ఇక యుద్ధమే: వైఎస్ జగన్


పశ్చిమ గోదావరి: ‘‘చంద్రబాబు పుణ్యాన ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఎంతో దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. రుణాలు మాఫీ కాలేదు.. బ్యాంకులు కొత్త రుణాలివ్వలేదు. పంటల భీమా రాలేదు. సున్నా శాతం వడ్డీ రుణాలు పోయి.. 14 శాతం వడ్డీతో రుణాలు కట్టాల్సి వస్తోంది.. కరువొచ్చినా ఇన్‌పుట్ సబ్సిడీ ఊసు లేదు. రెండు, మూడు రూపాయల వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి. పండించిన పంటకు కనీస మద్దతు ధర లేదు. వచ్చిన ధరకు అమ్ముకున్నా.. ఆ చెక్కులు తీసుకుని బ్యాంకుకు పోతే పాత బాకీలో జమ  చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రైతులు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటే.. ఆ ఆత్మహత్యలను ఒప్పుకుంటే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందని  బాబు ఒప్పుకోవడం లేదు.’’అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలపై వడ్డీల మీద వడ్డీలు కట్టలేక డ్వాక్రా అక్కచెళ్లెళ్లు ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు  మాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు పై తమ పోరాటం ఇంతటితో ఆగదని ఉద్ఘాటించారు. బాబు మనసు మార్చుకుని హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీలో తీవ్ర ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బాబు మెడలు వంచైనా రైతు, డ్వాక్రా రుణమాఫీ సాధించుకుందామని ప్రజలకు పిలుపు నిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగన్‌మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు సాగించిన దీక్షను ఆదివారం సాయంత్రం విరమించారు. ఈ సందర్భంగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎన్నికల హామీల విషయంలో బాబు తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు గత పాలనలో ఖజానా ఖాళీ అయిందంటూ ప్రజలపై మోపిన పెను పన్నుల భారాన్ని జగన్ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ నిధులు ఎండగట్టడానికి, ప్రజా సంక్షేమ పథకాలకు కోత పెట్టడానికి, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలును క త్తిరించడానికి.. ముందస్తు ఎత్తుగడగానే ఖజానా ఖాళీ అయిందంటూ బాబు ప్రచారం చేస్తున్నారని తూర్పారబట్టారు. నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున  తరలివచ్చిన వారందరికీ ఈ సందర్భంగా జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
Back to Top