సహకారంలో వైయస్ఆర్ సీపీకి అన్నదాతల అండ

వైయస్ఆర్ జిల్లా:

అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సహకార ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. బెదిరింపులు, కిడ్నాప్‌లు, అధికార దుర్వినియోగం పాల్పడినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజా మద్దతును నిలువరించలేకపోయాయి. జిల్లాలో తొలివిడత 18 సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా అందులో 8 సంఘాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. 6  సొసైటీలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడు సొసైటీలను తెలుగుదేశం మద్దతు దారులు చేజిక్కించుకున్నారు. రైల్వేకోడూరులో జిరగిన సహకార సంఘ ఎన్నికలు జరిగిన తీరు కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. అధికార కాంగ్రెస్ పార్టీతో సొసైటీ అధికారులు కుమ్మక్కై నకిలీ ఐడెంటిటీ కార్డులు ముద్రించారని అన్నారు. ఆ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని శ్రీనివాసులు ఆరోపించారు.

అనంతపురంలో విజయకేతనం

అనంతపురం జిల్లా: జిల్లాలో తొలి విడత జరిగిన ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘాల ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు. 54 సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో కదిరి మండలంలోని గొల్లోళ్ల చెరువు, కూడేరు మండలం ముద్దలాపురం సొసైటీలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు, కదిరి, పెనుకొండ, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ప్రభంజనం సృష్టించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ దెబ్బకు టీడీపీ కోటలు పేకమేడల్లా కూలి పోయాయి.

వైయస్ఆర్ సీపీ వెంటే రైతులు

తూర్పుగోదావరి జిల్లా: సహకార ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు విజయాన్ని చేకూర్చి రైతులు వైయస్ఆర్ కాంగ్రెస్ వెంట ఉన్నారనే సత్యాన్ని మరోసారి రుజువు చేశారని ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ అన్నారు. ముందుగానే తొమ్మిది డెరైక్టర్ స్థానాలు ఏకగ్రీవం కాగా నాలుగు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు సైతం దక్కకపోవడం సిగ్గుచేటని ఉదయభాస్కర్ అన్నారు. దివంగతనేత వైఎస్‌రాజశేఖరరెడ్డి రైతుల కోసం అమలుచేసిన సంక్షేమ పథకాలే గెలుపునకు తోడ్పడ్డాయని ఆయన అన్నారు. కాకినాడలో జరిగిన సహకార సంఘాల తొలిపోరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన వారిని మట్టి కరిపించాలన్న కాంగ్రెస్, టీడీపీల కుతంత్రాలు, కుమ్మక్కులు ఫలించలేదు. రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పలు సంఘాల్లో విజయం సాధించినా అనేక చోట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపును నిలువరించలేకపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారు 19 చోట్ల గెలుపొందారు.

Back to Top