అనంతలో రౌడీరాజ్యం

మంత్రి పరిటాల వర్గం గుండాయిజం
వైయస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులు
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
టీడీపీ అరాచకాలను నిరసిస్తూ వైయస్సార్సీపీ భారీ ర్యాలీ
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ 

అనంతపురంః  మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో రౌడీరాజ్యం నడుస్తోంది. తమ మాటే వేదమన్న రీతిలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రతిపక్ష వైయస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారు.  టీడీపీ మోసపూరిత పాలనతో నష్టపోయిన రాప్తాడు, రామగిరిలకు చెందిన తెలుగుదేశం నేతలు  పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికలను జీర్ణించుకోలేని మంత్రి మద్దతుదారులు  వైయస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. 

టీడీపీ అరాచకాలను నిరసిస్తూ వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు నగరంలో భారీ ర్యాలీ తీశారు. మంత్రి పరిటాల సునీతకు వ్యతిరేకంగా నినదించారు. రోజురోజుకు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయని నేతలు మండిపడ్డారు. ఈర్యాలీలో అనంతవెంకట్రాంరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, శంకర్ నారాయణ, తోపుదుర్తి భాస్కర్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఎస్పీ, డీజీపీలుండానే ప్రకాశ్ రెడ్డి, ఈశ్వరయ్య మరికొందరిపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమని నేతలు  మండిపడ్డారు. దాడులు చేసిన నిందితులను అరెస్ట్ చేయాల్సింది పోయి...గాయపడిన వారిమీద పోలీసులు కేసులు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.  తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గాయపడిన వారిని చూసేందుకు వచ్చిన వైయస్సార్సీపీ నాయకులపై మారణాయుధాలతో దాడికి దిగడం అమానుషమన్నారు. 

తనను చంపేందుకు పరిటాల కుటుంబం కుట్ర పన్నిందని అనంతపురం జిల్లా రాప్తాడు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.   ప్రభుత్వాసుపత్రిలో పరిటాల వర్గీయులు తనపై దాడికి తెగపడ్డారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు గన్ మన్లను కూడా  ఉపసంహరించారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ప్ర‌కాశ్‌రెడ్డి అన్నారు. 

రాప్తాడు, రామగిరిల నుంచి టీడీపీ నేతలు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పరిటాల కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని  వైయ‌స్సార్ సీపీ నేత తోపుదుర్తి చందు మండిపడ్డారు. పరిటాల శ్రీరామ్ దాడులకు ప్రోత్సహించడం దారుణమని అన్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు భౌతిక దాడులు చేస్తున్నా పోలీసులు నిమ్మ‌కునీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హారించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా మారారని ఆయ‌న ఆరోపించారు. 

Back to Top