తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు చేపట్టాలిమా ఆందోళన ఫలితమే నేతన్నలకు సర్కారు సాయంవైఎస్ ఫోటోపై కాంగ్రెస్ డ్రామాలుదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధ్వజమెత్తారు. వృత్తివిద్యా కళాశాల విద్యార్థుల ఫీజుల భారం నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. ఏకీకృత ఫీజుల విధానమే ఉండాలని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలనుకోవడం అందులో భాగమేనన్నారు. అలా చేస్తే అడ్మిషన్లు మరింత ఆలస్యమై విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో గట్టు మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వ విధానంవల్ల రూ.482 కోట్ల అదనపు భారాన్ని భరించాల్సి వస్తోందనీ... దీన్నుంచి తప్పించుకునేందుకు ఇంకా జాప్యం చేయడం తగదని చెప్పారు. మీన మేషాలు లెక్కించకుండా ప్రభుత్వం తక్షణమే ఎంసెట్ అడ్మిషన్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులేనందువల్ల విద్య, వైద్యం అందని వారుండకూడదని వైఎస్ ప్రవేశపెట్టిన రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీరుగార్చవద్దని విజ్ఞప్తి చేశారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రమాణాల ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించే కార్యక్రమం తొలుత కోర్టు తీర్పు ఇచ్చినపుడే చేసి ఉంటే బాగుండేదన్నారు.ఇది నేతన్నల విజయం: సంక్షోభంలో ఉన్న నేతన్నలను ఆదుకోవాలని ఇటీవల సిరిసిల్లలో తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, గతంలో ధర్మవరంలో అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఆందోళన ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చి రూ.76 కోట్ల సహాయాన్ని ప్రకటించిందని గట్టు చెప్పారు. ఇందుకోసం పోరాటం చేసింది తమ పార్టీయే అయినా ఈ విజయం మాత్రం నేతన్నలదేనని ప్రకటించారు. సర్కారు అందిస్తోంది స్వల్ప సాయమే అయినా స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తం నుంచి రుణాల మాఫీకి రూ.21 కోట్లు మాత్రమే కేటాయించడం మాత్రం సరికాదన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు నేత కార్మికుల రూ.300 కోట్ల రుణాలను రద్దు చేయాలని నిర్ణయించారనీ, అయితే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు.వైఎస్ ఫొటో పేరుతో డ్రామాలు: వైఎస్ ఫొటో ఉండాలనీ, వద్దనీ కాంగ్రెస్ డ్రామాలాడుతోందని గట్టు విమర్శించారు. వైఎస్‌ను బద్నాం చేసేందుకే ఆయన పేరును తెరమీదకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ను ఒకరు పొగిడితే చాలామంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చి దుష్ర్పచారం ప్రారంభించినరోజే వైఎస్ పేరు ఎత్తే అర్హతను కాంగ్రెస్ నేతలు కోల్పోయారన్నారు. వైఎస్ జీవించి ఉన్నపుడు వానపాములుగా ఉండిన కొందరు నేతలు ఇపుడు తాచుపాముల్లా పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు.