నంద్యాల దెబ్బకు బాబు అబ్బా అనాలి

నంద్యాల : బాబు వెన్నుపోటుకు, జగన్‌ విశ్వసనీయతకు మధ్య నంద్యాల ఎన్నిక జరుగుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా అన్నారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు నాయుడిదని, అలాంటి చంద్రబాబుకు బాలకృష్ణ ప్రచారం చేయడం దారుణమన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం పెదకొట్టాలలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... ‘బాలకృష్ణ అమాయకుడు... చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ నే చదివారని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతోనే బాలకృష్ణను చంద్రబాబు వాడుకుంటున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా బాలకృష్ణ మాట్లాడుతున్నారు.. 21మంది ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలిచ్చి చంద్రబాబు కొన్నారు. ఇప్పటివరకూ వారితో రాజీనామా చేయించలేదు. ఆ విషయం తెలుసుకోకుండా బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఆయన రాజకీయాలు గురించి మాట్లాడేముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ముందుగా చంద్రబాబు నిజ స్వరూపం ఏంటో గుర్తించాలని రోజా సూచించారు. 

చంద్రబాబు ఒత్తిడితోనే భూమా నాగిరెడ్డి చనిపోయారు. శోభా నాగిరెడ్డి చివరి రక్తపు బొట్టు వరకూ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడారు. కానీ ఇప్పుడు అఖిలప్రియ అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు పంచన చేరారు. నంద్యాల ప్రజలకు మంచి అవకాశం వచ్చింది. ఉప ఎన్నిక ద్వారా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలి. ఎవరు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో వాళ్లే నంద్యాల ప్రజలు. నంద్యాల దెబ్బకు చంద్రబాబు అబ్బా అనాలి. ఎదురు దెబ్బలు తింటూ, నైతిక విలువలతో ముందుకు వెళుతున్న జగనన్న నిలబెట్టిన శిల్పా మోహన్‌ రెడ్డి వెంట ఉందాం. న్యాయం, ధర్మం వైపు ఉందామని నిరూపించుకుందాం. వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం’  అని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పాల్గొన్నారు.
 
Back to Top