జననేతను భౌతికంగా నిర్మూలించే కుట్ర

ఉద్యమనాయకుడి వ్యక్తిత్వంపై దాడులు
వైయస్సార్సీపీ ఫినిష్ వ్యాఖ్యలపై అనుమానం
బాబు బెదిరింపులకు భయపడేది లేదు
చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోస్తాం
బాబు కుట్రలపై ప్రజలు మేల్కోవాలిః భూమన

హైదరాబాద్ః  ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ను చంద్రబాబు భౌతికంగా నిర్మూలించే కుట్ర చేస్తున్నాడన్న అనుమానం కలుగుతోందని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. మహానాడులో వైయస్ జగన్ పై వ్యక్తిగత దాడులు చేస్తూ... పదేపదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్ అయిపోతుందంటూ మాట్లాడడం చూస్తుంటే దీని వెనుక ఏవో కుయుక్తులు దాగి ఉన్నాయన్న సందేహం కలుగుతోందన్నారు. గతంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి ముందు రోజు కూడా ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామంటూ చంద్రబాబు మాట్లాడారని భూమన గుర్తు చేశారు. దివంగత నేత మృతిపట్ల మాకున్న అనుమానం నిజమేననిపిస్తోందన్నారు.  బాబు మాటల వెనుక ఉన్న పన్నాగంపై ప్రజలు అప్రమత్తం కావాలని భూమన పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. 

బాబు ఎవరి కాళ్లైనా పట్టుకుంటాడు
వైయస్ జగన్ వ్యక్తిత్వం మీద దాడి చేసేలా చంద్రబాబు మహానాడులో వందలాది మంది చేత తిట్టిపించడం దుర్మార్గమని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.  గుండె నిబ్బరత, నిజాయితీ, మహోన్నత వ్యక్తిత్వం, ఎవరికీ తలవంచని నైజం వైయస్ జగన్ సొంతమని భూమన అన్నారు. మహానాడులో వందలమంది చేత బాబు  వైయస్ జగన్ ను తిట్టే కార్యక్రమం చేశారంటే...ప్రజానాయకుడిగా వైయస్ జగన్ విజయవంతమయ్యారని చెప్పడానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు అవినీతి, మోసపూరిత పాలనమీద వైయస్ జగన్  తిరుగుబాటు చేస్తున్నారనే..బాబు దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. వైయస్ జగన్ పై విమర్శలతో పబ్బం గడుపుకోవడమంత నీచమైన పని మరొకటి లేదని భూమన ధ్వజమెత్తారు. బాబు తన స్వార్థం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకునేందుకు వెనుకాడని అమీబా జాతికి చెందిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. 

శృితమించుతున్న చంద్రబాబా స్వామి 
ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాజకీయ నేతనంటూ బాబు తనకు తానే చెప్పుకోవడం సిగ్గుచేటని భూమన ఫైరయ్యారు. తాను లేకపోతే ఏపీకి బిక్షపెట్టే వాళ్లే లేరన్న విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ...ప్రపంచంలోనే ఇంత దుర్మార్గంగా అబద్ధాలు  చెప్పే వ్యక్తి చంద్రబాబు తప్ప మరొకరి లేరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. బాబు వ్యాఖ్యలు ఎంతలా శృితిమించాయంటే....  వేల సంవత్సరాల క్రితమే తిరుమలలో కొలువైన వేంకటేశ్వరుల స్వాముల వారికి తానే వైభవాన్ని తీసుకొచ్చానని తెలుగుదేశం  పీఠాధిపతి  పరమపూజ్య, పరమహంస శ్రీశ్రీ నారా చంద్రబాబా స్వాముల వారు చెప్పడం దారుణమన్నారు. 

హిందూ ధార్మికతపై చావుదెబ్బ
స్వామి వారి ప్రియభక్తుడు అన్నమయ్య, స్వామివారికి భక్తి ప్రపత్తులతో వీరవిధేయుడిగా నిలిచిన శ్రీకృష్ణదేవరాయులు సహా వైకుంఠ స్వామిని పొగిడిన మహానుభావులను కనుమరుగు చేసేలా కొత్త పీఠాధిపతి చంద్రబాబా స్వాముల వారు  వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వెంకటేశ్వర స్వామి వారికి వైభవాన్ని తెచ్చింది తెలుగుదేశమేనంటూ బాబు హిందూ ధార్మికత మీద చావు దెబ్బ కొట్టారని మండిపడ్డారు. బాబు నీచ మాటలపై ప్రతీ హిందువు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నారు.  భగవంతుని పట్ల ఇంతటి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

ఎన్నీఆర్ విగ్రహానికి పూజలట
ఎన్టీఆర్ ను గోతి తవ్వి పూడ్చిపెట్టి ఆయన ఆశయాలను, ఆలోచలను సమాధి చేసిన చంద్రబాబు...అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేయాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. భక్తులు దేవుళ్ల దగ్గరకు వెళ్లనవసరం లేదు...ఎన్టీఆర్ విగ్రహానికి పూజలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని కొత్త పీఠాధిపతి నారా స్వాముల వారు చెప్పడం ఆయన మానసిక వికార స్థితికి అద్దం పడుతోందన్నారు. మూడు రోజుల మహానాడులో పచ్చి బూతులు మాట్లాడడం తప్ప పనికొచ్చే అంశాలపై చర్చే జరగలేదని భూమన ఆగ్రహించారు. అభివృద్ధి మాటలు మాని బాబు నిత్యం బూతులు తిట్టే కార్యక్రమం చేయడం దుర్మార్గమని భూమన నిప్పులు చెరిగారు.

లోకేష్ బాబు కాదు సూట్ కేసు బాబు
అవినీతిని నిరూపిస్తే జైలుకు వెళతానన్న లోకేష్ వ్యాఖ్యలపై భూమన తీవ్రంగా స్పందించారు. ఓటుకు కోట్లు కేసులో  రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా జైలుకు పోకుండా మేనేజ్ చేసుకుంటున్న సమర్థత బాబు కుటుంబానిదని భూమన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలంతా  లోకేష్ బాబును సూట్ కేస్ బాబు అని పిలుస్తున్నారని అన్నారు. మహానాడులో సీసీ కెమరాలు పెట్టామన్న బాబు వ్యాఖ్యలపై భూమన చురక అంటించారు. సీసీ కెమెరాలు పెట్టాల్సింది మహానాడులో కాదని....మీ కార్యాలయాలు, ఇళ్లు,  మీ తాబేదారులు సుజనాచౌదరి, సీఎం రమేష్ ఇంటిలో పెట్టి ప్రజలకు చూపిస్తే అప్పుడు అందరూ అంగీకరిస్తారని చెప్పారు.  

వంగవీటి రంగాను చంపింది బాబే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గూండాలు, రౌడీలు అంటూ మహానాడులో పచ్చనేతలు మాట్లాడడంపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.  వంగవీటి రంగా హత్యకు కారకుడు చంద్రబాబేనని మాజీ మంత్రి హరిరామజోగయ్య  పుస్తకం రాశారు. దీనికి ఏం సమాధానం చెబుతావ్ బాబు అని నిలదీశారు. తుని ఘటన వెనుక వైయస్సార్సీపీ ఉందని అంభాడాలు వేస్తున్న చంద్రబాబుకు .. సీబీఐ ఎంక్వైరీ వేసే దమ్ముందా అని భూమన ప్రశ్నించారు. రాష్ట్రంలో  ఏ హింసాయుత చర్య జరిగినా దాన్ని వైయస్ జగన్ కు ఆపాదించడం బాబుకు రివాజుగా మారిందని మండిపడ్డారు. గౌతమబుద్ధుడు, మహాత్మాగాంధీలు ఉండి ఉంటే వాళ్లను కూడా అంతుచూస్తానంటూ చంద్రబాబు బెదిరించే వాడన్నారు.  

కులగజ్జితోనే బాబు రాజకీయం ప్రారంభమైంది
నాకు కులం లేదు మతం లేదు, డబ్బు అవసరం లేదని చంద్రబాబా స్వాముల వారు చెప్పడం విడ్డూరమన్నారు. అసలు బాబు రాజకీయం ప్రారంభమైందే కుల గజ్జితోనని భూమన తెలిపారు . ఎస్వీ యూనివర్సిటీలో కుల రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయంటే అది బాబు సృష్టేనన్నారు.  అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని భూమన బాబుపై నిప్పులు చెరిగారు. దోచుకున్న డబ్బులు దాచుకునేందుకు ఇప్పటికే బాబు నాలుగు ఇళ్లు మార్చారని దుయ్యబట్టారు.  దుర్మార్గపు పాలనపై వైయస్సార్సీపీ యుద్ధం చేస్తుందని, బాబు అవినీతి సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుందని భూమన హెచ్చరించారు. 

తాజా ఫోటోలు

Back to Top