించి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు.  తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని రాజకీయ పార్టీలు నోరు విప్పడం లేదని శ్రీ జగన్ విమర్శించారు.
సమైక్యంగా ఉన్నప్పుడే మన రాష్ట్రంలో నీటి సమస్య ఉందనీ, మధ్యలో మరో రాష్ట్రం వస్తే అది ఎంత తీవ్రమవుతుందో కేంద్రం ఆలోచించడం లేదనీ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. మంచినీటి కోసం కొట్టుకునే పరిస్థితికి ప్రజలను తీసుకెడుతున్నామని తెలిపారు. అన్ని జిల్లాలకూ ఇదే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే జాతీయ హోదా ఇచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టుకు నీళ్ళెక్కడినుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ఆదాయంలో సగం రాజధాని నగరం హైదరాబాద్ నుంచే వస్తోందనీ, దీనిని వదిలిపెడితే సీమాంధ్రకు ఆదాయం ఎక్కడినుంచి వస్తుందనీ అడిగారు. పదేళ్లలో మరో రాజధాని కట్టుకోవడం సాధ్యమేనా అని నిలదీశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చదువు పూర్తి చేసిన పిల్లవాడు ఉద్యోగం చూసేది హైదరాబాద్ వైపేననీ చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు అన్యాయం జరుగుతోందని రోడ్డెక్కిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజల మనసులలో ఉన్న ఐక్య భావనను ఎవరూ తొలగించలేరని స్పష్టంచేశారు.

అక్టోబర్ 15-20 తేదీల మధ్య రాజధానిలో సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని శ్రీ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సమైక్యానికి కట్టుబడుతూ లేఖ రాస్తే.. తానే మొదటి సంతకం పెడతానని ప్రకటించారు. సమైక్యానికి అనుకూలంగా ఇప్పుడు మూడు పార్టీలున్నాయి.. ఇది ప్రారంభిస్తే నాలుగు, ఐదు పార్టీలుగా పెరుగుతాయని పేర్కొన్నారు. అలా చేస్తేనే రాష్ట్రం ముక్కలు కాకుండా ఆపగలుగుతామని శ్రీ జగన్మోహన్ రెడ్డ స్పష్టంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వనప్పుడు సమైక్య ఉద్యమంలో ఎలా పాల్గొంటారని ప్రతి రాజకీయ పార్టీనీ ప్రశ్నించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

తమకూ, కాంగ్రెస్ పార్టీకీ మధ్య ఒప్పందం ఉందని చంద్రబాబు, తదితరులు అంటున్న విషయమే నిజమైతే.. పదహారు నెలల పాటు తాను జైలులో ఎందుకు ఉంటానని శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చట్ట ప్రకారం 90 రోజుల్లో బెయిలు రావాలి కదా... విచారణ పూర్తికాని పక్షంలో మూడు నెలల్లోనే బెయిలు రావాలనే విషయం అందరికీ తెలుసు కదా అన్నారు.

ఐఎంజీ కేసులలో విచారణ జరగకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోర్టును ఆశ్రయించలేదా.. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే విప్ జారీ చేసి అది నెగ్గకుండా చేసింది ఆయన కాదా? ఇది చూస్తే తెలియడం లేదా? ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యిందీ అని ప్రశ్నించారు. ఒక మనిషి చనిపోయిన తరువాత కనీస ధర్మం పాటించకుండా కేసులు వేసే నైజం ఆయనదని చెప్పారు. చివరకు సమాచార హక్కు చట్టం  కమిషనర్ పదవులను కూడా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు పంచుకున్నాయని మండిపడ్డారు.

Back to Top