శిల్పా కుటుంబంపై ఆరోపణలు హాస్యాస్పదం

  • టీడీపీలో ఉన్నప్పుడు మంచి.. పార్టీ మారితే చెడ్డా?
  • నంద్యాలలో టీడీపీ అభివృద్ధి శిలాపలకాలకే పరిమితం
  • శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి
నంద్యాల: శిల్పా కుటుంబంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిషోర్‌ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు రాత్రి 2 గంటలకు శిల్పా మోహన్‌రెడ్డిని ఇంటికి పిలిపించుకొని మీరు చేసే సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని, మీలాంటి నాయకులు మా పార్టీలో ఉండడం సంతోషమని మాట్లాడి. ఈ రోజున శిల్పా సహకార్, మహిళా సహకార్, స్వచ్ఛంద సంస్థలపై చర్యలు తీసుకుంటామనడం ఎంత వరకు సబబు అన్నారు. నంద్యాల వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శిల్పా కుటుంబం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్రకిషోర్‌ మాట్లాడుతూ..చంద్రబాబు తనయుడు లోకేష్‌ నంద్యాలలో పర్యటించినప్పుడు శిల్పా సహకార్, మహిళా సహకార్‌లను సందర్శించి శిల్పా కుటుంబం అందించే సేవలు అభినందనీయమన్నారని గుర్తు చేవారు. అలాంటిది టీడీపీ నుంచి శిల్పా మోహన్‌రెడ్డి వెళ్లగానే శిల్పా మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మీ పార్టీలో ఉన్నప్పుడు గొప్ప వ్యక్తిగా కనిపించిన శిల్పా మోహన్‌రెడ్డి పార్టీ మారగానే అవినీతి, అక్రమాలు చేస్తున్నాడని మాట్లాడడం సబబు కాదన్నారు. 

డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అనే మాటలు గుర్తున్నాయా.. చంద్రబాబు
నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నాయని అభివృద్ధి అనే అబద్ధంతో టీడీపీ ప్రజల ముందుకు వచ్చిందని రవిచంద్రకిషోర్‌ మండిపడ్డారు. రూ.13 వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు కానీ దీబగుంట్లలో అభివృద్ధి శిలాపలకాలకే పరిమితమైందన్నారు. నంద్యాలలో అభివృద్ధి కోసం శిల్పా మోహన్‌రెడ్డి చంద్రబాబును రూ. 60 కోట్లు అడిగితే డబ్బులు ఏమైనా చెట్టకు కాస్తున్నాయా.. మీ దగ్గర ఉంటే మీరు పెట్టండి అని మాట్లాడిన చంద్రబాబు ఈ రోజున నంద్యాలను అభివృద్ధిని చేస్తున్నాం ఓట్లు వేయండి అని అడగడం హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు తోడు ఆయన మంత్రులు చేరి టీడీపీకి ఓటు వేయకపోతే అభివృద్ది ఆగిపోతుందని ఓటర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. 

చెడు ప్రచారం చేయడం మంచిది కాదు
శిల్పా సహకార బ్యాంక్‌ ద్వారా వేలమంది మహిళలకు రుణాలు ఇచ్చామని శిల్పా చక్రపాణిరెడ్డి కోడలు నాగినిరెడ్డి తెలిపారు. వడ్డీలేని రుణాలు నుంచి అర్థరూపాయి వడ్డీ వరకూ రుణాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఏ మహిళను రుణం కట్టమని గట్టిగా అడిగింది లేదన్నారు. మహిళలకు మంచి గుర్తింపు ఇవ్వడానికే బ్యాంక్‌ పెట్టాం. బ్యాంకు గురించి చెడుగా ప్రచారం చేయడం మంచిది కాదు. బ్యాంకు నష్టాల్లో నడుస్తున్నా సంకల్ప బలంతో ముందుకు నడిపించుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడేలా చేస్తున్నామన్నారు.

అభివృద్ధి కోసం సొంత భూమినే వదులుకున్న వ్యక్తి శిల్పా: శిల్పారెడ్డి
రైతునగరంలో రోడ్డు విస్తరణ కోసం సొంత భూమినే వదులుకున్న శిల్పా కుటుంబంపై చంద్రబాబు ఆరోపణలు చేయడం సబబు కాదని మోహన్‌రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి ధ్వజమెత్తారు. శిల్పా కుటుంబం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పదవులను అనుభవించిందని గుర్తు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డికి టీడీపీలో దక్కిన ఎమ్మెల్సీ పదవిని నైతికి విలువలకు కట్టుబడి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ అడిగిన వెంటనే రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరారన్నారు. చంద్రబాబు ఎంత సేపటికీ శిల్పా కుటుంబంపై నిందలు వేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు. శిల్పా సహకార్, మహిళా సహకార్‌పై విమర్శలు చేయడం మంచిదికాదని దుయ్యబట్టారు. నంద్యాలలో ఏ ఒక్క మహిళలను అడిగినా శిల్పా కుటుంబం వల్ల ఎంత లాభపడ్డారో చెబుతారని చంద్రబాబుకు సూచించారు. నంద్యాలలో ప్రజలకు ఉచితంగా మినరల్‌ వాటర్‌ను సప్లయ్‌ చేస్తున్న వ్యక్తి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఓటర్లు భయపడాల్సిన పనిలేదని, ప్రజలకు అండగా శిల్పా కుటుంబం ఉంటుందని భరోసా ఇచ్చారు. 
Back to Top