మ‌ద్యం దుకాణాల‌ను తొల‌గించండి

గుంతకల్లు (అనంత‌పురం): మ‌ద్యం దుకాణాల వ‌ల‌న మ‌హిళ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, వెంట‌నే కొట్టాల రోడ్డులో ఉండే మ‌ద్యం దుకాణాల‌ను అక్క‌డి నుంచి తొల‌గించాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంత‌క‌ల్లు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త వై.వెంక‌ట‌రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం కంపోస్టు యార్డు పరిశీలనకు వచ్చిన వెంకటరామిరెడ్డిని జి.కొట్టాల గ్రామపెద్దలు కలిసి మద్యం దుకాణం తీసివేయించాలని కోరారు. ఈ సందర్భంగా కొట్టాల గ్రామవాసి చెల్లా మిద్దెనారాయణప్ప మాట్లాడుతూ తమ గ్రామం నుంచి రైల్వేస్టేషన్, స్కూల్, ఆస్పత్రులకు రావాలన్నా, పోవాలన్నా ఈ రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తున్నామన్నారు. ఇటీవల ఇక్కడ మద్యం దుకాణం ఏర్పడటంతో రాత్రిపూట తాగుబోతులు రోడ్డుకు అడ్డంగా కూర్చొని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు గట్లపై వాకింగ్‌కు వచ్చే మహిళలు, సమీపంలోని అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తాదులు తాగుబోతులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంతేకాకుండా ప్రధాన రహదారిలో వీధిలైట్లు లేకపోవడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నామని వాపోయారు. ఈ సందర్భంగా వై.వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ కట్టుబాటు, నియమ నిబంధనలతో శాంతియుత జీవనాన్ని చేస్తున్న కొట్టాల గ్రామశివార్లలో మద్యం షాపు పెట్టి అల్లర్లకు కారణమవుతున్నారన్నారు. అధికారులు స్పందించి వెంటనే మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కొట్టాల రోడ్డులో విద్యుత్‌ స్తంభాలు వేసి దీపాలు ఏర్పాటు మరిచారన్నారు.

Back to Top