హోదా కోసం దేనికైనా సిద్ధం

  • ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా క్యాండిల్ ర్యాలీ చేసి తీరుతాం
  • ఎన్ని ఆంక్షలు విధించినా, అరెస్ట్ లు చేసినా పోరు ఆగదు
  • చీకట్లో ఉన్న ఏపీకి ప్రత్యేకహోదానే వెలుతూరు
  • ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం హోదా సాధించేవరకు పోరాడుతాం
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నంః రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని వైయ్ససార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. చట్టసభల్లో పెట్టిన ప్రత్యేకహోదా అంశాన్ని నెరవేర్చాలని తమ అధినేత వైయస్ జగన్ వివిధ రూపాల్లో  చేస్తున్న పోరాటానికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అమలు పర్చుకున్న రోజైన 26న శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ చేయాలని పార్టీ నిర్ణయించడం జరిగిందని చెప్పారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందని,  విశాఖపట్నం ఆర్కే బీచ్ లో జరిగే క్యాండిల్ ర్యాలీలో వైయస్ జగన్ పాల్గొంటారని తెలిపారు.  ఐతే, హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉన్నా, అది కాదని రిపబ్లిక్ డే చేయడానికి వీల్లేదు, శాంతియుత ర్యాలీ చేయడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టడం దారుణమని నిప్పులు చెరిగారు. 

బాబు నీ ఆలోచన విధానమేంటి..? రాష్ట్రాన్ని ఏం చేయదల్చుకున్నావని బొత్స ప్రశ్నించారు.  పక్కరాష్ట్రం తమిళనాడును చూసైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. జల్లికట్టు అనే ఆటకోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్రంపై ఒత్తిడితెచ్చి పర్మిషన్ తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు.  5కోట్ల మంది జీవన ప్రమాణాలకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రత్యేకహోదాను కాదని బాబు ప్యాకేజీకి మోకరిల్లడంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా రేపు ర్యాలీని నిర్వహించి తీరుతామని బొత్స స్పష్టం చేేశారు. 

చీకట్లో ఉన్న ఏపీకి వెలుగులు తేవడానికి ప్రత్యేకహోదాయే తప్ప ఇంకోటి సాధ్యం కాదన్న నినాదంతో ముందుకు వెళ్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మమ్ముల్ని హింసించినా, అరెస్టులు చేసినా బెదిరేది లేదన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తాము దేనికైనా సిద్ధమని చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా విశాఖ ఆర్కే బీచ్ నుంచి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేసి తీరుతామని తేల్చిచెప్పారు. 

Back to Top