'సహకారం'లో నైతిక విజయం వైయస్‌ఆర్‌సిపిదే

హుజూర్‌నగర్‌ (నల్గొండ జిల్లా) : సహకార సంఘాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో నైతిక విజయం తమ పార్టీదేనని వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసి‌నా రైతులు దివంగత మహానేత రుణం తీర్చుకునేందుకే తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించారన్నారు. హుజూర్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన సహకార ఎన్నికల్లో కాంగ్రె‌స్ పార్టీ అనేక అడ్డదారులు తొక్కింద‌ని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. అయినప్పటికీ రైతుల శ్రేయస్సు కోసం దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టరస్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయ‌ సాధన కోసం స్థాపించిన వైయస్‌ఆర్‌సిపి 48 డెరైక్టర్ స్థానాలను గెలుచుకుందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రజలు వైయస్‌ఆర్‌సిపికి పట్టంకట్టేందుకు సిద్ధమయ్యారని ఈ ఎన్నికల ద్వారా తేలిపోయిందన్నారు.

ఆయకట్టు పరిధిలో మూడు సీజన్లుగా సాగునీరు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆయకట్టు పరిధిలోని మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.‌ నల్గొండ జిల్లాలో శ్రీమతి షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
Back to Top