'సహకార విజయంతో జగన్‌కు కానుక ఇద్దాం'

రాజోలు (తూర్పు గోదావరి జిల్లా) : సహకార సంఘాల ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి జిల్లా నుంచి తొలి కానుక అందిద్దామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం కన్వీనర్ ఇందుకూరి రామకృష్ణంరాజు పిలుపునిచ్చారు. రాజోలు‌లోని వీరభాను పురమందిరంలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అధ్యక్షతన‌ జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతిగా అన్నదాతల గుండెల్లో ‌కొలువై ఉన్నారని రామకృష్ణంరాజు అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో వైయస్‌సిపి ఘనవిజయం సాధించడం ఖాయం అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పగ్గాలు వైయస్‌ఆర్‌సిపికే దక్కేలా నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో, సమన్వయంతో కష్టించి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి సొసైటీ పరిధిలో 12 మందితో నామినేషన్ వేసేటట్టు నాయకులు ప్రణాళిక రూపొందించాలని సూచించారు.‌ రైతుల పట్ల మూడేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న తీరును కరపత్రాల ద్వారా ప్రచారం చేయాలని రామకృష్ణంరాజు తెలిపారు.

సహకార ఓటర్ల జాబితాలు సమకూర్చుకుని, ఆయా సొసైటీల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు సమావేశమై ముందస్తుగా సొసైటీ ప్యానెల్‌ను నిర్ణయించుకోవాలని సహకార ఎన్నికల పార్టీ పరిశీలకుడు, డిసిఎంఎస్ చైర్మన్ రెడ్డి వీరవెంకట సత్యప్రసా‌ద్ అన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మిండగుదిటి మోహన్ మాట్లాడుతూ ప్రజాతీర్పును కోరేందుకు కాంగ్రె‌స్, ‌టిడిపిలు సిద్ధంగా లేవన్నారు.‌

విజయం మనదే: కుడుపూడి:
సహకార సంఘాల ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు కార్యకర్తలు సర్వ సన్నద్ధం కావాలని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. ‌పి.గన్నవరం కోకోనట్ మర్చం‌ట్సు అసోసియేషన్ హా‌ల్‌లో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు, నేతలు సమష్టిగా పనిచేసి, ఎన్నికల్లో విజయఢంకా మోగించాలన్నారు.
Back to Top