అంతా టెంపరరీ..వేల కోట్ల దోపిడీ

  • ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేస్తున్నావు
  • కోర్‌ క్యాపిటల్‌ పేరుతో మరో శంకుస్థాపన 
  • ఓటుకు కోట్ల కేసు కోసం కేంద్రంతో రాజీపడ్డ బాబు
  • హైదరాబాద్‌లోని సచివాలయం మీ సొంత ఆస్తా?
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
హైదరాబాద్‌: ఎవడబ్బ సొమ్మని తాత్కాలిక భవనాలకు వందల కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. టెంపరరీ భవనాల పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతిపై శ్రీకాంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.  పబ్లిసిటీ కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేసి ప్రధానితో చెంబెడు నీళ్లు, మట్టి తెప్పించి శంకుస్థాపన చేయించారని, ఆ తర్వాత ప్రతీ మంత్రి శంకుస్థాపన చేస్తూ భవనాలు నిర్మించుకొని వాస్తు లేదని కూలగొట్టిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్‌ స్ట్రక్చర్‌లో చదరపు అడుగులో కట్టాలన్నా రూ. 4 వేలు పెడితే బ్రహ్మండగా నిర్మించవచ్చని కానీ చంద్రబాబు రూ. 8 వేలు ఖర్చు చేస్తూ దాదాపు రూ. 2 వేల కోట్ల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కొత్త సచివాలయం కోసం రూ. 350 కోట్లు మాత్రమే వెచ్చిస్తుంటే బాబు   శంకుస్థాపన పేరుతో రూ. 400 కోట్లు, తాత్కాలిక సచివాలయానికి రూ. 2000 కోట్లు అంటూ దోపిడీ చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. నిజాయితీలో అన్నా హజారేనని చెప్పుకునే బాబు తన అవినీతిని ఒప్పుకోకుండా ఇంకొకరిపై ముద్ర వేయడానికి మాత్రం కుట్ర ప్రకారం ప్లాన్‌ చేస్తాడని ధ్వజమెత్తారు. 

ప్రజలను సర్వనాశనం చేస్తున్నారు
ఏపీకి ఏం మేలు చేశారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని ప్రశ్నించాల్సిందిపోయి మళ్లీ కోర్‌ క్యాపిటల్‌ పేరుతో శంకుస్థాపన చేయడానికి ఆయన్ను ఆహ్వానిస్తున్నారంటేనే ప్రభుత్వ తీరు ఎలాంటిదో అర్థమవుతోందన్నారు. ప్రపంచంలోనే ఉన్నత రాజధాని అని చెప్పి ప్రధానితో శంకుస్థాపన చేయించి మళ్లీ కోర్‌ క్యాపిటల్‌ ఏంటని ప్రశ్నించారు. అరుణ్‌జైట్లీతో శంకుస్థాపన చేయించేది కూడా అఫీషియల్‌ కాదని, ప్రభుత్వం ఎప్పుడు ప్రోటోకాల్‌ పద్దతులు పాటించదని ఎద్దేవా చేశారు. ఈ రకమైన కుట్రలు చేస్తూ తెలుగు ప్రజలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు. ప్యాకేజీని నాకున్న ప్రసార మాధ్యమాల ద్వారా గొప్పదని ప్రచారం చేసుకుంటానని చెప్పి కేసు నుంచి బయట పడడం కోసం కేంద్రంతో బాబు రాజీపడ్డారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో 6 నెలలు దాక్కొని విభజన సమయంలో వచ్చి ఏపీకి రూ. 5 లక్షల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు కోరాడని చెప్పారు. జైట్లీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఏపీకి ఇవ్వాల్సిన రూ. 3500 కోట్లలలో రూ. 2500 కోట్లు ఇచ్చేశాం. రూ. 1000 కోట్లు ఇస్తే సరిపోతుందని తెల్చి చెప్పారన్నారు. అయినా దీని గురించి బాబు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా హోదా కంటే ప్యాకేజీ మంచిదని సన్మానాలు చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

కేసీఆర్‌తో కుమ్మకై దోచుకుంటున్న బాబు
చంద్రబాబు, గవర్నర్‌ ఏకాంత చర్చలో నిర్ణయాలు ఏంటని శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లోని సచివాలయం ఇచ్చేద్దామని చెప్పేందుకు మీకేం అర్హతవుందని ప్రశ్నించారు. అదేమైనా మీ ఆస్తా అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రాంత వాసులు లక్షలాది మంది ఉన్నా వారి గురించి ఆలోచన చేయరా అని విరుచుకుపడ్డారు. ఓటుకు కోట్లు కేసు నుంచి హైదరాబాద్‌ను విడిచి విజయవాడకు అర్థరాత్రి పారిపోయారని విమర్శించారు. ఏపీ నుంచి పాలన సాగిస్తానని గొప్పలు చెప్పుకున్నబాబు తెలంగాణలో వందలాది కోట్లతో ఇంద్రభవనం ఎందుకు నిర్మిస్తున్నారని ప్రశ్నించారు. ఇది అవినీతి కాదా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత ఎన్టీఆర్‌ భవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి పది సంవత్సరాలు హైదరాబాద్‌ నుంచి పరిపాలన సాగిస్తానని చెప్పి ఎందుకు విజయవాడకు వెళ్లిపోయారన్నారు. ఇక్కడ ఉంటే కమీషన్లు రావని విజయవాడకు వెళ్లారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌తో చేతులు కలిపి ప్రజలను దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. సచివాలయాన్ని వదిలేసే ముందు ప్రతిపక్ష అభిప్రాయాలు తీసుకోరా అని ప్రశ్నించారు. ఈ ఆలోచన సబబు కాదని హెచ్చరించారు. 

ఎవరి గొంతు కోయడానికి
తాత్కాలిక భవనాలు, ప్రాజెక్టులతో ఎవరి గొంతు కోస్తారని శ్రీకాంత్‌రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. పట్టిసీమ, సచివాలయం ఏది చూసినా టెంపరరీ అంటూ లూటీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు మరి 9, 10 షెడ్యూల్‌ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 89 కార్పొరేషన్‌ సంస్థలు, 107 విద్యాసంస్థలు ఉంటే వాటిని గాలికొదిలేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కాలపరిమితి 60 సంవత్సరాలు పెంచామన్నారు. కానీ కార్పొరేషన్‌ ఉద్యోగులు 58 సంవత్సరాల వయస్సుకే రిటైర్డ్‌ అయిపోతున్నారు అంటే వీరికో న్యాయం వాళ్లకో న్యాయమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రజలందరికి సమన్యాయం చేయాల్సిన వ్యక్తి ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం ఎక్కడి న్యాయమని ధ్వజమెత్తారు. సౌకర్యాలన్ని ఏర్పాటు చేసిన తరువాత ఉద్యోగులను ముందు పంపించి తరువాత వెళ్లాల్సిన ముఖ్యమంత్రి కేసు కోసం భయపడి ఆయన ముందు వెళ్లి ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. బాబుకంటే ముందే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విజయవాడను ఐటీ రంగంలో అభివృద్ధి పర్చాలని మేధా టవర్స్‌ను కట్టించారని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌ బయటకు రాకుండా ఉండడం కోసం తాత్కాలికం అని పట్టుకూర్చున్నారన్నారు. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టులు కూడా వైయస్‌ఆర్‌ ఘనతేనని కొనియాడారు. వైయస్‌ఆర్‌ను ప్రజల నుంచి దూరం చేసేందుకు కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తూ విజయవాడ నడిబొడ్డున ఉన్న విగ్రహాన్ని తొలగించారని మండిపడ్డారు. 

 
Back to Top