ఇకనైనా కళ్లు తెరువు చంద్రబాబు

సొంతజిల్లాను కూడా పట్టించుకోని చంద్రబాబు
బాధితులను ఆదుకోకుండా నీచ రాజకీయాలు
బాధితులకు ఇచ్చే బియ్యంలోనూ తమ్ముళ్ల వాటాలు

చిత్తూరుః వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధితులను పరామర్శించకుండా, నష్టనివారణ గురించి అధికారులకు ఆదేశాలివ్వకుండా చంద్రబాబు సొంత జిల్లా వాసులను కూడా మోసం చేస్తున్నారన్నారు.  స్థానికంగా వైఎస్సార్సీపీ ఉందన్న కసితోనే పనిచేయడం లేదా అని రోజా చంద్రబాబును ప్రశ్నించారు. జిల్లాలోని పుత్తూరు, నగరి తదితర వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రోజా పర్యటించారు.

పేదల కాలనీల్లో ఇంటిముందు నీళ్లు నిలవడంతో డెంగ్యూ వ్యాధులు సోకుతున్నా... ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. వరద ప్రాంతాల్లో బాధితులకు కొద్దోగొప్పో ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్పితే...ఇళ్లు కూలిపోయి నిరాశ్రుయులైన వారికి  శాశ్వత మార్గం చూపకపోవడం బాధాకరమన్నారు. పుత్తూరు, నగరిలలో చేనేత కార్మికులకు రెగ్యులర్ గా ఇచ్చే బియ్యంకూడా ఇవ్వడం లేదన్నారు. 30 ఏళ్ల పాటు అధికారపార్టీల్లో ఉన్న ముద్దుక్రిష్ణమనాయుడు కమిషన్ ల కోసం నాసిరకం ఫ్లైఓవర్లు నిర్మించి బ్రిడ్జి పరిసర ప్రాంతాలను నాశనం చేశారని నిప్పులు చెరిగారు. ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసే పనులు చేపట్టలేదన్నారు. 

శవాల మీద పేలాలు ఏరుకున్న చందాన వరద బాధితులకు వచ్చే బియ్యంలోనూ టీడీపీ నేతలు వాటాలు పంచుకోవడం సిగ్గుచేటన్నారు.  అవినీతి చేయడమే పనిగా పెట్టుకొని పింఛన్లు, గ్యాస్ సహా వేటిని లబ్దిదారులకు అందకుండా మింగేస్తున్నారని ఆరోపించారు. చెన్నైలో ఉన్న తెలుగువాళ్లను చంద్రబాబు గాలికొదిలేశారని రోజా పైరయ్యారు.  ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి అక్కడి తెలుగువారిని ఆదుకోవడంతో పాటు, రాష్ట్రంలో నష్టపోయిన బాధితులకు చేయూతనివ్వాలన్నారు.  లబ్దిదారులకు న్యాయబద్ధంగా రావాల్సిన వన్నీ అందించాలని డిమాండ్ చేశారు.
Back to Top