అవినీతికి తెరలేపిన అధికార పార్టీ నేతలు

ఎమ్మెల్యే వేగుళ్లపై కో ఆర్డినేటర్‌ లీలాకృష్ణ ధ్వజం
సవాల్‌కు ప్రతిసవాల్‌ కాకుండా చర్చకు రావాలని డిమాండ్‌
కేపీ రోడ్డు వెడల్పు నిధులు గత ప్రభుత్వ హయాంలో మంజూరైనవే 

అంగర(కపిలేశ్వరపురం):అధికార పార్టీ నేతలు నియోజకవర్గంలో అవినీతి, అరాచకాలకు తెరలేపారని వైయస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌  లీలాకృష్ణ అన్నారు. మండలంలోని అంగరలో సోమవారం పార్టీ నాయకులు గంగుమళ్ళ రాంబాబు, నేల సూర్యకుమార్, మేడపాటి లక్ష్మీ ప్రసాద్‌ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిధుల మంజూరు, వినియోగంలో ఎమ్మెల్యే వేగుళ్ల పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, టీడీపీ నేతలు జీతాలిస్తున్నట్టుగా ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మండపేట– కపిలేశ్వరపురం ఆర్‌అండ్ బీ రహదారి వెడల్పు పనులు కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే టెక్నికల్‌ శాంక్షన్‌ అయ్యిందని ఆ కృషితో మంజూరైన నిధులను తాను మంజూరు చేయించానంటూ సభలు, సమావేశాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల చెప్పుకుంటున్నారన్నారు. అంగరకు ఏడు కోట్లు మంజూరు చేయడాన్ని గొప్పగా చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు ఆ నిధులు వినియోగంలో అవినీతికి పాల్పడుతుండటమే కాకుండా, నాణ్యతలేకుండా పనులు చేస్తున్నారన్నారు.  తక్కువ మొత్తంతో ఉన్న పించన్లు పంపిణీ పథకాన్ని దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి రూ.రెండు వందలకు పెంచడమే కాకుండా నిరుపేదలందరికీ పంచిన ఘనత వహించారన్నారు. అలాంటి పథకాన్ని నియోజకవర్గంలో భ్రస్టుపట్టించారని, మంజూరు పేరుతో క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వారి అవినీతికి మార్గం ఏర్పాటు చేసుకునేందుకు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారన్నారు.  మండపేటలో రోజుకు రూ. 50 వేలు ఇచ్చి పేకాట ఆడుతూ కల్యాణ మండపాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వినియోగించడంపై ఎమ్మెల్యే స్పందించాలన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై బహిరంగ చర్చకు రమ్మని తాను విసిరిన సవాల్‌కు ఎమ్మెల్యే వేగుళ్ల ప్రతి సవాల్‌ విసురుతున్నారుకానీ చర్చకు మాత్రం సిద్దపడటంలేదన్నారు. తాను సిద్ధంగా ఉన్నానని, స్థలం, సమయం ఎమ్మెల్యే చెప్పాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గంగుమళ్ల రాంబాబు, మేడపాటి లక్ష్మీ ప్రసాదరెడ్డి, య్రరా వీరన్నబాబు, నేల సూర్యకుమార్, సూరంపూడి దుర్గాప్రసాద్, గంగుమళ్ల నారాయుడు, మందపల్లి నర్సింగరావు, పోసిన నాగేశ్వరరావు, పంతం రాజు, పెయ్యల యాకూబ్‌ ఉన్నారు. 

Back to Top