రెండు కోట్లకు చేరువలో 'జనం సంతకం'

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్ చెప్పారు. ప్రజల ఒత్తిడి మేరకు ఈ కార్యక్రమాన్ని మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు సమయం లభించేవరకూ కొనసాగించనున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దీనిని గుర్తించాలన్నారు. శుక్రవారం ఉదయానికి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయానికి 1.65 కోట్ల సంతకాలు చేరాయని, వీటిని స్కానింగ్ చేయిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు కోటి సంతకాల స్కానింగ్ పూర్తయిందన్నారు. అన్ని జిల్లాల్లో మరో 30 లక్షల సంతకాలు పూర్తయ్యాయని, అవి కూడా పార్టీ కార్యాలయానికి  చేరతాయని చెప్పారు. ఇవి పార్టీ నాయకులు సేకరించినవి మాత్రమేనని, మరికొంత మంది అభిమానులు, వెబ్‌సైట్ల ద్వారా వస్తున్న స్పందన వీటికి అదనమని వివరించారు.

పార్టీల కుమ్మక్కు తీవ్రతను చాటుతున్న సంతకాలు

    అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై సీబీఐని అడ్డుపెట్టుకొని శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని  వేధిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రారంభం నుంచి వస్తున్న భారీ స్పందనను చూస్తే ప్రజల్లో ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్రలపై ఎంత ఆగ్రహం ఉందో తెలుస్తోందన్నారు. రాష్ట్రంలో సంతకాల సేకరణ కొత్త కాకపోయినప్పటికీ, ఇంత భారీఎత్తున అభిమానులు, తటస్థులు స్పందించడం ఎన్నడూ లేదని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం హర్షణీయమని అన్నారు.

సంతకాలతో మహానేత మేలును గుర్తుతెస్తున్నారు

    దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన మేలును మర్చిపోని ప్రజలు సంతకాలు చేస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రికార్డు స్థాయిలో సంతకాల సేకరించారు. ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమంలో భాగంగా ఆయన 2,58,238 మంది చేత సంతకాలు చేయించారు. వాటిని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మకు అందజేశారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఆమె అభినందించారు.

Back to Top