చంద్రబాబు జీవితం నిండా మచ్చలే: రోజా

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జీవితమంతా మచ్చలే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తన జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకుంటున్నారని మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటుపొడవడం మచ్చకాదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు జీవితంలో చెప్పుకోలేని మచ్చలున్నాయని ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో చీకట్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారని, అదే కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుని సమైక్యాంధ్ర ఉద్యమానికి వెన్నుపోటుపొడిచిన మచ్చ చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు.

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను పణంగా పెట్టింది చంద్రబాబు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళలను కించపరుస్తు సామెతలు చెప్పడం దారుణం అన్నారు. పోలవరం ప్రాజెక్టును తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారని దేవినేని విమర్శలు చేయడం హాస్యాస్పదం అని రోజా విమర్శించారు. తమ నేత అడ్డుకుంటే ఇరిగేషన్ మంత్రిగా నువ్వు గాడిదలు కాస్తున్నావా అని నిలదీశారు. జగన్ను విమర్శిస్తున్న కామినేని.. ఎలుకలు కరచి చిన్నారి చనిపోయినా ఎలా పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నించారు.
Back to Top