పరిష్కారం చూపడం మాని మహానేతపై నిందలా!

హైదరాబాద్ 01 సెప్టెంబర్ 2013:

రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందినవారు రాజీనామాలు చేసి ఆందోళనకు దిగాలని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ డిమాండు చేశారు. పార్టీ ప్రధాన  కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం నుంచి చేపట్టిన ఆత్మ గౌరవ యాత్రలో సమస్యకు పరిష్కార మార్గం చూసిస్తారని అందరూ ఎదురు చూస్తుంటే  ఆయన దివంగ మహానేత డాక్టర్ వైయస్ఆర్ ను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.  ఆయన ఉపన్యాసం ఊకదంపుడుగా సాగింది తప్ప మరోటి కాదన్నారు.  చంద్రబాబు ఓట్ల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నేతగా రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలని కొణతాల చంద్రబాబుకు హితవు పలికారు. చంద్రబాబు తన యాత్రలో దివంగత మహానేతపఐ దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారనీ, ఇది తగదని చెప్పారు. ప్రస్తుత సమస్య పరిష్కారానికి ఒక్క మంచి సూచన కూడా చేయలేదన్నారు. ఆయన చెప్పినట్టు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసు పార్టీకి తోక పార్టీ కాదని స్పష్టంచేశారు. టీడీపీని ఒక పావుగా ఉపయోగించుకుని కాంగ్రెస్ మనుగడ సాగిస్తోందన్న వాస్తవాన్ని చంద్రబాబు గుర్తించాలన్నారు. తన భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆందోళన ఆయన ప్రసంగాల్లో కనిపిస్తోందని చెప్పారు. టీడీపీయే కాంగ్రెస్‌కు తోకపార్టీగా తయారైందన్నారు. రాష్ట్ర ప్రజలతో ఓట్ల కోసం ఆడుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. ఇలాంటి వ్యవహారశైలి వల్ల ఉభయ భ్రష్టులవుతారని కొణాతాల హెచ్చరించారు. నిందారోపణలతో ప్రయోజన పొందాలనుకోవడం తగదనీ, ప్రజలు గమనిస్తున్నారనీ చెప్పారు.

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు.  ఏ ప్రాంతానికి కూడా న్యాయం చేసే ఆలోచన వారికి లేదని పేర్కొన్నారు.  తెలంగాణ అంశంపై జరిగిన ఏ ప్రయత్నాన్ని గానీ, కమిటీలను గానీ, ఆఖరికి  శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన నివేదికను కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టిందన్నారు.   అందరితో సంప్రదించి, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకొని ఏకాభిప్రాయంతో రాష్ట్రాన్ని విభజించాలని కొణతాల కాంగ్రెస్ పార్టీని డిమాండు చేశారు. ప్రజల సమస్యలను వదిలిపెట్టి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం మంచిది కాదని సూచించారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు, రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని తాము ముందు నుంచి చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచవలసిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇటీవల ప్రధానిని ఢిల్లీలో తమ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నేతృత్వలో కలిసినప్పుడు అందరితో చర్చించి సమస్యల పరిష్కరించి నిర్ణయం తీసుకోవాలనీ, లేకుంటే రాష్ట్రం రావణకాష్టంలా మారే అవకాశముందనీ చెప్పామన్నారు. విభజించి పాలించాలనే దురద్దేశం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై ఓ అత్యున్నత కమిటీని నియమించే యోచన కూడా కనిపించడం లేదన్నారు. వచ్చే వారమో పై వారమో తెలంగాణపై బిల్లును క్యాబినెట్లో పెట్టే అవకాశం కూడా లేకపోలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆగిపోయే సూచనలు ఎక్కడా కనిపించడం లేదన్నారు. అదే సందర్భంలో విభజన సందర్భంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే ఆలోచన కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం సమైక్యంగానే ఉండాలన్నారు. నష్టపోయే అవకాశమున్నప్పుడు సమైక్యంగా ఉండటమే మేలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే దివంగత మహానేత ఎన్నో చర్యలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందాలనే ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కారణంగానే ఆయనంటే ప్రజలలో విపరీతమైన అభిమానం ఏర్పడిందన్నారు.

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా కొణతాల చెప్పారు.

Back to Top