మంత్రి ఆదినారాయణరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

బైరెడ్డిపల్లెః దళితులను అవమానపరిచే విధంగా మాట్లాడిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని పలమనేరు నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త మొగసాల రెడ్డెమ్మ డిమాండ్‌ చేశారు. బైరెడ్డిపల్లెలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. సంపాదన కోసం జెండాలు మార్చిన మంత్రికి దళితుల గురించి మాట్లాడే అర్హత లేదని ద్వజమెత్తారు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన మంత్రిని వెంటనే పదవి నుండి తొలగించి అరెస్టు చేయాలని ఆరోపించారు. దళితులను కేవలంగా మాట్లాడటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులకు అలవాటయిందన్నారు. సీఎం మొదట దళితులుగా ఎవరైనా పుట్టడానికి ఇష్టపడతారా అన్న మాటలు మరవకముందే మంత్రులు కూడా అదే బాటలో నడుస్తూ దళితులను కించపరచడం సమంజసం కాదన్నారు. రాజీనామాలు చేయకుండానే పదవులు అనుభవిస్తున్న మంత్రులకు బలహీన వర్గాల మనస్సులు అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి నాయకులకు ప్రజలే బుద్దిచెప్పాలన్నారు. బైరెడ్డిపల్లె ఎంపీపీ అధికారపార్టీ నాయకుల మాటలను విననందున భర్త ఉద్యోగం, చౌకదుకాణం తొలగించడం జరిగిందన్నారు. దళితులు చదువుకోరు...శుభ్రంగా ఉండరు అందుకే వెనుకబడిపోయారని కించపరిచేట్టు మాట్లాడటం తగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఫోటోతో గెలిచి రాజీనామా కూడా చేయకుండా మంత్రి పదవి కోసం ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం సిగ్గుచేటన్నారు. ఆయనకు సిగ్గు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీలు తమ ఓటు హక్కుతో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

Back to Top