నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

  • టీడీపీకి బొత్స సత్యనారాయణ బహిరంగ సవాల్
  • పోలీసుల మధ్య కాదు దమ్ముంటే జనం మధ్యలో సన్మానం చేసుకో
  • వెంకయ్య, బాబు వల్లే ప్రజల్లో నేతలంటే చులకన భావం
  • కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే బాబుకు పోలవరం
  • వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: పోలవరం జాతీయ ప్రాజెక్టులో కేంద్రం 70 శాతం, రాష్ట్రం 30 శాతం పెట్టుబడులు పెట్టాలని విభజన చట్టంలో చూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని వైయస్‌ఆర్‌ సీపీ  సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్‌ విసిరారు. చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో.. అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో చైతన్యపథం కార్యక్రమానికి హాజరైన బొత్స చంద్రబాబు, వెంకయ్యలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పెద్దల మాటలతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని చెప్పారు. వెంకయ్య, చంద్రబాబు లాంటి నేతల వల్ల రాజకీయ నేతలంటే ప్రజల్లో పూర్తిగా చులకన భావం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే వ్యవస్థలు రావాలని బొత్స అన్నారు.  

దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ అనుభవం ఉన్న వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తి రెండు మాటలు మాట్లాడడం హేయనీయమన్నారు. పార్లమెంట్‌లో హోదా అడిగిన మాట వాస్తవమే కానీ, అది రాదని పక్కకు తప్పుకున్నానని చెప్పడం దుర్మార్గమన్నారు. హోదా ఇప్పించే విధంగా కేంద్రంతో మాట్లాడలేవా అని ప్రశ్నించారు. విశాఖలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్‌ చేస్తూ హోదా సంజీవని అన్నారు. నెల్లూరు బహిరంగ సభలో 10 సంవత్సరాలు తీసుకువచ్చే విధంగా బాధ్యత తీసుకుంటానన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హోదాను సాధించే వరకు నిద్రపోం అవకాశం ఇవ్వండి అని మాయమాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి సంజీవని అని, మరోసారి ప్యాకేజీ మేలు అంటూ రెండు మాటలు మాట్లాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు హోదా రావడం వల్లే 2007లో ఏపీ పరిశ్రమల్లో సగం ఆ ప్రాంతానికి వెళ్లాయని చెప్పారు. దాంతో అక్కడ ఉద్యోగాలు, ఉపాధి, ప్రజల జీవనం మెరుగుపడిందని తెలిపారు. 

ఏపీకి ప్రత్యేకంగా ఏమీచ్చారు
ప్యాకేజీని తెచ్చానని పోలీసులను పెట్టుకొని సన్మానం చేయించుకోవడం కాదు.. దమ్ముంటే జనం మధ్యలో సన్మానం చేయించుకోవాలని వెంకయ్యనాయుడుకు బొత్స సవాల్‌ విసిరారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పగించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన చట్టంలో పోలవరం కేంద్రానిదే బాధ్యతగా ఉందన్నారు. కమీషన్లు, కాంట్రాక్టులకు కోసం హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు పోలవరాన్ని తెచ్చుకున్నారన్నారు. ఎంతసేపు డబ్బలు దండుకోవడం కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పోలవరాన్ని కేంద్రం నిర్మిస్తే బాబుకు వచ్చిన అభ్యంతరమేంటని నిలదీశారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబులు ఏపీకి విద్యాలయాలు వచ్చాయని ఊకదంపుడుగా గొప్పలు చెప్పుకుంటున్నారని, విభజన చట్టంలో ఉన్న అంశాలు తప్ప ప్రత్యేకించి ఏపీకి ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కోటి జనాభా దాటిన రాష్ట్రంలో విద్యాలయాలు ఏర్పాటు చేయాలనేది కేంద్ర నిర్ణయమన్నారు. ప్యాకేజీ పేరుతో రూ. 1.60 కోట్లు, 2.60 కోట్లు అంటూ అంకెల గారడితో ప్రజలను మభ్యపెడుతున్నారు. వాటి గురించి ప్రజలకు వివరించాలన్నారు. అసెంబ్లీలో తీర్మాణం చేసి విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం జోన్‌ ఇస్తుందా.. ఇవ్వదా చెప్పాలన్నారు. విశాఖ ప్రజలు హక్కుగా భావిస్తున్న రైల్వేజోన్‌ను విజయవాడకు తరలించుకోవాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని బొత్స ఫైరయ్యారు. విజయవాడనే అభివృద్ధి చేస్తే మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలని బాబును ప్రశ్నించారు. దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు మొండిమాటలు కట్టిపెట్టి రాష్ట్రానికి ఏం కావాలి.. ఏం చేయాలి అనే ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. 


Back to Top