బ్రాహ్మణుల్లో సాధికారత అవసరం


విశాఖ: పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులలో సాధికారత అవసరమని మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.  బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఆ దిశగా కృషి చేశానన్నారు.  విశాఖలోని సిరిపురం జంక్షన్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు.  చారిత్రాత్మకంగా చూస్తే స్వాతంత్య్రం తరువాత బ్రాహ్మణులు నష్టపోయామన్నారు. బ్రాహ్మణులకు ఏం చేయాలన్నది ప్రభుత్వాలు ఆలోచించడం లేదన్నారు. ప్రతి కులానికి ఓ కార్పొరేషన్‌ అవసరమన్నారు.  ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కార్పొరేషన్‌ చైర్మన్లుగా చేస్తే బాగుటుందన్నారు. టీటీడీలో పురోహితులకు కనీస వేతనం ఇవ్వాలని తాను బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పుడు తీర్మానం చేశామన్నారు. కనీస వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఇవ్వాలన్నారు. దేవాలయ భూములను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనామ్‌ భూములను కూడా సంరక్షించాలన్నారు. ఈ భూములను కాపాడుకోలేకపోతే దేవాలయాల్లో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అర్చక వృత్తి కేవలం బ్రాహ్మణులదే కాదన్నారు. చిన్న కులాల వారు కూడా అర్చకులుగా ఉన్నారని చెప్పారు. భూముల కబ్జాను అరికట్టాలన్నారు. గుడవర్తి పద్మావతిపై అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ప్రజలు తిరగబడాలన్నారు. ట్రస్ట్‌ బోర్డుల విషయంపై ఆలోచన చేయాలన్నారు. వీటిని రాజకీయ పునరావాసకేంద్రాలను వాడుకోవద్దని సూచించారు. అర్చకులకు వారసత్వ హక్కులను పునరుద్ధరించేందుకు, రాజకీయ సాధికారత కూడా అవసరమన్నారు. మన సామాజిక వర్గానికి చెందిన వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరే ఉన్నారని చెప్పారు. చిన్న చిన్న కమ్యూనిటీలకు కూడా రాజకీయంగా ప్రాముఖ్యత కల్పించాలని కోరారు. పార్టీలో చేరడానికి ఇక్కడికి రాలేదని ఐవైఆర్‌ కృష్ణారావు పేర్కొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top