‘సహకార’ అక్రమాలపై చర్యలు తీసుకోండి

చిత్తూరు:

సహకార సంఘాల ఎన్నికలు, డీసీసీబీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరో గ్య రాజ్, ఎస్పీ కాంతిరాణా టాటాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ను కలిసిన తర్వాత కలెక్టరేట్  ప్రాంగణంలో చెవిరెడ్డి, మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కాంగ్రెస్ సర్కారు ప్రతి అంశంలో అడ్డదారిలోనే వెళుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారనీ, తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారనీ చెప్పారు. తాము గెలవలేమనుకున్న సింగిల్ విండోల ఎన్నికలను వాయి దా వేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు, డీసీసీబీ చైర్మన్ ఎన్నికలోనూ డిఫాల్టింగ్ పేరిట కొత్త తరహా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించా రు. కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీలను కలిసిన వారిలో వైయస్ఆర్‌ సీపీకి అనుకూలంగా ఉన్న 21 సింగిల్ విండోల డెరైక్టర్లు, పార్టీ చిత్తూరు నగర కన్వీనర్ రఘునాథరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు సయ్యద్ తదితరులున్నారు.

అమాస పదవి మూన్నాళ్ల ముచ్చటే...

 రెండోసారి డీసీసీబీ పదవిని అక్రమంగా దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమాస రాజశేఖరరెడ్డికి ఈ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మారనుందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వాయిదా వేసిన సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. ఓటమి భయంతోనే డిఫాల్టింగ్ నిబంధన కింద వైయస్ఆర్‌ సీపీ అనుకూల సింగిల్ విండో చైర్మన్లను డీసీసీబీ చైర్మన్ ఎన్నిక బరి నుంచి తప్పించారని తెలిపారు.

Back to Top