రహదారి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి

కడప కార్పొరేషన్‌: మండల కేంద్రమైన చెన్నూరులో ప్రధాన రహదారి, సర్వీసు రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు, డ్రైనేజీ కాలువ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. ఎనిమిదేళ్లవుతున్నా చెన్నూరులో రహదారి పనులు పూర్తి చేయకపోవడంపై ఈనెల 27వ తేది వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కేఎంసీ సీనియర్‌ మేనేజర్‌ జీవీ రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... 8 సంవత్సరాలుగా రహదారి పనులు పెండింగ్‌లో ఉండటంతో స్థానికంగా పేద ప్రజలు డ్రైనేజీ నీరు పోక చాలా ఇబ్బందులు పడుతున్నారని, దోమలు, ఈగలతో ప్రతి ఇంట్లో పిల్లలు, పెద్దలు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. చిన్నమాచుపల్లె వద్ద కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. పెన్నానదిపై మరో బ్రిడ్జి కూడా నిర్మించాల్సి ఉందని, అది వీటితోపాటు పూర్తి చేయాలని తాము కోరడం లేదన్న విషయాన్ని కేఎంసీ గుర్తించాలన్నారు. ఏఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ఖచ్చితమైన షెడ్యూల్‌ ఇవ్వకపోతే మళ్లీ ఆందోళనకు సిద్దమవుతామని కేఎంసీ డైరెక్టర్‌ పృథ్వీరెడ్డిని ఫోన్‌ ద్వారా హెచ్చరించారు. ఇందుకు కేఎంసీ మేనేజర్‌ సమాధానమిస్తూ రెండుసార్లు తాము పనులు చేసేందుకు ఉపక్రమిస్తే కొంతమంది అడ్డుకున్నారని, దీంతో తమ సిబ్బంది వెనక్కువచ్చేశారని తెలిపారు. రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మండల వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఆర్‌వీఎస్‌ రెడ్డి, చీర్ల సురేష్‌యాదవ్, శ్రీనివాసులరెడ్డి, పులి సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Back to Top