సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం: భూమా

కర్నూలు: సేంద్రియ వ్యవసాయం వైపు నంద్యాల ప్రాంతంలోని రైతులు మొగ్గు చూపడానికి కర్నూలు జిల్లా  నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నడుం బిగించారు. రెండు, మూడు సంవత్సరాల నుంచి ఎరువుల ధరలు తారాస్థాయికి చేరుకోవడం, యూరియా లాంటి వాటికి డిమాండ్ అధికంగా ఉండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడం చూసి వాటికి చెక్ పెట్టడానికి స్వయంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు భూమా ముందుకొస్తున్నారు. జాతీయ స్థాయిలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే సంస్థలకు, శాస్త్రవేత్తలకు ఆళ్లగడ్డ పట్టణంలో తనకున్న పొలంలో 30 ఎకరాలను నాలుగు నెలల పాటు ప్రయోగాలు చేసుకోవడానికి ఇస్తానని  విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిథులకు ఆయన హామీనిచ్చారు. సేంద్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించడానికి మహీం సేవ్ ఎర్త్ ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ప్రతినిధులు జగదీష్ ఆధ్వర్యంలో భూమాను నంద్యాల పట్టణంలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. తమ సంస్థకు చెందిన మందులు ఆర్గానిక్స్‌కు సంబంధించినవని వాటిని నంద్యాల ప్రాంతంలో రైతులు ఉపయోగించే విధంగా సహకరించాలని కోరారు. భూమా వారితో మాట్లాడుతూ ముందుగా రైతులను సేంద్రీయ సాగువైపు మొగ్గు చూపే విధంగా కసరత్తు సాగాలని వారికి సూచించారు.
Back to Top