రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని రాస్తారోకో

()ప్రజల ప్రాణాలు తీస్తున్న మృత్యురహదారులు
()నేషనల్ హైవేస్ కార్యాలయం వద్ద వైయస్సార్సీపీ నేతల ధర్నా
()రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్

నెల్లూరు: నెల్లూరు నగర బైపాస్‌ రోడ్డు ఒక మృత్యురహదారిగా మారిందని, బైపాస్‌ రోడ్డు మొత్తం సర్వీస్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బైపాస్‌ రోడ్డును ఆనుకొని వున్న గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు బైపాస్‌ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం నేషనల్‌ హైవేస్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలో 52 మరణాలు సంభవించాయన్నారు. ఓవర్‌ బ్రిడ్జీ, పూర్తిస్థాయి సర్వీస్‌ రోడ్లు నిర్మిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుందన్నారు. గత రెండు నెలలుగా రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని నెల్లూరు నుంచి ఢిల్లీ వరకు రహదారుల అధికారులతో సమస్యను చర్చించానన్నారు. అయినా ఇప్పటి వరకు ఏ అధికారిలో చలనం కలగలేదని మండిపడ్డారు. బైపాస్‌ రోడ్డులో పూర్తిస్థాయి సర్వీస్‌ రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించేవరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధర్నా అనంతరం నేషనల్‌ హైవేస్‌ కార్యాలయంలోని అధికారులకు వేలాది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

నేష‌న‌ల్ హైవేకు మౌలిక స‌దుపాయ‌లు క‌ల్పించాలి
నేష‌న‌ల్ హైవేకు అనుకొని ఉన్న గ్రామాల‌కు స‌రైన ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్‌బ్రిడ్జిలు, స‌ర్వీస్ రోడ్డులు లేక‌పోవ‌డం ఎన్నో ప్ర‌మాదాలు చోటు చేసుకొని వంద‌ల మంది మృతి చెందుతున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ఆనం విజ‌య్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా జ‌రిగి అఖిల‌ప‌క్ష స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న అనంతరం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.  ఎన్టీఆర్ న‌గ‌ర్‌, రాజుపాలెం, చింతారెడ్డిపాలెం. వ‌ల‌గ‌మూడి రోడ్డు తదిత‌ర ప్రాంతాల‌కు నేష‌న‌ల్ హైవే లింక్‌రోడ్డుగా ఉన్నా స‌రైన మౌలిక స‌దుపాయ‌లు లేవ‌న్నారు. నేష‌న‌ల్ హైవేకు పూర్తిస్థాయి భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన బాధ్య‌త నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాపై ఉన్న విష‌యం ఆయ‌న గుర్తుకు చేశారు. ముఖ్యంగా నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సుమారు 8 మున్సిప‌ల్ డివిజ‌న్ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ర‌హ‌దారుల నిర్మాణం వేగ‌వంతంగా చేయాల‌ని ఆయ‌న కోరారు. 
Back to Top