బాబు సీఎం ఏపీకా..? సింగ‌పూర్‌కా..?


హైదరాబాద్) అస‌లు బాబు సీఎం ఏపీకా..?  లేక సింగ‌పూర్‌కా అని వైయ‌స్సార్ కాంగ్రెస్
పార్టీ ఎమ్మెల్యే, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్‌.కె.రోజా మండిప‌డ్డారు. రాజ‌ధాని
నిర్మాణంలో సింగ‌పూర్ వాటా 58శాత‌మ‌ని బాబు ఎలా నిర్ణ‌యిస్తార‌ని ఆమె ప్ర‌శ్నించారు. హైదరాబాద్ లోటస్ పాండ్
లోని కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సింగపూర్ కంపీనీలు కేవ‌లం 350 కోట్లు పెడుతున్నార‌ని, అంతకు మించి అనేక
రెట్ల మేర లాభాలు దండుకొంటున్నాయని అభిప్రాయ పడ్డారు. భూమి, నీరు, క‌రెంటు, ఇత‌రాత్రా సౌక‌ర్యాలు క‌ల్పిస్తే సింగ‌పూర్
కంపెనీలు మాత్రం కేవ‌లం నిర్మాణాలు చేస్తాయన్నారు.

అంతా విదేశీమయం

ఏపీని తెల్ల‌దొర‌ల చేతిలో బాబు పెడుతున్నార‌ని,  ఒక‌ప్పుడు తెల్ల‌వాడి పాల‌న‌ను ఎంద‌రో మ‌హానాయ‌కులు
త‌ర‌మికొడితే బాబు ఆ పాల‌న‌ను తిరిగి  తీసుకొస్తున్నాడ‌ని
రోజా నిప్పులు చెరిగారు. టీడీపీ మంత్రులు సైతం చంద్రబాబు తాన అంటే తందానా
అంటున్నార‌ని ఆరోపించారు. స్విస్ చాలెంజ్ పద్ధతిని అడ్డుకునేందుకు ఢిల్లీకి వెళ్లి
ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామ‌న్నారు. సింగ‌పూర్ అమ్ముకుంటే అందులో 58శాతం వారికి ఇచ్చే ఒప్పందంలో అవినీతి నెల‌కొంద‌న్నారు.
భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డ కూడా ఇలా జ‌ర‌గ‌లేద‌న్నారు. ఎక్క‌డో ఉన్న సింగ‌పూర్
వారిని తీసుకొచ్చి వారికి ల‌బ్ధి చేసేవిధంగా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు.
అమ‌రావ‌తిలో భూముల్ని బినామీల పేరుతో కొల్ల‌గొట్టి, బినామీల కోస‌మే సింగ‌పూర్ కంపెనీల‌కు రాజ‌ధానిని
అప్ప‌గించార‌ని రోజా ఆరోపించారు.

 

అమ‌రావ‌తి పేరుతో బాంబులు...

రాజ‌ధాని పేరుతో అమ‌రావ‌తి నిర్మిస్తున్నారా..?  లేక అమ‌రావ‌తి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో
బాంబులు పేల్చ‌బోతున్నారా అని రోజా బాబును ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించిన
విజ‌య్ కేల్క‌రీ క‌మిటీ సైతం స్విస్ ఛాలెంజ్ ప‌ద్ద‌తి వ‌ల్ల న‌ష్ట‌మ‌ని నివేద‌క స‌మ‌ర్పించిందన్నారు.
స్విస్ ఛాలెంజ్ విధానం వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు స్వ‌యంగా చెప్పినప్పటికీ, బాబు విన‌టం
లేద‌న్నారు. స్విస్ ఛాలెంజ్ విధానాన్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని
విధాలుగా అడ్డుకుంటుంద‌న్నారు. రాష్ట్రాన్ని విభ‌జ‌న చేయ‌డం వ‌ల్ల సోనియాగాంధీని
ప్ర‌జ‌లు ఎలా దూరం పెట్టారో... బాబు చేసే అవినీతిని చూసి ప్ర‌జ‌లు  అలాగే దూరం పెడ‌తార‌న్నారు. భ‌గ‌వంతుడు అంటే భ‌యంలేని
బాబు దేశాన్ని ఏం గౌర‌విస్తాడు... రాష్ట్రాన్ని ఏం పాలిస్తార‌ని ఎమ్మెల్యే రోజా
ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని తెలుగు దొంగ‌ల పార్టీగా మార్చిన ఘ‌న‌త బాబుద‌న్నారు.

మోడీ మెకిన్ ఇండియా... బాబూ టెకిన్ ఇండియా...

మోడీ మెకిన్ ఇండియా అంటుంటే... బాబు టెకిన్ ఇండియా అంటున్నార‌ని ఆమె తెలిపారు.
బాబు అవినీతి పాల‌న‌పై బీజేపీ నాయ‌కులు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నార‌ని ప్ర‌శ్నించారు.
రాజ‌ధాని బాబుదో లేక బాబు కుటుంబానికి సంబంధించిన‌దో కాద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు
సంబంధించినద‌ని రోజా పేర్కొన్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రాన‌ని
బాబే చెప్ప‌డం జ‌రిగింద‌న్నారు. సింగ‌పూర్ కంపెనీల‌కు సైతం టీడీపీ అధికారంలోకి రాదన్నవిష‌యం
అర్థ‌మ‌యింద‌న్నారు. అందువ‌ల్లే ఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినా, ఈ ప‌ద్ధ‌తిని
కొన‌సాగించాల‌న్న నిబంధ‌న విధించార‌న్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ఆధ్వ‌ర్యంలో
తిరిగి ఢిల్లీకి వెళ్లి స్విస్ ఛాలెంజ్ పద్ధ‌తిపై పోరాటం చేస్తామ‌న్నారు. ఛాన‌ళ్ల‌ను
సైతం పెద్ద‌బాబు,
చినబాబుత‌మ గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పారు. ఎదురు తిరిగిన వారిపై కేసులు పెట్ట‌డం, పొలాల‌ను త‌గ‌ల‌బెట్ట‌డం వంటి దారుణాల‌కు
పాల్ప‌డుతున్నార‌న్నారు. 

  బాబు చేస్తున్న అవినీతికి వ్య‌తిరేకం

రాజ‌ధాని అనేది ఒక్కరికి సంబంధించింది కాద‌ని అంద‌రీ భ‌విష్య‌త్‌కు సంబంధించిన
విష‌య‌మ‌న్నారు. గ్లోబ‌ల్ టెండ‌ర్లు పిలిస్తే ప్ర‌పంచంలో ఉన్న అంద‌రూ పాల్గొంటార‌న్నారు.
రాష్ట్రంలో ఎన్ని అరాచ‌కాలు జ‌రిగినా బాబును ప్ర‌శ్నించేవారు లేకుండా కేసులు
పెడుతున్నార‌న్నారు. ప్ర‌భుత్వం రూ. 5వేల కోట్ల‌తో మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తుంద‌న‌డంలో
ఎంత‌మేర నిజ‌ముంద‌న్నారు. భూకంపం వ‌చ్చినా, సునామీ వ‌చ్చినా సింగ‌పూర్‌కు న‌ష్ట‌ప‌రిహారం
చెల్లించాలి అని చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు. ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులు క‌ట్టిన
ఘ‌న‌త భార‌తీయుల‌కు ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ద‌ద్ద‌మ్మ కాబ‌ట్టి భార‌త‌దేశంలో ఉన్న
యువ‌త‌,
ఇంజ‌నీర్లు ద‌ద్ద‌మ్మ‌లు
అనుకోవ‌డం సిగ్గు చేట‌న్నారు. బాబు త‌న‌యుడు ఫారిన్‌లో చ‌దువుకున్నా రాష్ట్రానికి
ఏమాత్రం ఉప‌యోగం లేద‌న్నారు.  ప్ర‌స్తుతం నాసాలో 50శాతానికి పైగా భార‌తీయులు ప‌ని చేస్తున్నార‌న్న
విష‌యాన్ని గుర్తు చేశారు.   

నో పోలీస్‌,... 

త‌న బావ‌మ‌రిది బాలక్రష్ణ నటించిన సింహ సినిమాలో నో పోలీస్ అన్న డైలాగును బాబు
ఆచ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బాబు ప‌బ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్క‌రాలో 29 మందిని చంపేస్తే నో పోలీస్‌... రితితేశ్వ‌రీని
ర్యాంగింగ్ చేసి చంపేస్తే నో పోలీస్‌... కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్‌లో వంద‌ల మంది మ‌హిళ‌ల‌ను
వ్య‌బిచారంలోకి దించితే నో పోలీస్‌... కాల్‌మ‌నీ వ్య‌వ‌హారంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మ‌హిళ‌ల‌పై రెచ్చిపోయిన నో పోలీస్...
చింత‌మ‌నేని వ‌న‌జాక్షిని కొట్టిన నో పోలీస్ అన్న ధోర‌ణితోనే బాబు పాల‌న ఉంద‌ని
మండిప‌డ్డారు. ప్రాణం పోతుంటే మంచినీళ్లు ఇవ్వ‌కుండా త‌రువాత బంగారు గ్లాసులో
ఇస్తాన‌న్న విధంగా బాబు పాల‌న ఉంద‌న్నారు. విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి రావాల్సిన హ‌క్కుల‌ను
ముందు తీసుకు వ‌చ్చి చూపించాల‌న్నారు. రాజ‌ధాని అనేదీ కేవ‌లం అర‌చేతిలో వైకుంఠ‌మ‌న్నారు. 

 

Back to Top