►భార్య రావెలశాంతి జ్యోతి పేరుతో కొనుగోళ్లు ►కొనుగోలు 55 ఎకరాలు ►చెల్లించినది 5.5 కోట్లు ►ప్రస్తుత విలువ 82.5 కోట్లు రాజధాని పరిసర ప్రాంతాల్లో అసైన్డు భూములను కొనుగోలు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు తన సహచర మంత్రులతో పోటీ పడ్డారు. ఇతర మంత్రులు బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేస్తే.. రావెల కిశోర్‌బాబు ఏకంగా తన భార్య రావెల శాంతిజ్యోతి పేరుపై భారీ ఎత్తున భూములు కొన్నారు. ఈ క్రమంలో అసైన్డు భూముల చట్టాన్ని అపహాస్యం చేశారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం అసైన్డు భూములు దళిత రైతుల చేతుల్లో ఉన్నాయి. ఆ రైతుల హక్కులను పరిరక్షించాల్సిన మంత్రి రావెల.. వారికి తీరని ద్రోహం చేశారు. అసైన్డు భూములను ప్రభుత్వం ఉత్తినే లాక్కుంటుందని తన సహచరులతో ప్రచారం చేయించి.. దళిత రైతులను భయాందోళనకు గురిచేశారు. ఎకరం భూమిని గరిష్ఠంగా రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మంగళగిరి మండలం కురగల్లులో తెనాలి రూబేనుకు సర్వే నెంబరు 563/3లో 0.83 ఎకరాల అసైన్డు భూమి ఉంది. ఈ భూమి ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ భూమిని తన భార్య రావెల శాంతి జ్యోతి పేరుతో కొనుగోలు చేసిన మంత్రి రావెల.. మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆగస్టు 5, 2015న పెండింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సుమారు 25 ఎకరాల అసైన్డు భూమిని జీపీఏ(జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించుకున్నారు. తన సన్నిహితుడు తేళ్ల శ్రీనివాసరావుకు చెందిన మైత్రీ ఇన్‌ఫ్రా పేరుతో మంగళగిరి మండలం నవులూరులో సర్వే నంబరు 613/2లో 0.75 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అక్టోబరు 16న రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తమ్మీద బినామీలు, తన భార్య పేరుపై సుమారు 55 ఎకరాల అసైన్డు, పట్టా భూములను రావెల కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.