టీడీపీ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింది


-  టీడీపీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారు
 - జమిలీ ఎన్నికలకు టీడీపీ భయపడుతోంది


 కర్నూలు : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైయ‌స్ఆర్‌ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని, ఆ పార్టీ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు.  మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

వైయ‌స్ఆర్‌  సీపీ నుంచి ఫిరాయించిన వారికి సీట్లను కేటాయింపు చేయడంతో టీడీపీ డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ఇప్పటికే రాజకీయ వ్యభిచారం చేస్తున్న సీఎం చంద్రబాబు బాటలోనే లోకేష్‌ రాజకీయ ప్రయాణం సాగుతుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని అన్నారు. వైయ‌స్ఆర్‌  సీపీ  ప్రొడక్టులపై టీడీపీ అధినాయకత్వం బాగానే మమకారం పెంచుకున్నట్లు ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఫిరాయింపుదారులను టీడీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు.

కర్నూలులో 14 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను వైయ‌స్ఆర్‌  సీపీ  గెలవబోతోందని పేర్కొన్నారు. జిల్లాను ఐటీ హబ్‌గా మారుస్తానని బీరాలు పలికిన లోకేష్‌ ఆ దిశగా ఒక్క అడుగైనా వేశారా? అని ప్రశ్నించారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఉన్నా వారికి ఐటీ ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రిబ్బన్‌ కటింగ్‌లు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది కర్నూలు జిల్లా అయితే, నాలుగేళ్లుగా ఇందు కోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే వన్‌ కంట్రీ-వన్‌ ఎలక్షన్‌ (జమిలీ ఎన్నికలు)కు టీడీపీ భయపడుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌  సీపీ  అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.


Back to Top