సహకార ఎన్నికలలో విజయమే లక్ష్యం

విజయవాడ:

సహకార ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. విజయవాడలో జిల్లా సహకార ఎన్నికల భేరి పేరిట నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార వ్యవస్థకు జవసత్వాలు కల్పించేందుకు కృషిచేసింది దివంగత ముఖ్యమ్రంతి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో ఆర్థికసంక్షోభంలో కూరుకుపోయిన సహకార వ్యవస్థకు వైయస్ జీవం పోశారని చెప్పారు. అన్నదాతల ఆత్మహత్యల నివారణలో భాగంగా అన్ని సహకార సంఘాల్లో వాయిదా మీరిన పంటలన్నింటినీ రద్దు చేశారని గుర్తుచేశారు. ఇందుకోసం రూ. 200 కోట్లు కేటాయించారని చెప్పారు. వేలకోట్ల రుణమాఫీ ఘనత దివంగత మహానేతకే  దక్కుతుందన్నారు. త్వరలో జరగనున్న సహకార సంఘ ఎన్నికల్లో అదే తరహాలో నాలుగింట మూడొంతుల మేర సంఘాలను కైవసం చేసుకొని పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డికి అంకితమివ్వాలని పిలుపునిచ్చారు.

Back to Top