రిమాండ్ పొడిగింపునకు కారణాలు చెప్పాలి

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో దర్యాప్తు ఏ దశలో ఉందంటూ సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీబీఐని ప్రశ్నించారు. దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని కూడా అడిగారు. ఈ నెల 27వ తేదీ వరకూ రిమాండును పొడిగిస్తూ.. తదుపరి రిమాండును పొడిగించేందుకు కారణాలు వివరించాలని కోరారు. అభియోగాల నమోదు ప్రక్రియకు అభ్యంతరం ఏమిటని న్యాయమూర్తి సీబీఐని అడిగారు. దీనికి సంబంధించిన స్పష్టమైన కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలనీ ఆదేశించారు. ఈనెల 27న శ్రీ జగన్మోహన్ రెడ్డిని కోర్టులో హాజరు పరచాలనీ, అదే రోజుల అభియోగాల నమోదు ప్రక్రియను ఆరంభిస్తామనీ న్యాయమూర్తి పేర్కొన్నారు.
శ్రీ వైయస్. జగన్మోహన్‌ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు నిర్దిష్టమైన గడువు విధించకపోయినా దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో తెలిపాల్సిన అవసరముందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.  దర్యాప్తు పురోగతిని వివరించడంతోపాటు నిందితుల రిమాండ్ ఎందుకు పొడిగించాలో చెబుతూ ప్రతి 14 రోజులకొకసారి మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు. దుర్గాప్రసాద రావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. తొలుత  కారణాలు చూపించకుండానే కోర్టు రిమాండ్‌ను పొడిగించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను హరించడమేనని జగన్ తరఫు న్యాయవాది జి. అశోక్‌రెడ్డి తెలిపారు. రిమాండ్ పొడిగించాల్సిన అవసరం ఏమిటో కోర్టుకు సీబీఐ స్పష్టం చేయాల్సిన అవసరముందని తెలిపారు. సరైన కారణాలు చూపకుండా కోర్టు రిమాండ్ పొడిగించరాదని నివేదించారు. 2011 ఆగస్టులో కేసు నమోదు చేసిన సీబీఐ... దర్యాప్తునకు చాలా సమయం తీసుకుందన్నారు. అభియోగాల నమోదు ప్రక్రియకు ఇరువర్గాలు సిద్ధంగా ఉన్నాయా అని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. తుది చార్జిషీట్ తర్వాతే అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలనీ, అన్ని చార్జిషీట్లలోనూ తమ వాదన ఒకే విధంగా ఉంటుందనీ అశోక్‌రెడ్డి నివేదించారు.
కేసులో వీలైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ.. గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిందనీ,  అంటే ఆరు నెలలా అని జగన్ తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ప్రశ్నించారు. దర్యాప్తు త్వరగా పూర్తిచేయాలనీ,  నిందితులను అవసరం లేకుండా ఎక్కువ కాలం జైల్లో ఉంచరాదని ఏఆర్ అంతూలే వర్సెస్ ఆర్‌ఎస్ నాయక్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. అవసరం లేకపోయినా నిందితులను జైల్లో ఉంచడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్దమని, వేగంగా తుది విచారణ నిర్వహించడం, కేసుల విచారణను సత్వరం పూర్తి చేయాలని కూడా ఈ కేసులో ధర్మాసనం పేర్కొందన్నారు. వేగంగా కేసు విచారణను చేపట్టాలని కోరే హక్కు నిందితునికి ఉంటుందని చెప్పారు.
వేధింపుల్లో భాగంగానే :
     శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని వేధించేందుకే సీబీఐ రిమాండ్‌లో ఉంచాలని కోరుతోందని అశోక్‌రెడ్డి ఆరోపించారు. దురుద్దేశంతోనే అవసరం లేకపోయినా జగన్ రిమాండ్ పొడిగించాలని సీబీఐ కోరుతోందని తెలిపారు. ‘ఎనిమిది నెలలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి రిమాండ్‌లో ఉన్నారనీ, ఇప్పటికే సీబీఐ నాలుగు చార్జిషీట్లు దాఖలు చేసిందనీ నాలుగో చార్జిషీట్ దాఖలు చేసి కూడా ఆరు నెలలు గడిచింది. ఈ ఆరు నెలలుగా దర్యాప్తులో ఎటువంటి పురోగతి ఉందో కోర్టుకు వివరించలేదు. అలాంటప్పుడు ఆయన ఇంకా రిమాండ్‌లో ఎందుకుండాలఅని ప్రశ్నించారు.
దీనికి సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ సలహాదారు బళ్ళా రవీంద్రనాథ్ వాదనలు వినిపించారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసు తీవ్రమైన ఆర్థిక నేరమనీ, ఆయన జైల్లో ఉన్నారు కాబట్టే  దర్యాప్తు స్వేచ్ఛగా సాగుతోందనీ, అనేక మంది సాక్ష్యం చెప్పేందుకు ముందుకు వస్తున్నారనీ వివరించారు. ఆయనకు బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందన్నారు. దర్యాప్తును పూర్తి చేసి తుది చార్జిషీట్ మాత్రమే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. రిమాండ్ పొడిగించడానికి కారణాలను వివరిస్తూ మెమో దాఖలు చేస్తామని పేర్కొన్నారు.

Back to Top