బాబుకు అర్థం కావాలనే..రైతు భరోసా యాత్ర

  • బాబు మాటలు నమ్మి మోసపోయిన రైతులు
  • రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు
  • పేదవాడి ఆరోగ్యం గురించి సర్కార్‌కు ఆలోచనే లేదు
  • ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు
  • పేదవాడికి చదువు అందకుండా చేశారు
  • నాడు ప్రతిపేద వాడికి వైయస్‌ఆర్‌ తోడుగా నిలిచారు
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే మళ్లీ గెలవలేవు
  • బాబు మోసాలపై రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలతోనే మాట్లాడిస్తాం
  • ఆత్మకూరు బహిరంగ సభకు పోటెత్తిన జనం
కర్నూలు: చంద్రబాబు రుణామాఫీ హామీని నమ్మిన రైతులు మోసపోయారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. బాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతుల పరిస్థితి అర్థం కావాలనే ఆ రోజు అసెంబ్లీలో రైతు భరోసా యాత్ర చేస్తానని మాట ఇచ్చానని, ఇచ్చిన మాట కోసమే కర్నూలు జిల్లాకు వచ్చానని వైయస్‌ జగన్‌ వెల్లడించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం జిల్లాలోని ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. చంద్రబాబు మూడేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. వైయస్‌ జగన్‌ ఏ మన్నారో ఆయన మాటల్లోనే.. ఇవాళ రైతు భరోసా యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాకు రావడం అందులో భాగంగా ఆత్మకూరుకు వచ్చి మీ ప్రేమాభిమానాల మధ్య నిలిచాను. కర్నూలు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 40 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారులు ఈ విషయం తేల్చినా కూడా ఎంతమందికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారని చంద్రబాబును అడుగుతున్నా. కేవలం నలుగురికే రూ.5 లక్షలు ఇచ్చారు. రైతులు చనిపోతే ఆదుకునే పరిస్థితి లేదు. తోడుగా నిలవడం లేదు. రైతన్నకు పంట రుణాలు బేషరత్తుగా మాఫీ చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఏ మీటింగ్‌లో మాట్లాడినా ఇవే మాటలు. బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే  బాబు సీఎం కావాలన్నారు. గోడల మీద రాస్తున్న రాతలు ఇవే. రైతన్నలను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను కూడా ఇలాగే మోసం చేశారు. చివరకు చదువుకుంటున్న పిల్లలను, చదువు పూరై్త ఉద్యోగాల కోసం ఎదురుచుస్తున్న పిల్లలను వదల్లేదు. జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి రావాలన్న మాటలు వినిపించాయి. జాబు రాకుంటే ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఎన్నికలు అయ్యిపోయాయి. చంద్రబాబు సీఎం జాబు తీసుకొని కూర్చీలో కూర్చున్నారు. ఇవాళ రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతున్నా.  రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బాబు చెప్పాడని రైతులు రుణాలు కట్టడం మానేశారు. రైతులందరికీ కూడా ఇంతకుముందు లక్ష లోపు వడ్డీ లేకుండా రుణాలు వచ్చేవి. ఆ అప్పుల మీద పావలా వడ్డీకే రుణాలు వచ్చేవి. సున్నా వడ్డీలు పోయాయి, పావలా వడ్డీలు పోయాయి. ఇవాళ రూ.2, 3 వడ్డీలకు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు రెన్యువల్‌ కావడం లేదు. దీంతో ఇన్సురెన్స్‌ అందడం లేదు. రైతులు బ్యాంకులకు వెళ్లే పరిస్థితి లేదు. రబీలో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో రూ.24 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. రూ.9800 కోట్ల టర్మ్‌ లోన్లు ఇవ్వాల్సి ఉంది. ఇవాళ కేవలం రూ.4900 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రైతులకు రుణాలు దొరక్క రబీ పంట వేసుకోవాలంటే దిక్కుతోచని పరిస్థితి. రబీ మొత్తానికి కూడా రూ.24 లక్షల హెక్టార్లలో వేయాల్సి ఉండగా, ఈ రబీలో కేవలం 11.90 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అంటే 48 శాతం మంది రైతులు పంటలు వేయడం లేదు. ఇంతటి దారుణంగా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు కేబినెట్‌ మీటింగ్‌లో రైతుల గురించి ఆలోచించరు. ఆరోగ్య శ్రీ నీరుగారిపోతున్న పరిస్థితుల్లో రోగుల ప్రాణాలతతో చెలగాటమాడుతున్నారు. చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జోక్‌గా మార్చారు. పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ప్రతి ఇంట్లో ఒక్కరైనా డాక్టర్, ఇంజనీరు చదివితే సాధ్యమవుతుందని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టారు. ఇవాళ ఆ పథకం నిర్వీర్యం చేశారు. లక్షల కొద్ది ఫీజులు పెంచారు. ప్రభుత్వం ఇచ్చేది రూ.35 వేలు ముష్టి వేసేలా ఇస్తున్నారు. ప్రతి పేదవాడికి ఫీజులన్నీ కూడా వైయస్‌ఆర్‌ పూర్తిగా చెల్లించారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. పేదవాడు కాలేజీలకు వెళ్లే పరిస్థితి లేదు. మిగిలిన ఫీజుల కోసం ఇవాళ ఇంట్లో ఆస్తులు అమ్ముతున్నారు. చంద్రబాబు వచ్చి మూడేళ్లు అవుతుంది. కేబినెట్‌ మీటింగ్‌లో చంద్రబాబు ఆలోచించడం లేదు. ఎన్ని ఇల్లు కట్టించామని ఆలోచించడం లేదు. దేశంతో పోటీ పడి మన రాష్ట్రంలో 48 లక్షల ఇల్లు కట్టించి పేదలకు తోడుగా నిలబడ్డారు. ఆ రోజులు పోయాయి. పేదవాడికి ఏం చేయాలి. రైతులకు ఏం చేయాలన్న ఆలోచన బాబు చేయడం లేదు. క్యాబినెట్‌ మిటింగ్‌లో రైతుల వద్ద భూములు ఎలా లాక్కోవాలి. కమీషన్లు ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. శ్రీశైలం డ్యాంలో 844 అడుగుల పైనా ఎన్ని రోజులుగా ఉన్నాయని ఇంజనీర్లను అడిగితే ఆగస్టు 16 నుంచి 844 అడుగల పైగా నీరు ఉన్నాయని చెప్పారు. డ్యాం నుంచి రాయలసీమ ప్రాజెక్లుకు నీళ్లు రావడం లేదు. ఏ ప్రాజెక్టు కూడా సగంలోనే ఆగిపోయాయి. గాలేరు–నగరి, హంద్రీనీవా, కేసీ కేనాల్‌ మరమ్మతుల పరిస్థితి అలాగే మారింది. రైతు భరోసా యాత్ర చేస్తే చంద్రబాబుకు అర్థమవుతుందని వచ్చాను. కర్నూలు జిల్లాలో ఉల్లిగడ్డలు కేజీ రూ.2  చొప్పున అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. టమాట కూడా రెండు రూపాయలకు కొనే నాథుడు లేడు. మిరప పంటకు ఇవాళ క్వింటాల్‌ రూ.7 వేల ధర పలుకుతుందని రైతులు అంటున్నారు. కనీసం రూ.10 వేలు వస్తేనే బతుకుతామని అంటున్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. కనీసం చంద్రబాబుకు రైతుల పరిస్థితి అర్థం కావాలని ఆ రోజు అసెంబ్లీలో స్పందించాను. రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టాను. రాబోయే రోజుల్లో బుద్ధి రావాలంటే, చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి గాలి మేడల్లో నుంచి బయటకు వస్తే రాళ్లలో కొడతారన్నది అర్థమవుతుంది. బాబుకు ఒక్క విషయం గట్టిగా చెప్పాలి. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు డబ్బులు ఆశ చూపారు. బాబూ.. రేపు గెలవాలంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంతోనో, కార్పొరేటర్లను కోనుగోలు చేస్తేనో గెలవవు. ప్రతి ఇంట్లో మీ ఫోటో ఉండేలా చేస్తేనే మళ్లీ గెలుస్తావ్‌.  బాబుకు ఎంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామన్న భ్రష్టుపట్టిన ఆలోచన తప్ప..వేరే ఆలోచన లేదు. ఎన్నాళ్లు బ్రతికామన్నది కాదు ముఖ్యం. బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యం. దిక్కుమాలిన పరిపాలన చేస్తున్న చంద్రబాబుకు జ్ఞానోదయం కావాలి. బాబుకు అర్థమయ్యేలా రైతులన్నతో చెప్పిస్తాం. రైతులు ఎంత నష్టపోయారో వాళ్లతోనే మాట్లాడిస్తాం. డ్వాక్రా మహిళలతో చెప్పిస్తాం. మనమంతా కూడా ఒక్కతాటిపై నిలబడాలి. బాబుకు జ్ఞానోదయం కలగాలి. నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి.
––––––––––––––––––
ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానం వస్తుంది
శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి
ఆత్మకూరు:ఏ వర్గానికి చిన్న సమస్య వచ్చినా∙క్షణం కూడా ఆలస్యం చేయకుండా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాలిపోతున్నారని శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బుడ్డా శేషారెడ్డి అన్నారు. అటువంటి నాయకత్వాన్ని, అభిమానాన్ని వదిలి కొంత మంది స్వార్థపరులు టీడీపీకి అమ్ముడపోయారని ఆయన మండిపడ్డారు. నాడు వైయస్‌ జగన్‌ పేరు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు టీడీపీలో చేరిపోయారని, ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానం వస్తుందని ఆయన అన్నారు. ఎన్ని కోట్లతో కొనుగోలు చేయగలరని టీడీపీ నేతలను ప్రశ్నించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుడ్డా మాట్లాడారు. కొందరు వ్యక్తలు పార్టీ మారింది కాక బుడ్డా శేషారెడ్డి కూడా టీడీపీలోకి వెళ్తారని ప్రచారం చే శారని, ఆ వార్తలను ఆయన ఖండించారు. తాను లోకల్‌ కబాలి కాదని, ఎవరికి దండాలు పెట్టే రకం కాదన్నారు. వైయస్‌ జగన్‌ అండ ఉన్నంత వరకు తనను ఎవరు ఏం చేయలేరని, తాను ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. ఈ రోజు రైతు భరోసా యాత్ర సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైయస్‌ జగన్‌ ఆత్మకూరు వచ్చారని, మన నియోజకవర్గంలో ఆరు రోజుల పాటు ఆయన ఉంటారని తెలిపారు. ఈ నియోజకవర్గంపైన వైయస్‌ జగన్‌కు  ఎంత అభిమానం ఉందో ఇదే నిదర్శనమన్నారు. ఈ రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా రైతు భరోసా యాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి అన్నారు. రైతుల కోసం ఇంత శ్రమిస్తున్నారని చెప్పారు. వైయస్‌ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉందామని పిలుపునిచ్చారు. పార్టీలు మారే స్వార్థపరులను తరిమితరిమి కొడదామన్నారు. బుడ్డా రాజశేఖరరెడ్డి వైయస్‌ఆర్‌సీపీలో గెలిచి,ఎవరిని పట్టించుకోకుండా, చివరకు కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా టీడీపీలో చేరిపోయారని మండిపడ్డారు. తనను వైయస్‌ జగన్‌  జిల్లా అధ్యక్షుడిగా చేసినా కృతజ్ఞత లేకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడ్డా రాజశేఖరరెడ్డికి చంద్రబాబు వద్ద అపాయింట్‌మెంట్‌ కూడా దొరకదని, అలాంటి వ్యక్తి ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. సాగునీటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని,తాగునీటికి కటకట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నడు జిల్లాలో రైతు ఆత్మహత్యలు లేవని,  గత రెండేళ్లుగా ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పుటికీ ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన గొప్ప వ్యక్తి వైయస్‌ జగన్‌ అని కొనియాడారు. మీ అందరి వైయస్‌ జగన్‌కు తోడుగా నిలవాలని, ఆయన్ను సీఎం చేసుకుందామని బుడ్డా శేషారెడ్డి పిలుపునిచ్చారు.

 
Back to Top